గ్రామీణ స్థానిక సంస్థల నిధులు రూ.998 కోట్లు విడుదల చేయని సర్కారు
ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాల్లో జమకు బ్రేక్
ఇప్పుడు కొత్త ప్రభుత్వం రెండు నెలలుగా తీవ్ర జాప్యం
దీంతో ఈ ఏడాది రావల్సిన నిధులూ విడుదల చేయని కేంద్రం
గత ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించిందంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ల కోసమని కేంద్రం మొన్న ఎన్నికల ముందు విడుదల చేసిన రూ.998 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం రెండున్నర నెలలుగా వాటి ఖాతాల్లో జమచేయకుండా జాప్యం చేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్రం విడుదల చేసింది.
వీటిని 70 : 15 : 15 నిష్పత్తిన రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు–మండల–జిల్లా పరిషత్‌లకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉందని అనుకున్నా.. ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేసిన తర్వాత కూడా కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ వాటి ఊసెత్తడంలేదు. కానీ, గత ఐదేళ్లలో ఈ నిధులను అప్పటి ప్రభుత్వం మళ్లించిందంటూ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు అప్పట్లో నానా యాగీ చేశారు.
ఇప్పుడు తమ బాధ్యతగా విడుదల చేయాల్సిన వాటి గురించి మాత్రం కిక్కురుమనడంలేదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం క్షీణించి డయేరియా ప్రబలడంతో పలువురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పవన్‌కళ్యాణ్ గ్రామాల్లో పారిశుధ్య పనుల నిమిత్తం బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బుల్లేవంటూ విమర్శలు చేస్తున్న ఆయన.. కేంద్రం ఎప్పుడో విడుదల చేసిన నిధులపై మాత్రం మాట్లాడడంలేదు.
కొత్త నిధులిచ్చినా, ఏపీకి మాత్రం..
ఇదిలా ఉంటే.. కేంద్రం ఇప్పటికే విడుదల చేసిన రూ.998 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జమచేయకపోవడంతో కొత్త చిక్కొచ్చి పడింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే మొదటి విడత కింద కొన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్రం మన రాష్ట్రానికి మాత్రం ఇవ్వలేదు.
ఎందుకంటే.. గతంలో విడుదల చేసిన నిధులను విడుదల చేస్తేనేగానీ కొత్తగా కేంద్ర ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ సిఫార్సు చేయదు. ఈ నేపథ్యంలో.. రూ.998 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థలకు చెల్లిస్తేనే ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి విడత నిధులు వచ్చే అవకాశముందని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment