TSPSC Question Paper Leak Case 2023
-
TSPSC Case: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్.. ఏముందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ కేసును కేసీఆర్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్ లీక్ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్ లీకైంది. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
TSPSC Case: విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 46కు చేరుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్, విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న నర్సింగరావు అరెస్ట్ అయ్యారు. కాగా, నర్సింగరావు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు స్నేహితుడు. ఇక, ఏఈఈ పేపర్‌కు ప్రవీణ్.. నర్సింగరావుకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. రవి కిషోర్ నుంచి రమేశ్ పేపర్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణల బీజేపీ దుకాణం బందైనట్టే.. -
ఒకటి... రెండు... మూడు! అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించింది ‘లీకు వీరులుగా’తేలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు, అతడి భార్య శాంతికి రెండో ర్యాంకు, మరో నిందితురాలు లవడ్యావత్ రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. ఈ ముగ్గురూ లీౖకైన మాస్టర్ ప్రశ్నపత్రం ఆధారంగానే పరీక్షలు రాసినట్లు అధికారులు తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన రాజేశ్వర్‌కి బెయిల్ కూడా వచ్చింది. దీంతో శాంతి, రాహుల్‌తో పాటు టీఎస్పీఎస్సీ మాజీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్‌కు చెందిన దళారి రమావత్ దత్తులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రేణుక ద్వారా రాహుల్‌కు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాహుల్‌కు కొన్నేళ్లుగా లీకేజీలో కీలక సూత్రధారి అయిన ప్రవీణ్‌కుమార్ స్నేహితురాలు రేణుకతో పరిచయం ఉంది. డీఏఓ పరీక్ష రాస్తున్నాడనే విషయం తెలిసిన రేణుక ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్‌ను కలిసి డీఏఓ మాస్టర్ పేపర్‌ను చూపించింది. అందులో ఉన్న ప్రశ్నలు–జవాబులను రాహుల్ తన వద్ద ఉన్న నోట్ బుక్‌లో రాసుకున్నాడు. వీటి ఆధారంగా పరీక్షకు సిద్ధమైన అతడు మూడో ర్యాంకు సాధించాడు. ఇదే పేపర్‌ను రేణుక భర్త డాక్యా నుంచి తీసుకుని రాజేశ్వర్, అతడి భార్య శాంతి పరీక్ష రాశారు. తొలి పది ర్యాంకులు వచ్చిన వారిపై దృష్టి లీకేజ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు వివిధ కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. ప్రతి పరీక్షలోనూ అధిక మార్కులు, మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఏఓ పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన పోలీసులు శాంతి, రాహుల్, సుచరిత, రాజేశ్వర్‌ల వ్యవహారం గుర్తించారు. రాజేశ్వర్ గతంలోనే ఈ కేసులో అరెస్టు అవడంతో బుధవారం రాహుల్, శాంతి, సుచరిత, దత్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్లు విషయం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ పేపర్ వీరి నుంచి మరెవరికైనా చేరిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నలుగురినీ కస్టడీకి కోరాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ అరెస్టులతో కలిసి ఇప్పటి వరకు లీకేజ్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 34కు చేరింది. -
TSPSC: పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. ఎంపీడీవో ఆఫీసు ఉద్యోగి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్‌ను తన తమ్ముడు రవి కోసం భగవంత్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డాక్యా నాయక్ ఖాతాలను విశ్లేషించగా.. రూ.2లక్షలకు భగవంత్ ఏఈ పేపర్ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? -
టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సుమారు రూ. 40 లక్షలు చేతులు మారినట్లు తేలడం, ఇందులో మనీలాండరింగ్ కోణం ఉండటంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... తాజాగా పరీక్షల నిర్వహణ తీరుతెన్నులు, లీకేజీ పరిణామాలపై కమిషన్ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను సోమవారం సుదీర్ఘంగా విచారించింది. వారిని ఏకదాటిగా 11 గంటలపాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అన్ని కోణాల్లో ప్రశ్నలు..: ఈడీ అధికారుల నోటీసుల మేరకు జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌లు సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని వేర్వేరుగా అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది..? ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, చైర్మన్, కార్యదర్శిల పర్యవేక్షణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉద్యోగుల విధులు, ఆ విభాగంలోకి ఇతర ఉద్యోగులు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. అలాగే పేపర్ల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తీరు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపైనా ప్రశ్నించారు. అనంతరం ఈ కేసులోని కీలక నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డిల పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. ఉద్యోగంలో వారి చేరికతోపాటు విధులు, బాధ్యతలు, ప్రవర్తన ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే మహిళా అభ్యర్థులతో ప్రవీణ్ స్నేహాల గురించి అనితా రామ్చంద్రన్ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. లీకేజీకి పాల్పడిన ఉద్యోగులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు...? ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరైనా ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు మీ అంతర్గత దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? అని జనార్దన్‌రెడ్డిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఉద్యోగులను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఈ కేసులో నిందితురాలైన గురుకుల టీచర్ రేణుకకు సంబంధించిన వివరాలపై ముగ్గురు గురుకుల టీచర్ల నుంచి కూడా ఈడీ అధికారులు సోమవారం వాంగ్మూలాలు తీసుకున్నట్లు సమాచారం. -
టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. కమిషన్ సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ శంకరలక్ష్మిలకు బుధ, గురువారాల్లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డు చేసిన తర్వాత కమిషన్ కార్యదర్శిని, చైర్మన్‌ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేగంబజార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ ప్రారంభించింది. పేపర్ లీకేజీతో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పీఎమ్ఎల్ఏ) కింద ఈడీ జప్తు చేయనుంది. వారి విచారణకు అనుమతించండి.. చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, నిందితుల విచారణకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లేందుకు వీలుగా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. కాగా ప్రశ్నపత్రాల లీకేజీపై మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, నిఘా విభాగాల ద్వారా వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ప్రశ్నపత్రాల అమ్మకాల్లో మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో గత నెల 23న సీసీఎస్ ఏసీపీకి రాసిన లెటర్‌ను పిటిషన్‌కు అటాచ్ చేసింది. రూ.40 లక్షలపై ఆరా ఈ కేసులో సిట్ ఇప్పటివరకు రూ.40 లక్షలు సీజ్ చేసింది. వీటి వివరాలను ఈడీ సేకరించనుంది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల బ్యాంక్ లావాదేవీలు ఆధారంగా మనీలాండరింగ్‌పై సమాచారం సేకరించింది. న్యూజిలాండ్‌లోని రాజశేఖర్‌రెడ్డి బావకు ఎనీడెస్క్ యాప్ ద్వారా గ్రూప్–1 పేపర్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి ద్వారా విదేశాల్లో ఉన్న ఎవరికైనా పేపర్ షేర్ అయ్యిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. వారి నుంచి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఖాతాలకు కానీ, ఇతరులకు కానీ మనీలాండరింగ్ జరిగిందా అనే వివరాలను రాబట్టనుంది. లీకేజీ సమయంలో నిందితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు లేఖలు రాయనుంది. -
సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
సాక్షి, హైదరాబాద్: కమిషన్‌లో పనిచేస్తున్న వ్యక్తులే పేపర్ల లీకేజీకి పాల్పడతారని ఊహించలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సిట్ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ప్రవీణ్, రాజశేఖర్, రమేష్, షమీమ్‌లపై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని... ఈ నేపథ్యంలో ఇలాంటి లీకేజీ జరుగుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి నుంచి స్వా«ధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత తదితర అంశాలపైనే జనార్దన్‌రెడ్డిని విచారించారు. పర్యవేక్షణ బాధ్యత నాదే: చైర్మన్ ప్రశ్నపత్రాల తయారీ, భద్రత పర్యవేక్షణ తనదేనని విచారణ సందర్భంగా చైర్మన్ పోలీసులకు తెలిపారు. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీకి సెట్టర్స్‌గా పిలిచే నిపుణుల సహాయం తీసుకుంటామని, వారినే వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఆహ్వానిస్తామని వివరించారు. అక్కడకు వచ్చే వరకు ఒక సెట్టర్ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్తలు ఉంటాయన్నారు. వారు రూపొందించిన ప్రశ్నపత్రం కాపీలను కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లో భద్రపరుస్తారని, ఓ డిజిటల్ కాపీని సెక్షన్‌లోని లాకర్లో ఉంచడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని జనార్దన్‌రెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. తనతోపాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులే ప్రశ్నపత్రం తయారీలో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వివరించారు. లీకేజీ వ్యవహారంలో కస్టోడియన్ నిర్లక్ష్యం సహా వివిధ అంశాలపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని, అది పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారని తెలిసింది. వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్న దర్యాప్తు అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేయనున్నారు. పరీక్షలు రాసిన ఉద్యోగులపైనా ఆరా పరీక్షలకు హాజరైన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో ఎందరు అనుమతి పొందారనే అంశాన్నీ సిట్ సేకరిస్తోంది. కమిషన్ ఉద్యోగులు, సభ్యులకు బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారా? వారి పరిస్థితి ఏంటి? తదితర వివరాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది. కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్, కస్టోడియన్ ఛాంబర్‌తో పాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రమేష్, షమీమ్‌లు కూర్చునే సీట్ల వద్దా తనిఖీలు చేశారు. అక్కడ నుంచి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భద్రత పెంచాలని సూచించాం.. మా దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో ఉన్న అనేక లోపాలను గుర్తించాం. ల్యాన్లో మార్పుచేర్పులు, యాక్సస్ కంట్రోల్, త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఇలా అనేక ఆవశ్యకతలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాం. సైబర్ ఆడిట్ సిఫార్సుల ప్రకారం భద్రత పెంచాలని సూచించాం. – ఓ ఉన్నతాధికారి -
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
అమ్ముడైంది 40లక్షలకు.. అందింది 23లక్షలు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ‘ఆర్థికాంశాలు’ కొలిక్కివచ్చాయి. ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నియామక పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించారని, ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్ష ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇందులో ఇప్పటికే రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్లను పంచుకున్నారే తప్ప అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ పేపర్లు తస్కరించినట్లు ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. ఏఈ పరీక్ష పేపర్లను ప్రవీణ్ తన స్నేహితురాలైన రేణుక రాథోడ్, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు ఇచ్చాడు. నమ్మకమైన వారికే వీటిని విక్రయించాలని చెప్పాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. డాక్యా ఈ పేపర్ల గురించి సమీప బంధువైన కేతావత్ రాజేశ్వర్‌కు చెప్పాడు. ఇతడు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారానే గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించాడు. వీరి నుంచి రూ.23 లక్షలు వసూలు చేసిన రాజేశ్వర్.. అందులోంచి డాక్యాకు రూ.10 లక్షలిచ్చాడు. తన వాటాగా వచ్చిన దీని నుంచి ఇతగాడు మరో రూ.5 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ తన వద్దకు వచ్చిన డబ్బులోంచి (మొత్తం రూ.10 లక్షలు) రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకుని, రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. ఓ బీమా పాలసీకి సంబంధించి రూ.1.2 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇతర ఖర్చులకు వాడేశాడు. ఈ సొమ్ములో సిట్ అధికారులు రూ.7.5 లక్షలు రికవరీ చేశారు. గ్రామానికి రూ.8 లక్షలు వెచ్చించిన రాజేశ్వర్ గతంలో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్ నష్టాలు రావడంతో ఆపేశాడు. ఇతడి తల్లి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా ఉన్నారు. ఈమె తరఫున గ్రామంలో అభివృద్ధి పనులను ఇతడే పర్యవేక్షిస్తుంటాడు. పేపర్లు విక్రయించగా వచ్చిన మొత్తంలో డాక్యాకు ఇచ్చింది మినహా మిగిలింది తన వద్దే ఉంచుకున్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చేతికందే రూ.17 లక్షల నుంచి మిగిలిన వారికి వాటాలు ఇవ్వాలనుకున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ములో రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేశాక ఆ మొత్తం తాను తీసుకోవాలని భావించాడు. నిందితుడి విచారణలో సిట్ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బిల్లులకు సంబంధించిన మొత్తం తమకు అందేలా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు నోటీసులు ఇవ్వకుండా... సిట్ అధికారులు శనివారం కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలోనే పని చేస్తుంది. ఈ స్కామ్ మొత్తం ప్రశ్నపత్రాలకు సంబంధించిందే కావడంతో చైర్మన్ వాంగ్మూలం నమోదు అనివార్యంగా మారింది. అయితే కార్యదర్శి, సభ్యులు, ఉన్నతోద్యోగుల మాదిరిగా చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ పోస్టు రాజ్యాంగ బద్ధమైంది కావడంతోపాటు ప్రస్తుత చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడానికి బదులు స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సోమవారమే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
TSPSC: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్‌లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్‌గా సిట్ సేకరించింది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం.. అంతకు ముందు.. అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. -
TSPSC: పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఇరువురినీ వేర్వేరుగా దాదాపు రెండు గంటల చొప్పున విచారించింది. కమిషన్ నిర్వహణ తీరు, లోపాలు, నిబంధనలు సహా అనేక అంశాలపై 27 ప్రశ్నలు సంధించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అనిత కార్యాలయానికి వెళ్లి విచారించాలని సిట్ అధికారులు భావించగా తానే సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పిన అనిత.. అన్నట్లుగా శనివారం ఉదయం వచ్చారు. లింగారెడ్డి మధ్యాహ్నం సిట్ అధికారుల ముందు హాజరుకాగా ఇద్దరినీ దాదాపు 2 గంటల చొప్పున ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ నిర్లక్ష్యం లేదా? అనే అంశంపై కొంత సమాచారం సేకరించారు. సిబ్బందే లీక్ చేస్తారనుకోలేదు.. జాగ్రత్తలన్నీ తీసుకొనే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని... కానీ కమిషన్‌లో పనిచేసే సిబ్బందే లీకేజీకి పాల్పడతారని ఊహించలేదని అనితా రాంచంద్రన్, లింగారెడ్డి స్పష్టం చేశారు. నిందితులు కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నందున ఏ సందర్భంలోనూ వారిపై అనుమానం రాలేదని సిట్‌కు తెలిపారు. సైబర్ ఆడిటింగ్‌లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడానికిగల కారణాలపైనా సిట్ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు. కమిషన్ పరిధిలోని అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ఇతర శాఖల పరిధిలోని అంశాల్లోనే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కమిషన్‌లో చైర్మన్ నుంచి ఉన్నతోద్యోగుల వరకు ఎవరి బాధ్యతలు ఏమిటన్నది అగడటంతోపాటు వాటిని సంబంధిత వ్యక్తులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటోందా? అనే అంశంపైనా సిట్ అనిత, లింగారెడ్డిల నుంచి సమాచారం సేకరించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, కస్టోడియన్ల ఎంపిక తదితర విషయాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కీలక బాధ్యతల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడంపైనా పోలీసులు ప్రశ్నించారు. అయితే విధానపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో తీసుకోరని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అనిత, లింగారెడ్డి సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు రాయవచ్చా? అనే అంశంపై సిట్ అనితను ప్రశ్నించింది. ఇలా రాయకూడదని ఎలాంటి నిబంధన లేదన్న ఆమె గతంలోనూ అనేక మంది ఉద్యోగులు రాశారని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితోపాటు మిగిలిన సభ్యులు, ఉన్నతాధికారులకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చి విచారించడం ద్వారా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం... అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? తదితర అంశాలు సరిచూడటానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారు. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్‌కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్‌రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్‌కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్‌కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్‌కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్‌కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్‌కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్‌ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను యాక్సెస్ చేసిన ప్రశాంత్‌రెడ్డి.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్‌కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్‌లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
నేనామైనా క్రిమినల్నా.. నాపై ఎందుకింత కక్ష: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో వైఎస్సార్టీపీ శ్రేణులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, వైఎస్సార్టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేపర్ లీక్‌లో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నేను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని బయటకు వచ్చాను. ఒక హోటల్ రూమ్‌లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారు. నేను క్రిమినల్నా అని ప్రశ్నించారు. -
Telangana: 15 పేపర్లు అవుట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించి ఏకంగా 15 క్వశ్చన్ పేపర్లు ముందే బయటకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. గ్రూప్–1 పేపర్ లీక్ ఐదుగురికే పరిమితమైందని, ఏఈ ప్రశ్నపత్రం పలువురికి విక్రయించారని, మిగతావి పెన్‌డ్రైవ్‌కే పరిమితమైనట్లు స్పష్టమైంది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు తస్కరించేందుకు కూడా నిందితులు పథకం వేసినట్లు బయటపడింది. అన్నీ మాస్టర్ ప్రశ్నపత్రాలే.. ఈ స్కామ్‌లో సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ పీఏ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో పాటు 13 మంది నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. గతేడాది అక్టోబర్ మొదలు గత నెల ఆఖరి వారం వరకు సాగిన ఈ లీకేజ్ వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్.. సురేష్, రమేష్‌లకు కూడా ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి.. షమీమ్‌కు, న్యూజిలాండ్‌లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్ రెడ్డికి ఇచ్చాడు. ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. గత నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పత్రాలు నీలేష్, గోపాల్, ప్రశాంత్, రాజేంద్రకుమార్ ఖరీదు చేశారని తేల్చారు. వీరి ద్వారా మరికొందరికి చేరే అవకాశాలు తక్కువని చెప్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) టౌన్ ప్లానింగ్ బిజినెస్ ఓవర్సీర్ (టీపీబీఓ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లని సిట్ అధికారులు చెప్తున్నారు. వీటిల్లో ఆయా ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు తీసుకున్నవారు, ఏఈ పేపర్‌ను ఖరీదు చేసిన వారు.. సిద్ధం కావడం తేలికైంది. లేనిపక్షంలో సమాధానాలు వెతుక్కోవడానికి, ఆపై సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమై ఉండేదని అంటున్నారు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు కొట్టేసేందుకూ ప్లాన్ గ్రూప్–1, ఏఈఈ మినహా మిగిలినవి ప్రవీణ్ వద్దే ఉండిపోయాయని, ఖరీదు చేసే వాళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే స్కామ్ వెలుగు చూసిందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబం«ధించిన పేపర్లు కూడా కస్టోడియన్ కంప్యూటర్ నుంచి తస్కరించాలని పథకం వేశారని, ఈ మేరకు షమీమ్, సురేష్, రమేష్, ప్రశాంత్‌రెడ్డిలకు సమాచారం ఇచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 గంటల పాటు విచారణ పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌లను సిట్ పోలీసులు రెండోరోజు గురువారమూ 8 గంటల పాటు ప్రశ్నించారు. ఎల్బీనగర్, సైదాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోని వారివారి ఇళ్లకు వెళ్లి ఆధారాల కోసం సోదాలు చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం గురువారం మరోసారి నమోదు చేశారు. ఆ 15 ప్రశ్నపత్రాల జాబితా ఇది... 1. గ్రూప్–1 జనరల్ స్టడీస్ 2. ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ 3. ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4. ఏఈఈ మెకానికల్ ఇంజనీరింగ్ 5. డీఏఓ జనరల్ స్టడీస్ 6. డీఏఓ మేథమెటిక్స్ 7. జనరల్ స్టడీస్ డిప్లొమా ఏఈ 8. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 9. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 10. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 11. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 12. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 13. టీపీబీఓ ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్–1 14. టీపీబీఓ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పేపర్–2 15. జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ -
పని పూర్తి చేయమంటే 'పేపర్ అమ్మమన్నాడు'!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పనుల ఆలస్యంపై ఓ సర్పంచ్ కుమారుడిని ప్రశ్నించడంతోనే తిరుపతయ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో భాగస్వామి అయ్యాడని తెలుస్తోంది. ఇతడితో పాటు ఇద్దరు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వీరిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క లీకేజీ కేసులో జైలుకు వెళ్లిన టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగులు షమీమ్, సురేశ్, రమేశ్‌లను పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ నుంచి రేణుక, ఆమె భర్త డాక్యాలకు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు అందిన విషయం తెలిసిందే. వీటిని విక్రయించడానికి ఈ భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్న దళారుల్లో తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు చెందిన కేతావత్ రాజేశ్వర్ అలియాస్ రాజు ఒకరు. రాజేశ్వర్ తల్లి మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజేశ్వర్ పర్యవేక్షించేవాడు. సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఎనిమిదేళ్లుగా గండీడ్ మండలంలో పని చేస్తున్నాడు. దీంతో తిరుపతయ్య, రాజేశ్వర్ మధ్య పరిచయాలు ఉన్నాయి. మన్సూర్‌పల్లి తండాలో జరిగే ఓ అభివృద్ధి పనిని తిరుపతయ్య పర్యవేక్షిస్తున్నాడు. అది నిర్ణీత సమయానికి పూర్తికాకపోవడంతో ఆలస్యానికి కారణం ఏమిటంటూ రాజేశ్వర్‌ను ప్రశ్నించాడు. అప్పటికే ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వేటలో ఉన్న రాజేశ్వర్ అదే విషయం తిరుపతయ్యకు చెప్పి, ఆ బిజీలో ఉండటంతో అభివృద్ధి పనిని పర్యవేక్షించడం సాధ్యం కాలేదని, ఎవరైనా అభ్యర్థులు ఉంటే తీసుకురావాలని సూచించాడు. ప్రశ్నపత్రం విక్రయించగా వచ్చిన సొమ్ములో కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన తిరుపతయ్య.. ఉపాధి హామీ పథకంలో పరిచయమైన రాజేంద్రకుమార్, ప్రశాంత్‌ను సంప్రదించాడు. వీరిని రాజేశ్వర్ వద్దకు తీసుకువెళ్లి, డాక్యా ద్వారా కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జి వద్ద ప్రశ్నపత్రం ఇప్పించాడు. వీరి నుంచి అడ్వాన్సుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. కస్టడీకోసం కోర్టులో సిట్ పిటిషన్ ఈ కేసులో వీరిని మరింత లోతుగా ప్రశ్నించడంతో పాటు నగదు రికవరీ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ల ద్వారా ఈ ముగ్గురితో పాటు రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి వద్దకు మాత్రమే వెళ్లింది. రమేశ్, సురేశ్‌లకు ప్రవీణ్ ఇవ్వగా.. షమీమ్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రాజశేఖర్ ఇచ్చాడు. అయితే ఆ పేపర్ ఈ ఐదుగురితో పాటు ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో సిట్ వీరిని ప్రశ్నించనుంది. సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి 84 మందిని ప్రశ్నించారు. కాగా, ఏఈ ప్రశ్నపత్రం మాదిరిగా గ్రూప్–1 పేపర్ వ్యవహరంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
TSPSC Paper Leak: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. ఇక, ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: పేపర్ లీకేజీ దొంగలకు కేటీఆర్ అండ! -
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో కేటీఆర్ ప్రస్తావించారు. చదవండి: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ఘాటైన లేఖ -
కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే! పేపర్ల లీకేజీ నిర్వాకం ఆయనదే..
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి కేటీఆర్ నిర్వాకమే కారణం. ఏ శాఖలో తప్పులు జరిగినా కేటీఆరే స్పందిస్తున్నారు. ఆయన షాడో సీఎం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకైతే మాత్రం తనకేం సంబంధం లేదంటున్నారు. తప్పు చేయకపోయినా మంత్రులను బయటికి పంపిన సీఎం కేసీఆర్.. తన కొడుకు తప్పుచేస్తే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు. కేటీఆర్ రాజీనామా చేయాలి. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడుతాం..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. బండి సంజయ్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ దొంగ సారా దందాలో దొరికిన బిడ్డను, లీకు వీరుడు కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ.. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరీక్షల్లో స్కాం, లిక్కర్లో, ధరణిలో, ఇరిగేషన్ టెండర్లలో స్కాంలు.. కేసీఆర్ పాలన అంతా స్కాములమయమని ఆరోపించారు. తప్పు చేయకపోతే భయమెందుకు? లీకేజీపై ప్రశ్నించిన తమకు నోటీసులు ఇస్తున్నారని... మరి కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. మొదట ఇద్దరికే లీకేజీతో సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారని.. కానీ ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ ఏ హోదాతో అలా చెప్పారు? ఆయనకు సిట్ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. లీకేజీకి సంబంధించి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయనకూ నోటీసులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవు. 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన లీకేజీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి భయమెందుకు? దీనిపై తెలంగాణ ఉద్యమకారులు స్పందించాలి. మీకు అండగా మేమున్నాం. నిరుద్యోగుల తరఫున రొడ్డెక్కి కొట్లాడుదాం..’’అని పిలుపునిచ్చారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం.. బీజేపీ నిరుద్యోగుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 2 నుండి 6 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని.. తర్వాత హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతామని చెప్పారు. అవసరమైతే సర్కార్‌కు సెగ తగిలేందుకు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు వస్తాయనే ఆశలు పోయాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైల్లో వేశారని.. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయ్: బీజేపీ నేతలు బిడ్డ లిక్కర్ దందాపై కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయ్.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి సంబంధించి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే..’’అని బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు. బీజేపీ దీక్షలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌తోపాటు పలు ప్రజా, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
TSPSC Paper Leak Case: ఎల్బీనగర్ లాడ్జిలో ఎవరెవరు కలిశారు?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్.. ఎల్బీనగర్లోని ఓ లాడ్జిపై దృష్టి సారించింది. ఏఈ పరీక్ష జరగడానికి ముందురోజు రాత్రి నిందితులు అక్కడ బస చేయడం, మరికొందరు వచ్చి వారిని కలవడంతో.. వచ్చిన వారెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కొత్తగా అరెస్టు చేసిన ముగ్గురినీ సిట్ అధికారులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పోలీసు కస్టడీ పూర్తయిన తొమ్మిది మందినీ జైలుకు పంపారు. మరోపక్క గ్రూప్–1 పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మంది జాబితాను కమిషన్ నుంచి సేకరించిన పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. లాడ్జి నుంచే ఏఈ పరీక్షకు .. గత నెల ఆఖరి వారంలో ప్రవీణ్ కుమార్ నుంచి ఏఈ ప్రశ్నపత్రం అందుకున్న రేణుక, డాక్యాలు అభ్యర్థులైన నీలేశ్, గోపాల్‌లను మహబూబ్‌నగర్ జిల్లాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. రెండురోజుల పాటు అక్కడే ఉంచి పరీక్షలకు సిద్ధం చేశారు. ఈ నెల 4 రాత్రి నీలేష్, గోపాల్, డాక్యాలతో పాటు అతడి సమీప బంధువు రాజేందర్ రెండు వాహనాలపై ఎల్బీనగర్కు వచ్చారు. అక్కడి ఓ లాడ్జిలో బస చేశారు. మర్నాడు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రంలో నీలేష్, గోపాల్‌తో పరీక్ష రాయించారు. అయితే వీళ్లు లాడ్జిలో ఉండగా కొందరు వచ్చి కలిసినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో వాళ్లు అభ్యర్థులేనా? కొన్ని ప్రశ్నలు లేదా ప్రశ్నపత్రాన్ని నీలేష్, గోపాల్ వారితో పంచుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. 9 మంది నిందితుల్ని మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జైలుకు మరో ముగ్గురు నిందితులు... గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న, చేసిన వారి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. 2013లో గ్రూప్–2 ద్వారా ఎంపికై, ప్రస్తుతం కమిషన్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న షమీమ్ అనే మహిళకు రాజశేఖర్ ద్వారా గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రం అందింది. దీని ఆధారంగా పరీక్ష రాసిన ఆమె ఏకంగా 127 మార్కులు పొందింది. కమిషన్‌కు చెందిన ఓ సభ్యుడి వద్ద పీఏగా పని చేస్తున్న డి.రమేష్ కుమార్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేష్‌కు ప్రవీణ్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ చేరింది. వీరిలో రమేష్‌కు 122 మార్కులు, సురేష్‌కు 107 మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఈ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వీరిని వారం రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. 25 మంది అభ్యర్థులకు నోటీసులు.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 25 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విడతల వారీగా మొత్తం 121 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. టీఎస్పీఎస్సీ కస్టోడియన్ శంకరలక్ష్మిని మరోసారి విచారించాలని నిర్ణయించారు. తెరపైకి రాజశేఖర్ బంధువు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ప్రశాంత్ గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చి ప్రిలిమినరీ పరీక్ష రాసి వెళ్ళాడు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన ప్రశాంత్ 100కు పైగా మార్కులు పొందినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇతడికి లీకైన గ్రూప్–1 పేపర్ అందిందా? అని అనుమానిస్తున్న సిట్ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక అన్నీ సీబీ పరీక్షలే! లీక్‌లను అరికట్టేందుకు ఇదే ఉత్తమ మార్గం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదును మూటగట్టుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆయా పరీక్షలు రద్దు చేసిన కమిషన్.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో 50 వేల లోపు అభ్యర్థులున్న పరీక్షలను మాత్రమే సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకంటే ఎక్కువున్నప్పుడు ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) ఆధారిత పరీక్షలను నిర్వహిస్తోంది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రశ్నపత్రా లను మూడు నెలలకు ముందుగానే ఖరారు చేసి రూపొందించడం, ఆ తర్వాత వాటిని అత్యంత గోప్యంగా ముద్రించడం, వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను కంటికి రెప్పలా కాపాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ పరీక్షల విధానాన్ని క్రమంగా వదిలించుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. డిపార్ట్మెంటల్ పరీక్షలతో సహా అన్ని రకాల నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. లీకేజీకి చెక్..! సీబీటీ విధానంలో కఠినం, మధ్యస్థం, సులభతరం అనే మూడు కేటగిరీల్లో ప్రశ్న బ్యాంకులను తయారు చేసి సర్వర్‌లో అందుబాటులో ఉంచుతారు. ఎంతోముందుగా ప్రశ్నపత్రం ఖరారు చేయడం ఉండదు. పరీక్ష సమయంలో నిర్దేశించిన నిష్పత్తుల్లో అప్పటికప్పుడు ప్రశ్నలు అభ్యర్థులకు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఏదీ ఇవ్వరు. కంప్యూటర్ స్క్రీన్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీకి దాదాపు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్వర్ సిస్టంను హ్యాక్ చేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన సీబీటీ పరీక్షల నిర్వహణలో మరో కీలక అంశం మౌలిక వసతులు. సీబీటీ పరీక్షలను నిర్వహించాలంటే తగినన్ని కంప్యూటర్లతో ల్యాబ్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం అయాన్ డిజిటల్ లాంటి సంస్థలతో పలు సంస్థలు అవగాహన కుదుర్చుకుని సీబీటీ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు సీబీటీ పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా? అనే కోణంలో కమిషన్ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, పీజీ నీట్ తదితర పరీక్షలన్నీ సీబీటీ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సగటున లక్ష నుంచి రెండు లక్షల వరకు అభ్యర్థులుంటున్నారు. అందువల్ల వీటిని ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లు ఆ మేరకు సర్దుబాటు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలను కూడా పూర్తిగా సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తే అవసరమైన వ్యవస్థపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యలక్షల్లో ఉంటే ఏయే వ్యవస్థలను వినియోగించుకోవాలి? పరీక్షలను ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తే ఏం చేయాలి? మౌలిక వసతుల కల్పన ఎలా? తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. -
పేపర్ లీక్‌పై స్పందించిన తమిళిసై.. న్యాయనిపుణుల సలహాతో..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. అనంతరం, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. పేపర్ లీక్ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులే పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కేటీఆర్‌ను విచారించాలని గవర్నర్‌ను కోరాం. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిను తీర్పును కోడ్ చేస్తూ గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చాం. ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అందర్నీ సస్పెండ్ చేసి పారదర్శక విచారణ చేస్తారని భావించాము. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. విచారణ పూర్తి అయ్యే వరకు టీఎస్పీఎస్సీని రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉంది. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారు’ అని తెలిపారు. ఇక, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు సందర్భంగా వారితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటానని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం చాలా బాధాకరం. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్యను కూడా గవర్నర్ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుపై ఇప్పటికే సిట్ స్పీడ్ పెంచింది. నిందితులను విచారిస్తోంది. అలాగే, పేపర్ లీక్ అంశంలో ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు సిట్ నోటీసులు పంపింది. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని సిట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ వద్దకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. -
పేపర్ లీకేజీపై బీజేపీ కీలక నిర్ణయం.. జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. పరీక్షలు రాసిన అభ్యర్థుల వద్దకెళ్లడం, యూనివర్సిటీల సందర్శన, లీకేజీ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ వంటివి చేపట్టే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా లీకేజీ వ్యవహారంపై ప్రజా స్పందనను తెలుసుకునే యత్నం చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను, వారి తల్లితండ్రుల దృష్టిని ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే లీకేజీ పరిణామాలపై రాష్ట్ర పార్టీ, బీజేవైఎం, ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలతో వివిధ వర్గాల ప్రజల్లో మంచి మైలేజీ వచ్చిందనే అంచనాల్లో పార్టీ నాయకత్వముంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణ, తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రులు, అధికారపార్టీ నేతల వ్యవహారశైలిని ఎండగట్టేలా నిరసన, ఆందోళన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని భావిస్తోంది. ఆ విషయంలో మనమే ముందున్నాం పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ పర్యవేక్షణ, నిర్వహణా వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో తాము ముందున్నామనే అభిప్రాయంతో బీజేపీ ముఖ్యనాయకులున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల కంటే ముందుగా ఈ అంశాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయడంలో సక్సెస్ అయ్యామని బీజేపీ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరు, లోటుపాట్లను ఎత్తిచూపి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి బీజేపీకి అనుకూలంగా ప్రజా మద్దతును కూడగట్టగలిగామనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ముందువరసలో నిలవగలిగామని ఆ నేత అభిప్రాయపడ్డారు. ఇదే ఊపుతో పేపర్ లీకేజీతో పాటు ఢిల్లీ లిక్కర్‌స్కాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, నేతల వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. చదవండి: కొలువుల కలవరం -
టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేశ్‌కూ ప్రవీణ్‌కుమార్ గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. దీంతో మంగళవారం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశి్నస్తున్నారు. తమ అదుపులో ఉన్న తొమ్మిది మంది నిందితులను కూడా వరసగా నాలుగో రోజూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. 10 మంది కమిషన్ ఉద్యోగులు క్వాలిఫై.. గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్‌కుమార్ గతేడాది జూన్ నుంచి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కమిషన్‌లోనే నెట్వర్క్ అడ్మిన్‌గా పని చేస్తున్న రాజశేఖర్ సాయంతో కస్టోడియన్ కంప్యూటర్లో ఉన్న ఈ ప్రశ్నపత్రాన్ని గతేడాది అక్టోబర్ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు. దీన్ని వినియోగించి తాను పరీక్షకు సిద్ధం కావడంతో పాటు తన స్నేహితుడైన సురేశ్‌కు వాట్సాప్ ద్వారా పంపాడు. అతడు కూడా మంచి మార్కులతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో సురేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసు కుని ప్రశి్నస్తున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు సిట్ గుర్తించింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్–1 అనుభవంతో మిగతా పేపర్ల కోసం.. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రాజశేఖర్ కాంటాక్టుల పైనా ఆరా.. లీకైన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్ సైతం తన పెన్డ్రైవ్లోని కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను ఎవరికైనా అమ్మడం, షేర్ చేయడం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూప్స్‌లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరైనా గ్రూప్–1 సహా ఇతర పరీక్షలు రాశారా? ఉత్తీర్ణులయ్యారా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నీలేష్, గోపాల్ రూ.14 లక్షల వరకు చెల్లించారు. ఇందులో రూ.లక్ష వీరికి కానిస్టేబుల్ శ్రీనివాస్ సర్దుబాటు చేసినట్లు సిట్ గుర్తించింది. నగదు ఇచి్చనందుకు అతడు సైతం ప్రశ్నపత్రాన్ని వీరి నుంచి పొందాడా? ఎవరికైనా పంపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ప్రవీణ్ ఇంట్లో సోదాలు ప్రవీణ్‌కుమార్ నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కార్పొరేషన్ 19వ డివిజన్లోని మల్లికార్జుననగర్ కాలనీలో మంగళవారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు, కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయ సమాచారం. కాగా కొన్ని వస్తువులను కూడా సిట్ బృందం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. చదవండి: కొలువుల కలవరం -
‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమేనని, గతంలో సిట్ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కేసు, హౌసింగ్‌బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిమితం కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కొలువుల కలవరం -
TS: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు (స్థాయి నివేదిక)ను సమరి్పంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు 3 వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ థన్కా వాదనలు వినిపించారు. ఇద్దరే ఉన్నారని మంత్రి ఎలా చెబుతారు.. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. దర్యాప్తు ప్రారంభం దశలోనే ఈ కేసులో ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్లో చెప్పారు. ప్రభుత్వ అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే ఉన్నారని ఆయనకు ఎలా తెలుసు? ఆయన నియోజకవర్గంలో 20 మందికి అత్యధిక మార్కులు వచ్చాయి. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. మంత్రి వ్యాఖ్యలు, లీకేజీలో ఆయన పీఏ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో సిట్ స్వేచ్ఛగా దర్యాప్తు చేయలేదు. సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు బృందానికి కేసును బదిలీ చేయాలి. పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నదే మా విజ్ఞప్తి..’అని థన్కా తెలిపారు. సిట్ 9 మందిని అరెస్టు చేసింది.. ‘కేసు ప్రారంభ దశలోనే వెంకట్, ఓయూ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసే అర్హత (లోకస్ స్టాండీ) వారికి లేదు. దర్యాప్తు అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వారు పిటిషన్ వేశారు. ఇద్దరే ఉన్నారని మంత్రి చెప్పారని, అది సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. కానీ సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసింది. ఈ పిటిషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వేశారు. ఈ కేసును సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. లీకేజీ గురించి తెలియగానే టీఎస్పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం కూడా కేసును సిట్‌కు అప్పగించింది. కాబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. సీబీఐ విచారణ అవసరం లేదు. పిటిషన్‌ను కొట్టివేయాలి..’అని ఏజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. కాగా పిటిషనర్లలో ఇద్దరు టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులేనని థన్కా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చదవండి: ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ.. -
నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు..రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త రాజశేఖర్‌ను నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘నా భర్తను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్ చేశారు. 14వ తేదీ వరకు రిమాండ్ చేయలేదు. నేరం ఒప్పుకోమని పోలీసులు నా భర్తపై ఒత్తిడి తెస్తున్నారు. నా భర్తను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్కడ ఆయనను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆ సమావేశం నుంచి వెళ్లేటప్పుడు నా భర్త కుంటుతూ నడుస్తున్నారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే ఆ పరిస్థితి వచ్చింది. ఆరోగ్య పరిస్థితి తెలుకునేందుకు రాజశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్చాలి. ఆయనను సిట్ విచారణ చేస్తోంది. ఆ వీడియోను బయటపెట్టాలి. పోలీసుల చిత్ర హింసలపై, పేపర్ లీక్‌పై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలి. నా భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలి’అని ఆమె పిటిషన్లో కోరారు. ప్రతివాదులుగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిట్, హైదరాబాద్ నగర డీసీపీలను పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. చదవండి: రేవంత్‌కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
TSPSC Paper Leak: ఆరు పరీక్షలు మళ్లీ.. అన్నీ కొత్తగానే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు రద్దు చేసిన పరీక్షలు, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షలు రద్దు కాగా... మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అతి త్వరలో ఈ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. కాగా పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హాల్ టికెట్లు మొదలు.. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్... వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. దీంతో ఆరు పరీక్షలను టీఎస్పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి వస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల వద్ద హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ సమూలంగా మార్చి కొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహించే వారం రోజుల ముందు కొత్త నంబర్లతో అభ్యర్థులకు తిరిగి హాల్ టిక్కెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే అభ్యర్థులకు కొత్తగా పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. కొత్త ప్రశ్నపత్రాలను కూడా రూపొందించనున్నారు. కమిషన్ రహస్య కంప్యూటర్లలోని సమాచారం బయటకు లీక్ కావడంతో అన్ని రకాల ప్రశ్నపత్రాలు సమూలంగా మారనున్నాయి. ఈ మేరకు కొత్త ప్రశ్నలతో ప్రశ్నపత్రాల తయారీకి నిపుణులకు సూచనలు అందినట్లు సమాచారం. కాగా ప్రశ్నపత్రాల్లో జంబ్లింగ్ విధానాన్ని అనుసరించే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత పరీక్షల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్కుఉని... ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అత్యంత గోప్యంగా ఈ ప్రక్రియ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
పేపర్ లీక్ కేసు: ‘కేటీఆర్ చెప్పింది నిజమే.. వారిద్దరూ ఎవరంటే?’
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు ఆయన దగ్గరున్న వివరాలు ఇవ్వాలని సిట్.. సీఆర్పీసీ 91 కింద నోటీసులు పంపించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. రేవంత్ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈనెల 23వ తేదీన సిట్ ఆఫీసు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ యాత్రలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్టీఎస్ ఛైర్మన్ కేటీఆర్‌కు దగ్గరి బంధువు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్టీఎస్ మాత్రమే నిర్వహిస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖకు ఏం సంబంధమని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. పేపర్ లీకేజీ స్కాంను తామే బయటపెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక విషయంలో కేటీఆర్ నిజం మాట్లాడారు. ఈ స్కాంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారు. ఆ ఇద్దరు కేసీఆర్, కేటీఆరేనని నేను అంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ నోటీసులు ఊహించిందే. నన్ను వేధించాలనే నోటీసులు ఇస్తోంది. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నాను. కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. కేటీఆర్‌తో పాటు సబిత, శ్రీనివాస్ గౌడ్, సిట్ అధికారి శ్రీనివాస్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌ను ఇస్తాను. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుంటాను అని అన్నారు. ఇక, పేవర్ లీక్ వ్యవహారంపై అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష పత్రం లీకేజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో కరీంనగర్‌లోని మల్యాల మండలంలో వంద మందికి పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేశారని ఆరోపించారు. ప్రిలిమ్స్‌లో వీరికి 100కుపైగా మార్కులు వచ్చాయన్నారు. ఇందులో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సిట్ తమకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపించింది. ఇది కూడా చదవండి: కేటీఆర్ పీఏపై రేవంత్ షాకింగ్ కామెంట్స్.. -
పేపర్ లీక్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు.. ట్విస్ట్ ఇచ్చిన సిట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్.. దూకుడు పెంచింది. ఆరోపణలు చేసిన పొలిటికల్ లీడర్లకు నోటీసులు అందజేస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను అందించాలంటూ సిట్ వారిని కోరింది. దీంతో, పేపర్ లీక్ అంశం ఆసక్తికరంగా మారింది. పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేస్తున్న పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చి.. వారి వద్ద ఆధారాలని పేర్కొంది. ఇక, పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిట్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్ ఇటీవలే పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి -
'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు'
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ పేషీ నుంచే జరిగిందని, మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే ఇద్దరి వల్లే పేపర్ లీక్ అయ్యిందంటూ మంత్రి కేటీఆర్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏ తిరుపతి షాడో మంత్రి అని, ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించడంలోనే అసలు రహస్యం దాగి ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్లను ఎన్కౌంటర్ చేస్తామని జైలులో బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ఈనెల 13 నుంచి 18 వరకు చంచల్‌గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్వోసీ ఎలా ఇచ్చారు.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న వారు పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులని నిబంధనలు చెబుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న 20 మందికి పరీక్షలు రాయడానికి ఎన్వోసీ ఎలా ఇచి్చందని ప్రశ్నించారు. అమెరికానుంచి వచ్చిన మాధురికి గ్రూప్–1 మొదటి ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్ రజనీకాంత్‌రెడ్డికి నాలుగో ర్యాంకు ఎలా వచ్చాయన్నారు. శ్రీలక్షి్మ, ప్రవీణ్, వెంకటాద్రి, శ్రీదేవి, రమేశ్, వాసు, మధులతలతో పాటు మరికొందరికి పరీక్షలకు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2016లో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 25 మందికి గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయని, దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ2 రాజశేఖర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనే.. లీకేజీ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి దగ్గరి స్నేహితుడని, ఇద్దరిదీ ఒకే ప్రాంతమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పరిచయంతోనే రాజశేఖర్‌రెడ్డికి 2017లో ఉద్యోగం ఇప్పించాడని, వెనువెంటనే ప్రమోషన్ వచి్చందని, తర్వాత టీఎస్‌పీఎస్సీలోకి బదిలీ అయ్యాడని ఆయన వెల్లడించారు. వీటన్నింటికీ కేటీఆర్ పీఏ తిరుపతే కారణమని ఆరోపించారు. అలాగే లీకేజీ వ్యవహారంలో కాని్ఫడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్లక్ష్మి పాత్రపై విచారణ జరపాలన్నారు. తాజా గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో మల్యాల ప్రాంతానికి చెందిన వంద మందికిపైగా అభ్యర్థులకు 103 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని, వారి వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లకు అన్ని వివరాలు తెలిసి ఉంటాయన్నారు. సిట్ అధికారి కేటీఆర్ బావమరిదికి దోస్త్.. పేపర్ లీకేజీ కేసు బాధ్యతలు అప్పగించిన సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్.. మంత్రి కేటీఆర్ బావమరిదికి దగ్గరి స్నేహితుడని, ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంలో ఉద్దేశం ఏమిటో అర్థమవుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. లీకేజీ వ్యవహారంపై తాము కోర్టులో వేసిన కేసుపై సోమవారం విచారణ జరగనుందని తెలిపారు. 21న గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సీతక్క, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొత్త కోణం.. ఎన్ఆర్ఐ లీడర్ సిఫారసుతోనే రాజశేఖర్‌కు ఉద్యోగం? -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ‘ఎన్ఆర్ఐ’ లింకులు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్పీఎస్సీ లీకేజీలో ఎన్ఆర్ఐల పాత్ర ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమిషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఎన్ఆర్ఐలు కావడంపై సిట్ దృష్టి సారించినట్లు స్థానిక పోలీసు వర్గాల సమాచారం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డిది సాధారణ కుటుంబం. అతని అత్తింటివారిదీ అదే పరిస్థితి. అయితే రాజశేఖర్‌రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్ఆర్ఐ సర్కిల్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచి్చన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్‌స్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గ్రూప్–1లో ‘విదేశీ’ కోణం పరిశీలించాలి.. రాజశేఖర్‌రెడ్డి ఎన్ఆర్ఐ మిత్రుల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. 2018లో విదేశాల నుంచి వచ్చిన ఆ ఇద్దరికీ పేపర్ లీక్‌ల ద్వారా రాజశేఖర్‌రెడ్డే కొలువులు దక్కేలా చేశాడని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి మరో ఇద్దరు సన్నిహితులు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి బంధువులు మాత్రం వారు దసరా కోసం వచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే.. ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్–1 రాశారో సిట్ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆస్తులపై ఆరా.. కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం మీద పూర్తిస్థాయి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో రాజశేఖర్‌రెడ్డి పకడ్బందీగా లీకేజీ కథ నడిపాడని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు రాజశేఖర్‌రెడ్డితో పాటు అతని సమీప బంధువుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న సిట్.. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన ఇద్దరి వివరాలు సేకరించారని తెలిసింది. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు.. రాజశేఖర్ బంధువుల పాత్రపై అనుమానాలు -
నేటి నుంచి నిందితుల ఉమ్మడి విచారణ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలతో సహా తొమ్మిది మంది నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. వీరిని శని, ఆదివారాల్లో విడివిడిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నమోదు చేసిన వాంగ్మూలాలను సరిపోల్చుతూ మొత్తం 30 ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. దీని ఆధారంగా సోమవారం నుంచి నిందితులను ఉమ్మడిగా ప్రశ్నించాలని నిర్ణయించింది. ప్రవీణ్–రాజశేఖర్, ప్రవీణ్–రేణుక, రాజశేఖర్–రేణుక.. ఇలా ఇద్దరిద్దరు చొప్పున, ఆ తర్వాత అందరినీ కలిపి ప్రశ్నించడానికి సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు టీఎస్పీఎస్సీ నుంచి సీజ్ చేసిన కంప్యూటర్ తదితరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు (ఎఫ్ఎస్ఎల్కు) పంపింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక అందిన తర్వత కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. గ్రూప్–1 డిస్ క్వాలిఫై వెనుక కుట్ర! కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ గ్రూప్–1 పరీక్షలో డిస్ క్వాలిఫై కావడం వెనుకా కుట్ర ఉందని సిట్ అనుమానిస్తోంది. ప్రవీణ్ ఆ పేపర్ కూడా చేజిక్కించుకున్నాడని, దాని ఆధారంగా పరీక్ష రాసి 150కి 103 మార్కులు సాధించాడని భావిస్తోంది. ఈ లీకేజ్ విషయం వెలుగులోకి రాకుండా ఉండటానికే ఓఎంఆర్ షీట్‌ను తప్పుగా నింపి డిస్ క్వాలిఫై అయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలా చేస్తే ఎవరి దృష్టిలోనూ పడమని, తనకు ఎలాగూ ఎక్కువ మార్కుల రావడంతో ఆ తర్వాత అదును చూసుకుని మెయిన్స్ పరీక్ష లోపు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ పరీక్ష రాయడానికి అనుమతి పొందాలనే పథకం వేశాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిన్స్ పేపర్‌ను సైతం చేజిక్కించుకునేందుకు ప్రవీణ్ పథకం వేశాడని అనుమానిస్తున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న రేణుకతో ప్రవీణ్ ఈ వ్యవహారం చెప్పి ఉంటాడని, ఈ నేపథ్యంలోనే ఆమె మిగిలిన ప్రశ్నపత్రాల లీకేజ్ ఆలోచన చేసి ఉంటుందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి జరిగే విచారణలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. మంచి మార్కులు వచ్చిన వారిపై నజర్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించిన వారినీ సిట్ అనుమానితులుగా చేర్చింది. ప్రాథమికంగా 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 28 మందితో జాబితా రూపొందించారు. వీరి కాల్ డిటైల్స్, వాట్సాప్ వివరాల్లో.. నిందితులతో లింకుల కోసం సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గ్రూప్–1 పేపర్ ప్రవీణ్ లేదా మరెవరి ద్వారా అయినా వారికి అందిందా? అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వీరిలో కొందరిని సిట్‌కు పిలిచి విచారించారు. కొందరు యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు పొందినట్లు గుర్తించారు. ఇద్దరి వ్యవహారశైలిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని మరికొన్ని కోణాల్లోనూ ప్రశ్నించనున్నామని ఓ అధికారి తెలిపారు. ఆదివారం అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కలిసి హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివిధ సాంకేతిక అంశాలను పరిశీలించారు. మరింత మందికి పేపర్లు! రెండోరోజు నిందితులను 7 గంటలకు పైగా సిట్ విచారించింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలకు చెందిన వాట్సాప్ చాట్లను సైబర్ నిపుణులు రిట్రీవ్ చేశారు. వాటిని నిందితుల ముందుంచి ప్రశ్నించారు. వాట్సా‹³లు పరిశీలించిన నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలు చాలామందికి ప్రశ్నపత్రాలు పంపినట్లుగా ఆధారాలు లభించాయి. గ్రూప్–1 పేపర్‌ను కూడా చాలామందికి సర్క్యులేట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో కమిషన్ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ వినియోగించిన కంప్యూటర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. పేపర్లు అందుకున్న వారిని నిందితుల జాబితాలో చేర్చి ప్రశ్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
గ్రూపు-1 ఫలితాల్లో నమ్మలేని నిజాలు.. బాంబు పేల్చిన బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీకు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా గ్రూపు-1 ఫలితాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూపు-1లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. గ్రూపు-1లో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అవడమే కాకుండా ఒక చిన్ని గ్రామంలో ఆరు క్వాలిఫై అయ్యారు. దీనికి మంత్రి కేటీఆరే బాధ్యులు. కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదు?. సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందే’ అని డిమాండ్ చేశారు. -
TSPSC: వారిని ఎలా పరీక్ష రాయనిస్తారు?.. ర్యాంకులు ఎలా వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ దారుణం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారు. పేపర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఈ వ్యవహారంలో ఇద్దరికే సంబంధం ఉందంటూ కేటీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారంతా ఎక్కడున్నారు?. 2015 నుంచి పేపర్ లీక్‌లు జరుగుతున్నాయి. నిందితులు ఉన్న చంచలగూడ జైలుకు మధ్యవర్తిత్వం చేయడానికి ఎవరు వెళ్లారు?. పేర్లు బయటపెడితే చంపేస్తామన్నారో అన్ని బయటకు రావాలి. చంచల్ గూడ సందర్శకుల జాబితాను చూపించాలి. సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేయాలి. పేపర్ లీక్ వెనుక ఎవరున్నారో తేలతెల్లం చేయాలి. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోక ముందే రాజశేఖర్, ప్రవీణ్ మాత్రమే నిందితులని కేటీఆర్ ఎలా నిర్దారించారు?. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు కమిషన్ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు. కానీ, కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్‌లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలి. టీఎస్పీఎస్సీలో పనిచేసే మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం, రజనీకాంత్ రెడ్డికి నాల్గో ర్యాంక్ రావడం వెనుక కారణాలేంటో తెలియాలి. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారిలో 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనుక ఏం జరిగిందో తేలాలి. నిందితులందరి పూర్తి వివరాలు వెల్లడించాలి. సిట్ దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదంటూ కీలక వాఖ్యలు చేశారు. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు కోర్టును మేం కోరతాం. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. -
బీజేపీ నేతల హస్తముంటే.. అరెస్ట్ చేయడం లేదేం?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉన్నది మీరే కదా? మేం అడుగు తున్నాం. సమా ధానం చెప్పండి. పేపర్ లీకే జీలో ఐటీ శాఖ తప్పి దాలు ఉన్నాయి. అందుకే సంబంధిత మంత్రి అయిన కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. నిజంగా తప్పు చేయ కపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. కవితపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో బండి సంజయ్ శనివారం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో బీజేపీ హస్తముందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే.. ‘‘ఇతరులు తప్పు చేస్తే మెడపట్టి గెంటేసేవాళ్లు కదా. కేసీఆర్ కొడుకు తప్పు చేస్తే ఎందుకు బర్తరఫ్ చేయ డం లేదు? మున్సిపల్, ఐటీశాఖల తప్పిదాలకు జనం బలైపోతుంటే మంత్రిపై చర్యలేవి? తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడం లేదు? రాజశేఖర్ బీజేపీ వ్యక్తే అయితే 13ఏళ్లుగా టీఎస్పీఎస్సీ ఏం చేస్తున్నట్టు? ఎవరి నిర్వాకంతో పిల్లలు చనిపోయారు? పరీక్ష సక్రమంగా నిర్వహించే తెలివిలేనోడు కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నడు. ఎవరికి కామన్ సెన్స్ ఉందో, ఎవరికి లేదో ప్రజలకు తెలుసు. ఎవరి నిర్వాకం వల్ల ఇంటర్ పిల్లలు చనిపోయారు? ధరణి వల్ల లక్షల మంది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? తన (కేటీఆర్) శాఖ పరిధిలోనే కుక్కలు కరిచి పిల్లలు చనిపోతుంటే కనీసం పట్టించుకోనోడు, నాలాల్లో పడి జనం చస్తే పట్టించుకోనోడు, సిటీలో అగ్ని ప్రమాదాల్లో జనం చనిపోతున్నా పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈడీ, సీబీఐ రాజ్యాంగబద్ధ సంస్థలు కావా? టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రభుత్వానికేం సంబంధమని కేటీఆర్ అంటున్నడు. మరి ఈడీ, సీబీఐ రాజ్యాంగబద్ధ సంస్థలు కావా? మీకు నచ్చితే, చెప్పినట్టు వినేవి మాత్రమే రాజ్యాంగబద్ధ సంస్థలా? లేకుంటే బీజేపీ సంస్థలు అవుతాయా? 30లక్షల మంది జీవితాలను నాశనం చేసిన మీరు.. కనీసం వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా గాలికొదిలేసి.. లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు..’’ తెలంగాణ సామెతనే ప్రస్తావించా.. ‘‘కవితను ఉద్దేశించి తెలంగాణ సామెత ప్రస్తావించానే తప్ప నాకు మరే ఉద్దేశమేదీ లేదు. మహిళా కమిషన్ నాపై సీరియస్ అయిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు. మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్టు నేను భావించడం లేదు. కానీ ఈ ప్రచారంపై మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలి. ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరై సమాధానమిచ్చా. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం ఆఫీసు నుంచే లీకేజీ తతంగం – వ్యవహారంలో రిటైర్డ్ అధికారి పాత్ర: సంజయ్ సిద్దిపేట జోన్: సీఎంఓ కార్యాలయంలో రిటైర్డ్ అధికారికి టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో సంబంధం ఉందని, లీకేజీ తతంగం అంతా సీఎం ఆఫీసు నుంచే జరిగిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. సదరు అధికారికి గతంలో సింగరేణి పేపర్ లీకేజీతో కూడా పాత్ర ఉందని పేర్కొన్నారు. లీక్ వెనుక అసలు వ్యక్తుల వివరాలు బయటపెట్టాలని, దీనిపై తక్షణమే సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేటలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. -
బీజేపీ కుట్ర కోణం!
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మాకూ ఓ అనుమానం ఉంది. ఈ కేసులో అనుమానితుడిగా, నిందితుడిగా అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్య కర్త. అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న అంశాలను వెలికి తీయాలని బీఆర్ఎస్ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేశాం. మా ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. ఇలా నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్ర అని, యువతను బిజీగా ఉంచి తమ దగ్గరికి రానీయకుండా చేయడానికే నోటిఫికేషన్లు ఇచ్చా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (బండి సంజయ్) స్వయంగా అన్నారు. దీన్ని బట్టి అనుమానించాల్సి వస్తోంది.. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సాధ్యమైనంత త్వరగా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా బీజేపీ అనుకూలతను ప్రదర్శిస్తూ, ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశాడని.. ఇందుకు సంబంధించి ఎన్నో ఫొటోలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఉండటంతోనే అనుమానిస్తున్నామని.. ఈ కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని డీజీపీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకుల వెనక ఎవరున్నా.. వారు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా అమలు చేయాల్సిన సంస్కరణలపై శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తదితరులతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్ర అనే ధోరణిలో మాట్లాడిన వ్యక్తి (బండి సంజయ్) పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ2గా దొరకడం చూస్తే ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతలో లేని పోని అనుమానాలు కలిగించే విధంగా నిందలు వేసి అప్రతిష్టపాలు చేయాలని కుట్ర ఉందా? అన్నది శోధించాలని డీజీపీని కోరుతున్నాం. ఇది వ్యవస్థ వైఫల్యం కాదు.. టీఎస్పీఎస్సీలోని ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పుతో మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. దీనిని నివారించి ఉండాల్సింది. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత ఉందని భావించి సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశం నిర్వహించాం. గత 8 ఏళ్లలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా టీఎస్పీఎస్సీ అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసింది. 155 నోటిఫికేషన్లు ఇచ్చి 37వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఉమ్మడి ఏపీలో ఏదైనా పరీక్ష జరిగిందంటే ఏపీపీఎస్సీ మీద పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వచ్చేవి. టీఎస్పీఎస్సీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏ ఒక్క ఆరోపణ రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో పక్షపాతం ఉండేదని ఆరోపణలున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసింది. సంస్కరణలపై చర్చించాం.. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఇది వ్యవస్థ వైఫల్యమో, సంస్థాగత వైఫల్యమో కాదు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు. లక్షల మంది పిల్లలకు ఇబ్బంది ఎదురైంది. ఇలా మళ్లీ జరగకుండా చేయాల్సిన మార్పులు, సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించాం. యువత ఆందోళన చెందవద్దు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగ యువతకు సంబంధించి ఏవో కొన్ని వార్తలు (ఆత్మహత్యల వార్తలు) వస్తున్నాయి. యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి వెంట ప్రభుత్వం ఉంది. నాలుగు పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ అభ్యర్థులు మళ్లీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. పటిష్టమైన నివారణ చర్యలతో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్ష రాసేందుకు అర్హులే. టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ జరగలేదని సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విపక్షాలు పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు లీకేజీ అంశాన్ని చిలువలు పలువలు చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి యువతలో అశాంతి, అసహనం చెలరేగేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా విపక్షాల నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉంది. రాజకీయ నిరుద్యోగులు, బేహారుల రెచ్చగొట్టే మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దు. ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. కొందరు నేతలు ఎన్ని చిల్లర ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు. మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని స్వయంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎక్కడ పోయాయి ఆ ఉద్యోగాలు అని అడిగితే.. పకోడీలు వేయడం కూడా ఉద్యోగాలని అంటారు. అలాంటి మీరు (బీజేపీ నేతలు) వచ్చి ఉద్యోగాలపై మాకు చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. చెప్పి మాటపడొద్దు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కి నేనే బాధ్యుడినా? రాజ్యాంగబద్ధమైన టీఎస్పీఎస్సీ రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వం పాత్ర ఉండదు. ప్రభుత్వం తరఫున ఒక సెక్రటరీ మాత్రమే ఉంటారు. కానీ ఐటీ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఒకరు అంటారు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కు నేనే బాధ్యుడినా? ఇంటర్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఏం జరిగినా ఐటీ మంత్రిది తప్పు అంటారు. గుజరాత్లో 8 ఏళ్లలో 13 పేపర్లు లీకైతే అక్కడ ఎవరైనా మంత్రిని బర్తరఫ్ చేశారా? రాజీనామా చేశారా? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో నేరుగా సీఎం మీద ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారా? అస్సాంలో మొన్న పోలీసు నియామకాల ప్రశ్నపత్రం లీకైతే సీఎం రాజీనామా చేశారా..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 24 గంటలూ రీడింగ్ రూమ్‌లు.. ఉచిత భోజన వసతి రద్దయిన గ్రూప్–1, డీఏఓ, టీపీఓ, ఏఈఈ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను రెండు, మూడు రోజుల్లో ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం. జిల్లాల్లోని రీడింగ్ రూమ్‌లు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంటాయి. అక్కడ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా సీఎస్ నాయకత్వంలో కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఇంకా ఏమైనా నిర్దిష్ట డిమాండ్ వస్తే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. -
టీఎస్పీఎస్సీలో కొత్త కోణం.. ఆ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ లీక్‌లో ఒక్కరే ఉన్నారని అనుకోవడం లేదు. పేపర్ లీక్‌పై రకరకాల వదంతులు వచ్చాయి. పరీక్షల రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలలో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది. లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణను లీకుల రాజ్యం, లిక్కర్ రాజ్యంగా మార్చారు. టీఎస్పీస్సీలో సమగ్ర పక్షాళన జరగాలి. డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాము. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి త్వరలో పోరాటానికి పిలుపునిస్తామన్నారు. ఇక, పేపర్ లీక్‌పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. బీజేపీ నేతల తీరుపై అనుమానాలు: కేటీఆర్ -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కుట్ర కోణంపై అనుమానాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలనే బాధ్యత తమపై ఉందన్నారు. అవకతవకలు జరిగాయనే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో గత ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశామని కేటీఆర్ తెలిపారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. 155 నోటీఫికేషన్ల ద్వారా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు వచ్చిన మన సంస్కరణలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి పరిశీలించారని ప్రస్తావించారు. ‘పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం. ప్రజలకు నిజానిజాలు తెలియాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం ఆదేశాలతోనే సమీక్ష నిర్వహించాం. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనక ఎవరున్న కఠినంగా శిక్షిస్తాం. రద్దైన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసుకున్న వారంతా అర్హులే. మొత్తం నాలుగు పరీక్షల కోచింగ్ మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో పెడతాం. 2 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. యువత విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇద్దరు చేసిన తప్పును యువతలో అశాంతి చెలరేగేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు. రాజకీయ నిరుద్యోగులు చేసే విమర్శలకు యువత రెచ్చిపోవద్దు. బీజేపీ నేతల తీరుపై అనుమానాలున్నాయి. నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. పేపర్ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే అంటే ఎలా. ఇంటర్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏదైనా జరిగే ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేపర్లు లీకైతే మంత్రులు రాజీనామా చేస్తారా?’ అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చదవండి: మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్