Telangana: 15 పేపర్లు అవుట్‌! | Key development in investigation of TSPSC question paper leak case | Sakshi
Sakshi News home page

Telangana: 15 పేపర్లు అవుట్‌!

Published Fri, Mar 31 2023 2:46 AM | Last Updated on Fri, Mar 31 2023 8:00 AM

Key development in investigation of TSPSC question paper leak case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించి ఏకంగా 15 క్వశ్చన్‌ పేపర్లు ముందే బయటకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. గ్రూప్‌–1 పేపర్‌ లీక్‌ ఐదుగురికే పరిమితమైందని, ఏఈ ప్రశ్నపత్రం పలువురికి విక్రయించారని, మిగతావి పెన్‌డ్రైవ్‌కే పరిమితమైనట్లు స్పష్టమైంది. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన పేపర్లు తస్కరించేందుకు కూడా నిందితులు పథకం వేసినట్లు బయటపడింది.  

అన్నీ మాస్టర్‌ ప్రశ్నపత్రాలే.. 
ఈ స్కామ్‌లో సూత్రధారులుగా ఉన్న కమిషన్‌ కార్యదర్శి మాజీ పీఏ ప్రవీణ్‌ కుమార్, నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు 13 మంది నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. గతేడాది అక్టోబర్‌ మొదలు గత నెల ఆఖరి వారం వరకు సాగిన ఈ లీకేజ్‌ వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్‌.. సురేష్, రమేష్‌లకు కూడా ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి.. షమీమ్‌కు, న్యూజిలాండ్‌లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్‌ రెడ్డికి ఇచ్చాడు.

ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. గత నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పత్రాలు నీలేష్, గోపాల్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌ ఖరీదు చేశారని తేల్చారు. వీరి ద్వారా మరికొందరికి చేరే అవకాశాలు తక్కువని చెప్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

గ్రూప్‌–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) టౌన్‌ ప్లానింగ్‌ బిజినెస్‌ ఓవర్సీర్‌ (టీపీబీఓ), జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), డిస్ట్రిక్ట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పేపర్లు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లని సిట్‌ అధికారులు చెప్తున్నారు. వీటిల్లో ఆయా ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు తీసుకున్నవారు, ఏఈ పేపర్‌ను ఖరీదు చేసిన వారు.. సిద్ధం కావడం తేలికైంది. లేనిపక్షంలో సమాధానాలు వెతుక్కోవడానికి, ఆపై సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమై ఉండేదని అంటున్నారు. 

గ్రూప్‌–1 మెయిన్స్‌ పేపర్లు కొట్టేసేందుకూ ప్లాన్‌  
గ్రూప్‌–1, ఏఈఈ మినహా మిగిలినవి ప్రవీణ్‌ వద్దే ఉండిపోయాయని, ఖరీదు చేసే వాళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే స్కామ్‌ వెలుగు చూసిందని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌లు గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబం«ధించిన పేపర్లు కూడా కస్టోడియన్‌ కంప్యూటర్‌ నుంచి తస్కరించాలని పథకం వేశారని, ఈ మేరకు షమీమ్, సురేష్, రమేష్, ప్రశాంత్‌రెడ్డిలకు సమాచారం ఇచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.  

8 గంటల పాటు విచారణ 
పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌లను సిట్‌ పోలీసులు రెండోరోజు గురువారమూ 8 గంటల పాటు ప్రశ్నించారు. ఎల్బీనగర్, సైదాబాద్, ఉప్పల్‌ ప్రాంతాల్లోని వారివారి ఇళ్లకు వెళ్లి ఆధారాల కోసం సోదాలు చేశారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి మాస్టర్‌ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు. కస్టోడియన్‌ శంకరలక్ష్మి వాంగ్మూలం గురువారం మరోసారి నమోదు చేశారు.  

ఆ 15 ప్రశ్నపత్రాల జాబితా ఇది... 
1. గ్రూప్‌–1 జనరల్‌ స్టడీస్‌  
2. ఏఈఈ సివిల్‌ ఇంజనీరింగ్‌  
3. ఏఈఈ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌  
4. ఏఈఈ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 
5. డీఏఓ జనరల్‌ స్టడీస్‌  
6. డీఏఓ మేథమెటిక్స్‌ 
7. జనరల్‌ స్టడీస్‌ డిప్లొమా ఏఈ 
8. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ  
9. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ  
10. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ 
11. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ పేపర్‌–2 
12. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ పేపర్‌–2 
13. టీపీబీఓ ఒకేషనల్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1 
14. టీపీబీఓ ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ పేపర్‌–2 
15. జూనియర్‌ లెక్చరర్స్‌ ఎగ్జామ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement