సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించింది. సిట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఇరువురినీ వేర్వేరుగా దాదాపు రెండు గంటల చొప్పున విచారించింది. కమిషన్ నిర్వహణ తీరు, లోపాలు, నిబంధనలు సహా అనేక అంశాలపై 27 ప్రశ్నలు సంధించి వాంగ్మూలాలు నమోదు చేసింది.
అనిత కార్యాలయానికి వెళ్లి విచారించాలని సిట్ అధికారులు భావించగా తానే సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పిన అనిత.. అన్నట్లుగా శనివారం ఉదయం వచ్చారు. లింగారెడ్డి మధ్యాహ్నం సిట్ అధికారుల ముందు హాజరుకాగా ఇద్దరినీ దాదాపు 2 గంటల చొప్పున ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ నిర్లక్ష్యం లేదా? అనే అంశంపై కొంత సమాచారం సేకరించారు.
సిబ్బందే లీక్ చేస్తారనుకోలేదు..
జాగ్రత్తలన్నీ తీసుకొనే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని... కానీ కమిషన్‌లో పనిచేసే సిబ్బందే లీకేజీకి పాల్పడతారని ఊహించలేదని అనితా రాంచంద్రన్, లింగారెడ్డి స్పష్టం చేశారు. నిందితులు కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నందున ఏ సందర్భంలోనూ వారిపై అనుమానం రాలేదని సిట్‌కు తెలిపారు. సైబర్ ఆడిటింగ్‌లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడానికిగల కారణాలపైనా సిట్ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు.
కమిషన్ పరిధిలోని అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ఇతర శాఖల పరిధిలోని అంశాల్లోనే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కమిషన్‌లో చైర్మన్ నుంచి ఉన్నతోద్యోగుల వరకు ఎవరి బాధ్యతలు ఏమిటన్నది అగడటంతోపాటు వాటిని సంబంధిత వ్యక్తులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటోందా? అనే అంశంపైనా సిట్ అనిత, లింగారెడ్డిల నుంచి సమాచారం సేకరించింది.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, కస్టోడియన్ల ఎంపిక తదితర విషయాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కీలక బాధ్యతల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడంపైనా పోలీసులు ప్రశ్నించారు. అయితే విధానపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో తీసుకోరని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అనిత, లింగారెడ్డి సిట్ దృష్టికి తీసుకువెళ్లారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు రాయవచ్చా? అనే అంశంపై సిట్ అనితను ప్రశ్నించింది. ఇలా రాయకూడదని ఎలాంటి నిబంధన లేదన్న ఆమె గతంలోనూ అనేక మంది ఉద్యోగులు రాశారని వివరించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితోపాటు మిగిలిన సభ్యులు, ఉన్నతాధికారులకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చి విచారించడం ద్వారా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం...
అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? తదితర అంశాలు సరిచూడటానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారు.
TSPSC: పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా?
Published Sun, Apr 2 2023 3:05 AM | Last Updated on Sun, Apr 2 2023 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment