అక్టోబర్ 21వ తేదీ నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు
నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షల నిర్వహణ
ఆయా పరీక్షలకు వారం రోజుల ముందు నుంచీ హాల్‌టికెట్ల జారీ
షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, 2, 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆయా ఉద్యోగ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏడాది చివరినాటికల్లా గ్రూప్ సర్వీసులకు సంబంధించి అన్నిరకాల అర్హత పరీక్షలను పూర్తి చేసేలా ఈ షెడ్యూల్‌ను రూపొందించింది.
ఇటీవల గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్‌పీఎస్సీ.. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఇక పెండింగ్‌లో ఉన్న గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది.
పెండింగ్‌లో ఉన్న పరీక్షల్లో..
టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబర్‌లో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసినా.. పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు. అభ్యర్థులు సన్నద్ధతకు సమయం కోరడం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను దాదాపు మూడుసార్లు మార్చింది. ఇక 2022 ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది.
డిసెంబర్ నాటికి ఫలితాల ప్రకటనతోపాటు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దయింది. గత ఏడాది జూన్‌లో మరోమారు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా.. పరీక్షల నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. రెండోసారి కూడా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది.
టీఎస్‌పీఎస్సీలో మార్పులు చేయడంతోపాటు ఆ గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజాగా గత నెల 19న 563 పోస్టులతో కొత్తగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్నాళ్లూ పరీక్షల రద్దు, ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశలో ఉన్న నేపథ్యంలో.. ఉత్సాహం నింపేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది.
సన్నద్ధతకు సమయం
టీఎస్‌పీఎస్సీ ముందస్తుగా గ్రూప్ ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఆయా పరీక్షలు జరగలేదు. ఈ క్రమంలో షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఏయే పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావొచ్చనే దానిపై అభ్యర్థులు వ్యూహాత్మక ప్రణాళిక తయారు చేసుకునే వీలు కల్పించినట్టు అయిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో గ్రూప్–1 ప్రిలిమ్స్ జరగనుంది.
అంటే ఈ పరీక్షలకు మూడు, నాలుగు నెలల వ్యవధి లభించింది. తర్వాత గ్రూప్–2 పరీక్షలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఆ తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు రెండు నెలల వ్యవధి ఉండటంతో సిద్ధమయ్యేందుకు వీలవనుంది. ఇక గ్రూప్–1 మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్–3 పరీక్షలు ఉన్నాయి. మొత్తంగా పరీక్షలకు సమయం సంతృప్తికర స్థాయిలో ఉందని, అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావొచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment