గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికలతో రండి
గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఫీడర్ అంబులెన్స్‌లు తిరిగి ప్రవేశపెట్టాలి
గర్భిణి వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలి
వచ్చే నెలలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరపాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు.
గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు.
నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలి
అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment