సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలపై భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజక వర్గంలో రహదారుల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేయడంపై.. ఇది నిధుల మళ్లింపు కిందకే వస్తుంది కదా! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
2021నవంబర్‌లో జవాద్ తుఫాన్ వల్ల స్వర్ణ ముఖి నదిపై దెబ్బతిన్న కాజ్ వే నిర్మాణాలకు నిధులు కేటాయించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రబాబు కోరారు. దీనిపైన స్పందించిన బాబు.. తిరుపతి కొత్తపల్లి మిట్ట మార్గంలో చిగురు వాడ వద్ద స్వర్ణముఖి నదిపై కాజ్ వే నిర్మాణం, తనపల్లి రోడ్ తాజ్ హోటల్ సమీపంలో కాజ్ వే నిర్మాణం, తిరుపతి పూడి మార్గం తిరుచానూరు వద్ద కాజ్ వే నిర్మాణం, ఐతేపల్లి రంగం పేట రోడ్ ఐతేపల్లి వద్ద కాజ్ వే నిర్మాణానికి టీటీడీ నిధులుతో నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని అభ్యర్థన మేరకు సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. అయితే టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కేటాయించడంపై ప్రజలు, టీటీడీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపత్యంలో టీటీడీ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలు మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment