‘హనీట్రాప్‌’తో లీక్‌ | Two employees of TSPSC are masterminds of paper leakage | Sakshi
Sakshi News home page

‘హనీట్రాప్‌’తో లీక్‌

Published Mon, Mar 13 2023 1:26 AM | Last Updated on Mon, Mar 13 2023 1:26 AM

Two employees of TSPSC are masterminds of paper leakage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌’ పరీక్ష పేపర్‌ లీకేజీ వెనుక హనీట్రాప్‌ ఉన్నట్టు బయటపడింది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్‌ కోరిక మేరకే ప్రవీణ్‌ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్‌ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్‌ను విక్రయించినట్టు వెల్లడైంది.

ఈ క్రమంలోనే పేపర్‌ లీకేజ్‌ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

సోదరుడి కోసమంటూ అడిగి 
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది.

టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్‌ వెంటనే అంగీకరించాడు. టీఎస్‌పీఎస్సీలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్‌ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్‌కు చెందిన సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్‌లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్‌ ఆ కంప్యూటర్‌పై నిఘా పెట్టారు. 

28న తస్కరణ.. 2న కాల్చివేత.. 
ప్రవీణ్, రాజశేఖర్‌ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్‌ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్‌వాల్స్‌ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్‌ను ఓ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్‌ కంప్యూటర్‌ నుంచి ప్రింట్‌ ఔట్‌ తీసుకున్నారు. ప్రవీణ్‌ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు.

కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్‌ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్‌ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్‌ కుమారుడితో తన వద్ద టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్‌ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్‌ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్‌ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్‌ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. 

ఓ అభ్యర్థి రూమ్మేట్‌కు తెలియడంతో.. 
రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్‌.. తనకు తిరిగిచ్చిన పేపర్‌ను సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్‌ సైతం కొన్నాళ్లుగా టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్‌ లీకేజీని రూమ్మేట్‌కు చెప్పాడు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్‌ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్‌పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్‌–100’కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్‌ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్‌ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. 

‘అసిస్టెంట్‌ ఇంజనీర్‌’ పేపర్‌ సైతం లీక్‌? 
టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీపై బేగంబజార్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్‌ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్‌ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్‌ ఇంజనీర్‌’ పరీక్ష పేపర్లు కూడా లీక్‌ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్‌ లీకేజీ అంశంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement