సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఇప్పుడు వాయిదా కోరుతూ పిటిషన్లు వేయడం సరికాదంది. ఆ పిటిషన్లను కొట్టివేసింది. పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి.
టీఎస్‌పీఎస్సీ సిబ్బందిలో ఎంతమందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
యూపీఎస్సీతో పరీక్ష నిర్వహించాలి..
‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.. కొనసాగుతోంది. కమిషన్‌లో పనిచేసే వారికి లీకేజీతో సంబంధం ఉందని కొందరిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు పూర్తి అయితేగానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తోంది. 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్–1 కోసం ఎదురుచూశారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో అధికారుల నియామకం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో పరీక్ష సాగుతున్నప్పుడే లీకేజీ జరిగింది. అలాంటప్పుడు అదే కమిషన్ తిరిగి ఎలా పరీక్ష నిర్వహిస్తుంది? యూపీఎస్సీ లాంటి ఏదైనా థర్డ్ పార్టీ కమిషన్‌తో నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం, అభ్యంతరం ఉండదు. ’అని అవినాశ్ దేశాయ్ తెలిపారు.
ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి..
‘పేపర్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి పరీక్షలను రద్దు చేసింది. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు లీకేజీతో సంబంధం ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. వారిని దర్యాప్తు అధికారులు అరెస్టు కూడా చేశారు. పరీక్ష రద్దు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే త్వరగా నిర్వహించమని అడగాలి తప్ప.. వాయిదా కోరడం సరికాదు.
జూన్ 11న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3.18 లక్షల మంది గ్రూప్–1కు దరఖాస్తు చేయగా, ఇప్పటికే 1.13 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మిగతావారు కూడా ఒకట్రెండు రోజుల్లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 995 సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు...’ అని బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే ఆదివారమే పరీక్ష ఉన్న నేపథ్యంలో వాయిదా వేయలేమని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ప్రిలిమ్స్ వాయిదా లేదు
Published Tue, Jun 6 2023 4:25 AM | Last Updated on Tue, Jun 6 2023 3:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment