anitha ramachandran
-
TSPSC: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్‌లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్‌గా సిట్ సేకరించింది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం.. అంతకు ముందు.. అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. -
TSPSC: పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఇరువురినీ వేర్వేరుగా దాదాపు రెండు గంటల చొప్పున విచారించింది. కమిషన్ నిర్వహణ తీరు, లోపాలు, నిబంధనలు సహా అనేక అంశాలపై 27 ప్రశ్నలు సంధించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అనిత కార్యాలయానికి వెళ్లి విచారించాలని సిట్ అధికారులు భావించగా తానే సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పిన అనిత.. అన్నట్లుగా శనివారం ఉదయం వచ్చారు. లింగారెడ్డి మధ్యాహ్నం సిట్ అధికారుల ముందు హాజరుకాగా ఇద్దరినీ దాదాపు 2 గంటల చొప్పున ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ నిర్లక్ష్యం లేదా? అనే అంశంపై కొంత సమాచారం సేకరించారు. సిబ్బందే లీక్ చేస్తారనుకోలేదు.. జాగ్రత్తలన్నీ తీసుకొనే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని... కానీ కమిషన్‌లో పనిచేసే సిబ్బందే లీకేజీకి పాల్పడతారని ఊహించలేదని అనితా రాంచంద్రన్, లింగారెడ్డి స్పష్టం చేశారు. నిందితులు కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నందున ఏ సందర్భంలోనూ వారిపై అనుమానం రాలేదని సిట్‌కు తెలిపారు. సైబర్ ఆడిటింగ్‌లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడానికిగల కారణాలపైనా సిట్ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు. కమిషన్ పరిధిలోని అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ఇతర శాఖల పరిధిలోని అంశాల్లోనే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కమిషన్‌లో చైర్మన్ నుంచి ఉన్నతోద్యోగుల వరకు ఎవరి బాధ్యతలు ఏమిటన్నది అగడటంతోపాటు వాటిని సంబంధిత వ్యక్తులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటోందా? అనే అంశంపైనా సిట్ అనిత, లింగారెడ్డిల నుంచి సమాచారం సేకరించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, కస్టోడియన్ల ఎంపిక తదితర విషయాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కీలక బాధ్యతల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడంపైనా పోలీసులు ప్రశ్నించారు. అయితే విధానపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో తీసుకోరని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అనిత, లింగారెడ్డి సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు రాయవచ్చా? అనే అంశంపై సిట్ అనితను ప్రశ్నించింది. ఇలా రాయకూడదని ఎలాంటి నిబంధన లేదన్న ఆమె గతంలోనూ అనేక మంది ఉద్యోగులు రాశారని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితోపాటు మిగిలిన సభ్యులు, ఉన్నతాధికారులకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చి విచారించడం ద్వారా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం... అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? తదితర అంశాలు సరిచూడటానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారు. -
సిట్ ఆఫీస్‌లో ముగిసిన అనిత విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకాలం లీకేజీ రాయులు, అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ ఉద్యోగులనే ప్రశ్నించిన దర్యాప్తు బృందం, ఇప్పుడు ఏకంగా కమిషన్‌లోని సభ్యులపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో.. ఇవాళ కమిషన్ సెక్రెటరీ అనితా రామచంద్రన్(ఐఏఎస్)ను సిట్ విచారించింది. శనివారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు అనితా రామచంద్రన్. సుమారు రెండు గంటలపాటు ఆమెను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ మేరకు ఆమె నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం తదితర వ్యవహరాలన్నీ కాన్ఫిడెన్షియల్ విభాగం పరిధిలోనే ఉంటాయి. ఈ విభాగం పూర్తిగా సెక్రెటరీ అయిన అనిత పర్యవేక్షణలోనే ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్ విభాగంలో పని చేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్ని హ్యాక్ చేసి.. ప్రశ్నాపత్రాలు కొట్టేసినట్లు సిట్ ఇదివరకే ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అనితా రామచంద్రన్‌ను సిట్ విచారించింది. మరోవైపు పేపర్ లీకేజ్‌లో నిందితుడిగా ఉన్న రమేష్, కమిషన్ సభ్యుడైన లింగారెడ్డికి పీఏగా తెలుస్తోంది. వీరిద్ధిరి మధ్య సత్సబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అనితకు, లింగారెడ్డిలకు సీఆర్పీసీ సెక్షన్ 91, సెక్షన్ 160ల ప్రకారం వీళ్లిద్దరికీ సిట్ నోటీసులు జారీ చేసింది. అనితా రామచంద్రన్, లింగారెడ్డిలు అందించే వివరాలను బట్టి.. సిట్ కమిషన్‌లోనే మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్‌పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్‌వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్‌ను ఓ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్‌ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్‌ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్‌ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్‌ను సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ
సాక్షి, యాదాద్రి: కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిలో అలసత్వం చేసినందుకు ఆమెను వేరే చోటికి బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా అనితా రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. కాగా అంతకముందు పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి -
పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో గ్రామస్తులు, బాధితులతో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్ హాజీపూర్‌లో గురువారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలి బాబాయ్ ప్రవీణ్ ఏసీపీ భుజంగరావు కాళ్లపై పడి బోరుమన్నాడు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారని ప్రశంసల వర్షం కురిపించారు. ముగ్గురు బాలికల తండ్రులు మల్లేష్, నర్సింహ, తుంగని నందం మాట్లాడుతూ నిందితుడికి ఉరి శిక్ష త్వరగా అమలు చేయాలని, వాడి ప్రాణం పోయినప్పుడే తమ పిల్లల ఆత్మలు శాంతిస్తాయన్నారు. గ్రామానికి వంతెన మంజూ రు చేయాలనే ప్రజల వినతిపై కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందించి రూ. కోటి 70 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ఓ కుటుంబానికి ప్రభుత్వసాయం అందడం లేదని, కోర్టు ద్వారా అíప్పీల్కు వెళితే తప్పక న్యాయం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ గారూ ఆదుకోండి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పెద్ద కూతురుకు మానసిక సమస్య. ఉన్న ఒక్క కొడుకు వికలాంగుడు. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇంటి పెద్ద పనిచేస్తేనే పూట గడుస్తుంది. చురుకుగా ఉన్న నా చిన్న కూతురు ను కిరాతకుడు శ్రీనివాస్‌రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం రూ.లక్ష దాటలేదు. ఇప్పుడేమో తమకు ప్రభుత్వ సాయం అందదని తెలిసింది. ఎలాంటి ఆధారం లేని తమను మీరే పెద్ద మనసు చేసుకొని ఆదుకోవాలి. జీవనోపాధి కోసం ఉద్యోగం ఇప్పించాలి. – మైసిరెడ్డిపల్లి బాలిక కుటుంబ సభ్యులు -
ఆకట్టుకున్న డ్వాక్రా బజార్
సాక్షి, హైదరాబాద్: ‘డ్వాక్రా బజార్’ పేరుతో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద మంగళవారం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. స్టాల్స్‌లో ఉంచిన పలు వస్తువులు, గృహోపకరణాలు, గాజులు, చీరలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు.