Group - 2
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ 783 గ్రూప్-2 పోస్టులకు రాతపరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు డిసెంబర్ 15, 16వ (ఆది, సోమవారం) జరగనున్నాయి. ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలు సిద్ధమయ్యాయి. గ్రూప్-2 పరీక్షల ఇలా..టీఎస్పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. అలాగే డిసెంబరు 16వ తేదీన పేపర్-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-4 పరీక్షను మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 600 మార్కులు ఈ గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకే రోజు గ్రూప్2,రైల్వే పరీక్షలు అంతకుముందు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లలో డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని, ఒకే రోజు గ్రూప్-2, రైల్వే పరీక్షలు ఉన్నందున పరీక్షను వేరే తేదీకి మార్చాలని కోరారు.దీనిపై విచారణ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా గ్రూప్-2 వాయిదా వేయడం వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులంతా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లు కొట్టివేసింది. -
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులపై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ లైబ్రరీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ ప్రయోగించారు.కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
గ్రూప్స్ పరీక్షల వాయిదాను ఖండించిన కమిషన్.. అభ్యర్థుల రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందిస్తూ.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది.కాగా.. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదా ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. పరీక్షల తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. ఈ వార్తలను అభ్యర్థులను పట్టించుకోవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. గతకొద్ది రోజులుగా మరోమారు పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్-2 పోస్టులను 2000లకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆగస్టు 7, 8న గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, 2, 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆయా ఉద్యోగ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏడాది చివరినాటికల్లా గ్రూప్ సర్వీసులకు సంబంధించి అన్నిరకాల అర్హత పరీక్షలను పూర్తి చేసేలా ఈ షెడ్యూల్‌ను రూపొందించింది. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్పీఎస్సీ.. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఇక పెండింగ్‌లో ఉన్న గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న పరీక్షల్లో.. టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్లో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసినా.. పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు. అభ్యర్థులు సన్నద్ధతకు సమయం కోరడం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను దాదాపు మూడుసార్లు మార్చింది. ఇక 2022 ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. డిసెంబర్ నాటికి ఫలితాల ప్రకటనతోపాటు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దయింది. గత ఏడాది జూన్‌లో మరోమారు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా.. పరీక్షల నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. రెండోసారి కూడా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీలో మార్పులు చేయడంతోపాటు ఆ గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజాగా గత నెల 19న 563 పోస్టులతో కొత్తగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్నాళ్లూ పరీక్షల రద్దు, ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశలో ఉన్న నేపథ్యంలో.. ఉత్సాహం నింపేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది. సన్నద్ధతకు సమయం టీఎస్పీఎస్సీ ముందస్తుగా గ్రూప్ ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఆయా పరీక్షలు జరగలేదు. ఈ క్రమంలో షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఏయే పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావొచ్చనే దానిపై అభ్యర్థులు వ్యూహాత్మక ప్రణాళిక తయారు చేసుకునే వీలు కల్పించినట్టు అయిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో గ్రూప్–1 ప్రిలిమ్స్ జరగనుంది. అంటే ఈ పరీక్షలకు మూడు, నాలుగు నెలల వ్యవధి లభించింది. తర్వాత గ్రూప్–2 పరీక్షలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఆ తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు రెండు నెలల వ్యవధి ఉండటంతో సిద్ధమయ్యేందుకు వీలవనుంది. ఇక గ్రూప్–1 మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్–3 పరీక్షలు ఉన్నాయి. మొత్తంగా పరీక్షలకు సమయం సంతృప్తికర స్థాయిలో ఉందని, అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావొచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. -
గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్ల జారీ మొదలుకాగా ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు.. ఎస్బీఐ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీంతో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు బ్యాంకు అంగీకారం తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ఈ అంశాన్ని సాకుగా చూపి గ్రూప్ –2 పరీక్షను వాయిదా వేయించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అడ్డంకులన్నీ తొలగడంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. 4,83,525 మంది దరఖాస్తు.. గ్రూప్–2 పరీక్షల షెడ్యూల్‌ను గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25, మార్చి 4ను మెయిన్స్ తేదీలుగా ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజు ఎస్బీఐ, గ్రూప్స్ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల 5 వేల మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి. అభ్యర్థుల వివరాలు పంపండి.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌తోపాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోగా appschelpdesk@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్బీఐ స్లాట్‌లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్‌లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష కూడా రాసేవారు 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీపీఎస్సీ.. ఎస్బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను యధావిధిగా నిర్వహించనున్నారు. -
597 గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్–1, 508 గ్రూప్–2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌధరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు–భవనాల శాఖల్లో గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక, సాధారణ పరిపాలన, న్యాయ, లేజిస్లేచర్ తదితర శాఖల్లోనూ గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–1లో అత్యధికంగా హోంశాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–కేటగిరి–2లో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 కేటగిరీలో రాష్ట్ర సచివాలయంలో అత్యధికంగా 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్స్, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
హైదరాబాద్: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదే విధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపున గన్‌పార్క్ వద్ద దీక్షలో పాల్గొంటామన్న కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రొ.కోదండంరాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చదవండి: జోడు పదవుల్లో కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు.. బీజేపీ వ్యూహమేంటి -
గ్రూప్–2పై 14లోగా నిర్ణయం చెప్పండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్–2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థనపై 14వ తేదీలోగా నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్–2 పరీక్ష వాయిదా వినతులపై నిర్ణయం తీసుకుంటా మని రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తెలపడంతో ఈ మేరకు అనుమతినిచి్చ ంది. 150 మందే పిటిషన్ వేశారు.. మిగతా అభ్యర్థులంతా గ్రూప్–2 నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని కమిషన్ చెప్పడాన్ని తప్పుబట్టింది. లక్షల మంది కోర్టులో పిటిషన్ వేయలేరు కదా అని వ్యాఖ్యానించింది. నిర్ణయం వెల్లడించడానికి మరింత సమయం కావాలని తొలుత టీఎస్పీఎస్సీ కోరగా న్యాయస్థానం నిరాకరించింది. లక్షల మంది ఎదురుచూసే అంశంలో జాప్యం కూడదని చెప్పింది. విచారణను సోమ వారానికి వాయిదా వేసింది. గ్రూప్–2 పరీక్షల ను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్ చంద్రశేఖర్‌తోపాటు 149 మంది హైకోర్టును ఆశ్ర యించారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్.. తదితర 21 నియామక పరీక్షలు ఒకే నెలలో ఉన్న నేపథ్యంలో గ్రూప్–2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశా రు. అభ్యర్థుల తరఫున న్యాయవాది బి.నర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవీ దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాది ఆలూరి గిరిధర్‌రావు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ‘గ్రూప్–2.. ముఖ్యమైన పరీక్ష. సమర్థులనే తీసుకోవాల్సి ఉంది. దీని కోసం వారు పూర్తిగా సన్నద్ధం అయ్యేందుకు టీఎస్పీఎస్సీ అవకాశమివ్వాలి. హడావుడిగా పరీక్ష నిర్వహణ నియామక ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అది అభ్యర్థులకు, ప్రభుత్వానికి మంచిది కాదు..’అని చెప్పారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేశాం..: టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్టవ్యాప్తంగా గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 1,500కు పైగా పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసి, ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఆ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కూడా ప్రకటించాం. ఇప్పుడు వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు. 14వ తేదీలోగా దీనిపై నిర్ణయం వెల్లడిస్తాం ..’అని నివేదించారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
‘గ్రూప్-2’పై 14న నిర్ణయం ప్రకటిస్తాం: టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థులు.. గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అభ్యర్థులు తమ ధర్నాతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు గ్రూప్-2 వాయిదా కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. మిగిలిన పరీక్షల నేపథ్యంలో గ్రూప్2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్పీఎస్సీ కౌన్సిల్ తమ వాదనలు వినిపించింది. అయితే.. గ్రూప్-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14వ తేదీ) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్పీఎస్సీ కౌన్సిల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు. అభ్యర్థుల వాదనలు.. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్-2 పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా కోరుతున్నారు. అగస్ట్ 2నుండి 30వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. Tspsc కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో సోమవారానికి పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదీ చదవండి: టీఎస్పీఎస్సీ.. పరీక్షల నిర్వహణ పరీక్షే! -
గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు సీపీటీలో అర్హత తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2, గ్రూప్–3 తదితర క్యాడర్ పోస్టుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించినవారు తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ)లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ శనివారం ఉత్తర్వులు (జీవో నంబర్–26) జారీచేశారు. దీనికి సంబంధించిన అడహక్ నిబంధనలను జీవో నంబర్ 26లో పొందుపరిచారు. సీపీటీ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్, రిజర్వేషన్ల వారీగా అర్హత మార్కులను కూడా ఉత్తర్వుల్లో వివరించారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సర్టిఫికెట్ లేకుండా నేరుగా ఏ ఒక్కరికీ ఆయా పోస్టుల్లో నియామకాలకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా, శిక్షణ బోర్డు, లేదా రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, యూజీసీ గుర్తింపు ఉన్న ఇతర సంస్థలు నిర్వహించే ఈ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలో అర్హత సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుందని, పరీక్ష సమయం 60 నిమిషాలని వివరించారు. ఈ పరీక్షలో అర్హత కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాలని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష ప్యాట్రన్‌ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. -
నెదర్లాండ్స్‌కు తొలి విజయం
అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు ‘సూపర్–12’లో బోణీ కొట్టింది. గ్రూప్–2లో బుధవారం జరిగిన పోరులో ఆరెంజ్ టీమ్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లు మీకెరన్ (3/29), బస్‌డి లీడే (2/14), వాన్ బిక్ (2/17), గ్లోవెర్ (2/29) సమష్టిగా దెబ్బతీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆరెంజ్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్ ఒడౌడ్ (47 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో డచ్ జట్టుకిది మూడో గెలుపు. తొలి రౌండ్లో యూఏఈ, నమీబియాలను ఓడించి సూపర్–12కు అర్హత సాధించింది. పవర్‌ప్లేలోనే జింబాబ్వే టాపార్డర్‌ను కోల్పోయింది. వెస్లీ మదెవెర్ (2)ను మీకెరన్, కెప్టెన్ ఇర్విన్ (3), చకబ్వా (5)లను బ్రాండన్ గ్లోవెర్ అవుట్ చేయడంతో జింబాబ్వే 6 ఓవర్లలో 20/3 స్కోరు చేసింది. ఈ దశలో సీన్ విలియమ్స్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు), సికందర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే జట్టుస్కోరు 68 వద్ద మీకెరన్ ఆ జోడీని విడగొట్టి మళ్లీ కష్టాలపాలు చేశాడు. వరుస విరామాల్లో వాన్ బిక్, డి లీడే జింబాబ్వే వికెట్లను పడగొట్టారు. మరోవైపు సికందర్ రజా భారీ సిక్సర్లతో జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ సహచరులు మిల్టన్ (2), రియాన్ బర్ల్ (2), జాంగ్వే (6), ఎన్‌గరవ (9), ముజరబని (1) ఎవరూ పది పరుగులైనా చేయలేకపోయారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్టీఫన్ మిబర్గ్ (8) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ మ్యాక్స్ ఒడౌడ్, వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ కూపర్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించడంతో నెదర్లాండ్స్ గెలుపుబాట పట్టింది. మిడిలార్డర్ బ్యాటర్స్ అకెర్మన్ (1), కెప్టెన్ ఎడ్వర్డ్స్ (5) విఫలమైనా ఇబ్బంది లేకుండా బస్ డి లీడే (12 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించాడు. జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, ముజరబాని రెండు వికెట్లు చొప్పున తీశారు. -
మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
బౌన్స్...బౌన్స్...బౌన్స్... మాకెవరికీ పడదు, మేం ఆడలేం... కానీ బౌన్స్ మాత్రం మమ్మల్ని వదల్లేదు... మా వెంట పడి మరీ వేటాడింది... పెర్త్‌లో తమ ఆట తర్వాత భారత క్రికెటర్లు మనసులో ఇలాగే అనుకొని ఉంటారు. ఊహించిన విధంగానే ఆప్టస్ స్టేడియంలో బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగిపోయారు... అన్నీ తెలిసినా మేం మాత్రం దానికి సిద్ధంగా లేము అన్నట్లుగా భారత బ్యాటర్లు ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్, కార్తీక్, అశ్విన్... ఐదుగురూ ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పుల్ షాట్ ఆడబోయి విఫలం కాగా, కేఎల్ రాహుల్ అదే తరహా అనూహ్య బౌన్స్‌కు వెనుదిరిగాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 50 షార్ట్ బంతులు వేసిన ప్రత్యర్థి బౌలర్లు ఈ ఆరు వికెట్లతో పండగ చేసుకున్నారు. ఒకదశలో స్కోరు 49/5... 100 కూడా చేయడం కష్టమనిపించించిది. అయితే సూర్యకుమార్ మాత్రం పిచ్‌ను పట్టించుకోను అనే రీతిలో కొన్ని చక్కటి షాట్లతో అర్ధసెంచరీ చేసి ఆదుకోవడంతో భారత్ పరువు కొంత దక్కింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. మన పేసర్లూ మెరిసినా... 134 పరుగుల లక్ష్యం మరీ చిన్నదైపోయింది. మిల్లర్, మార్క్రమ్ బాధ్యతాయుత బ్యాటింగ్ సఫారీ టీమ్‌ను ఆదుకుంది. ఫలితంగా రెండు వరుస విజయాల తర్వాత రోహిత్ బృందం తొలి పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పటిష్ట జట్టుపై నెగ్గి దక్షిణాఫ్రికా గ్రూప్–2లో అగ్రస్థానానికి చేరింది. పెర్త్: టి20 ప్రపంచకప్ గ్రూప్–2లో బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు టీమిండియా తలవంచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లుంగి ఇన్‌గిడి (4/29) భారత టాపార్డర్‌ను కుప్పకూల్చగా, పార్నెల్ (3/15) కూడా రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు సాధించి గెలిచింది. డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్రమ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 76 పరుగులు జోడించారు. అర్‡్షదీప్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. టపటపా... పెర్త్ పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత తొలి తొమ్మిది బంతుల్లో భారత్ ఒక్క పరుగు కూడా తీయలేకపోవడం ప్రమాద హెచ్చరికను చూపించింది! గతంలో మొదటి పరుగు సాధించేందుకు భారత్ ఎప్పుడూ 10 బంతులు తీసుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) సిక్సర్లతోనే తమ ఖాతాలు తెరిచినా ఆ జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపించగా, కోహ్లి (12) అరుదైన వైఫల్యం భారత్ కష్టాలు పెంచింది. తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతున్న దీపక్ హుడా (0) డకౌట్ కాగా, రబడ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ పాండ్యా (2) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జట్టును రక్షించే బాధ్యతను సూర్యకుమార్ తీసుకున్నాడు. ఒకే ఒక్కడు... 9 ఓవర్లోలోపే భారత్ ఐదో వికెట్ కోల్పోయిన సమయంలో మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ స్కోరు 7 పరుగులు. ఇలాంటి స్థితి నుంచి అతను అద్భుత బ్యాటింగ్‌తో జట్టును 100 పరుగులు దాటించడంతో పాటు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించగలిగాడు. నోర్జే 143 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని లెగ్‌సైడ్ ఫ్లిక్‌తో సిక్సర్‌గా మలచిన తీరు సూర్య బ్యాటింగ్ ప్రత్యేకతను చూపించింది. మహరాజ్ బౌలింగ్‌లోనూ మరో సిక్సర్‌తో అతను తన ధాటిని కొనసాగించాడు. అప్పటి వరకు భారత్‌ను బెంబేలెత్తించిన ఇన్‌గిడి ఓవర్లోనే సిక్స్, ఫోర్ బాది 30 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. దినేశ్ కార్తీక్ (6)తో ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించగా అందులో 44 సూర్యవే ఉన్నాయి. ఆ తర్వాతా మరో మూడు ఫోర్లు బాదిన తర్వాత పార్నెల్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. కీలక భాగస్వామ్యం... ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. 24 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే డి కాక్ (1), రోసో (0), బవుమా (10) వెనుదిరిగారు. అర్‡్షదీప్ తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయగా, సఫారీ కెప్టెన్‌ను షమీ అవుట్ చేశాడు. ఇలాంటి దశలో మార్క్రమ్, మిల్లర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జట్టుకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. 35 పరుగుల వద్ద మార్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి వదిలేయగా... 15 పరుగుల వద్ద ఉన్న మిల్లర్‌ను దగ్గరి నుంచి అండర్‌ఆర్మ్ త్రోతో రనౌట్ చేసే అతి సునాయాస అవకాశాన్ని రోహిత్ చేజార్చాడు. 7 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు చెరో సిక్స్ బాది జట్టుపై ఒత్తిడి తగ్గించారు. తక్కువ వ్యవధిలో మార్క్రమ్, స్టబ్స్ (6) వెనుదిరిగినా, పట్టుదలగా చివరి వరకు నిలిచి మిల్లర్ పని పూర్తి చేశాడు. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, భువీ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లతో మ్యాచ్ ముగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 9.4 ఓవర్లలో 97 పరుగులు చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 9; రోహిత్ (సి అండ్ బి) ఇన్‌గిడి 15; కోహ్లి (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; సూర్యకుమార్ (సి) మహరాజ్ (బి) పార్నెల్ 68; హుడా (సి) డికాక్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 2; కార్తీక్ (సి) రోసో (బి) పార్నెల్ 6; అశ్విన్ (సి) రబడ (బి) పార్నెల్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 4; షమీ (రనౌట్) 0; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–23, 2–26, 3–41, 4–42, 5–49, 6–101, 7–124, 8–127, 9–130. బౌలింగ్: పార్నెల్ 4–1–15–3, రబడ 4–0–26–0, ఇన్‌గిడి 4–0–29–4, నోర్జే 4–0–23–1, మహరాజ్ 3–0–28–0, మార్క్రమ్ 1–0–5–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 1; బవుమా (సి) కార్తీక్ (బి) షమీ 10; రోసో (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (సి) సూర్య (బి) హార్దిక్ 52; మిల్లర్ (నాటౌట్) 59; స్టబ్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; పార్నెల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–24, 4–100, 5–122. బౌలింగ్: భువనేశ్వర్ 3.4–0–21–0, అర్‡్షదీప్ 4–0–25–2, షమీ 4–0–13–1, హార్దిక్ 4–0–29–1, అశ్విన్ 4–0–43–1. -
T20 World Cup 2022: నెదర్లాండ్స్‌పై బంగ్లా గెలుపు
హోబర్ట్: టి20 ప్రపంచకప్ గ్రూప్–2లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అఫీఫ్ హొస్సేన్ (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు), మొసాదిక్ (12 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాల్ వాన్, డి లీడే చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 135 పరుగుల వద్ద ఆలౌటైంది. కొలిన్ అకెర్మన్ (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), పాల్ వాన్ మీకెరన్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తస్కీన్ అహ్మద్ (4/25) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సఫారీకి వర్షం దెబ్బ ఇదే గ్రూప్‌లో దక్షిణాఫ్రికా గెలిచే మ్యాచ్‌కు వర్షం షాకిచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా, ఆట మధ్యలో అది 7 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. అయితే చివరకు అదీ సాధ్యం కాక మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మొదట జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 పరుగులు చేసింది. 7 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యంగా మార్చారు. కానీ 3 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసి గెలిచేందుకు సిద్ధమైతే... మళ్లీ కురిసిన వాన మ్యాచ్‌ను ముంచెత్తింది. డికాక్ (18 బంతుల్లో 47 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ వర్షార్పణమైంది. తొలి 2 ఓవర్లు తనే ఎదుర్కొన్న డికాక్ వరుసగా 4, 4, 4, 6, 4, 1, నోబాల్, 0, 4, 4, 4, 0, 4 బాదడం విశేషం. -
గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమేనా.... ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్–1 నియామకాల ప్రక్రియ 3 అం చెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంత రం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్–1, గ్రూప్– 2ల సిల బస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముం దని, నూతన సిలబస్ ఎంపిక, మెటీరియల్ ఫైనలైజేషన్ కొలిక్కి రావడానికి సమ యం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిల బస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబం ధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో రద్దు గ్రూప్–1, గ్రూప్–2 ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ గత ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను ఆసరాగా చేసు కుని ఇష్టానుసారంగా మార్కులు కేటాయించిన అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పారదర్శకత పాటించే విధంగా అక్కడి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దుచేయాలని భావించింది. ఉత్తరాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలను వేగంగా చేపట్టే లక్ష్యంతో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామమని నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
గ్రూప్స్ వైపు వైద్యుల చూపు
►ఆయన పేరు డాక్టర్ రామకృష్ణ (పేరు మార్చాం). హైదరాబాద్‌లో ఒక పేరొందిన మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా, బోధనాసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కానీ, ఏదో అసంతృప్తి. ఎంత చేసినా పదోన్నతులు ఆలస్యం అవుతుండటం, గుర్తింపు లేదన్న భావనతో ఉన్న ఆయన ఇటీవల ప్రకటించిన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గ్రూప్–1 పరీక్షలు రాయాలని, ఉన్నతస్థాయి పోస్టు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ►మరొకరు డాక్టర్ రాహుల్ (పేరు మార్చాం). ఎంబీబీఎస్ పూర్తిచేసి రాష్ట్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే. కానీ, మూడు నాలుగేళ్లుగా మెడికల్ పీజీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నా ఎండీలో సీటు రావడంలేదు. పీహెచ్సీలో పనిచేసుకుంటూ పోవడం, ఎదుగుబొదుగూ లేని జీవితంతో విసిగిపోయిన ఆయన ఈసారి గ్రూప్–1, 2 రెండూ రాయాలని నిర్ణయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకుపైగా వివిధ రకాల పోస్టులు వేయడంతో నిరుద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పుడు పోటీ పరీక్షల వైపు దృష్టి సారిస్తున్నారు. వీరిలో పీజీ మెడికల్ సీటు రాని వైద్యులు కూడా ఉన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించి ఎంబీబీఎస్ చదివినవారు కూడా గ్రూప్స్ పోస్టులపై కన్నేశారు. చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎదుగుబొదుగూ లేని జీతం, ఇంకా పెళ్లికాక స్థిరపడని జీవితం.. వంటి సమస్యలతో మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటివారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన 75 శాతం మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ) పాస్ కాకపోవడంతో దేశంలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోవడం, ప్రాక్టీస్‌కు కూడా అర్హత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలో చాలామంది ఇప్పుడు పోటీపరీక్షలపై దృష్టి సారించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులతోపాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. కేవలం ఎంబీబీఎస్ చది వి స్థిరపడే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో 5,200 ఎంబీబీఎస్ సీట్లుంటే, 2 వేల వరకే పీజీ సీట్లున్నాయి. కోచింగ్ సెంటర్లలో చేరికలు రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ఇప్పటికే కోచింగ్‌లు ప్రారంభమయ్యా యి. హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ‘ఈసారి 500 పైగా ఉన్న గ్రూప్–1 పోస్టుల్లో కనీసం 50 మంది వైద్యులే సాధిస్తారని అనుకుంటున్నా. గతంలో నేను సివిల్స్ కోసం కూడా పోటీపడ్డాను. మెయిన్స్ పాసయ్యాను. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రావడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నా. ఇప్పుడు గ్రూప్–1 సాధిద్దామని అనుకుంటున్నా’అని ఒక బోధనాసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యుడు పేర్కొన్నారు. ఇక్కడ చాకిరి తప్ప ఏమీ లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. గ్రూప్–1 అధికారిగా ఎంతో సేవచేయొచ్చు. సమాజంలో గౌరవం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులుగా పనిచేస్తున్నవారు కూడా చేరుతున్నారని ఒక కోచింగ్ సెంటర్ యజమాని తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు కూడా గ్రూప్–1 పోస్టులకు సన్నద్ధం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల
సాక్షి,అమరావతి: గ్రూప్-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్సైట్లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచినట్లు తెలిపారు -
ఏపీపీఎస్ ద్వారా త్వరలో 1,200కు పైగా పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. 2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. -
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. పదేళ్ల తరువాత.. రాష్ట్రంలో కీలకమైన గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల సమస్యల కారణంగానే ఇన్నాళ్లుగా భర్తీకి నోచుకోలేదు. 2011లో చేపట్టిన గ్రూప్-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. అయితే 2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’కు సవరణలు చేసింది. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. పోస్టులను ఎప్పుడో గుర్తించినా.. తెలంగాణ ఏర్పాటయ్యాక తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. గ్రూప్-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది. భర్తీకోసం గ్రూప్-1లో 142 పోస్టులను, గ్రూప్–2లో 60 పోస్టులను, గ్రూప్–3లో 400 వరకు పోస్టులను గుర్తించింది. మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోన్, జోనల్ పోస్టులు కలుపుకొని 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. శాఖల వారీగా పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలనాపర సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. రాష్ట్రంలో జిల్లాలను తొలుత 31 జిల్లాలుగా విభజించింది. అప్పటివరకు ఉన్న 2 జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లు మార్చింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించినా.. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో మళ్లీ ఆగిపోయింది. మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
కరోనా వేళ.. ‘సూపర్’ కథ!
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 నియామకాల ద్వారా నియమితులైన ఎస్సైల వేతనాల చెల్లింపులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమంటూ 83 సూపర్ న్యూమరరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశమైంది. కరోనా కాలంలో కాసులకు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ ఈ పోస్టులు సృష్టించి మరీ ఏడాదిపాటు వేతనాలు చెల్లించడం ఎందుకనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ పోస్టుల సృష్టి ద్వారా శాఖ పరిధిలో అడ్హాక్ పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లను రివర్షన్ గండం నుంచి తప్పించారని, తద్వారా చాలాకాలంగా పదోన్నతులు లేకుండా ఉన్నవారికి ఉపశమనం కలిగిందని మరికొందరు అంటున్నారు. చాలాకాలంపాటు ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతిపై పనిచేసినవారిని.. డైరెక్ట్ రిక్రూటీలు వచ్చారనే కారణంతో వెనక్కు పంపడం వారిని నైతికంగా దెబ్బతీస్తుందని, అందుకే వారికి సాధారణ పదోన్నతుల సమయం వచ్చే వరకు ఈ పోస్టులు మనుగడలో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ ఉత్తర్వుల ద్వారా గరిష్టంగా రూ.3 కోట్ల అదనపు భారం ఆ శాఖపై పడుతుందని సమాచారం. మరోవైపు ఈ ఉత్తర్వుల జారీ కోసం కాసులు చేతులు మారాయని, ఈ నేపథ్యంలోనే హడావుడి ఆదేశాలు వచ్చాయనే మరో చర్చ కూడా ఉద్యోగుల్లో సాగుతోంది. మొత్తం మీద కరోనా కలకలం రేపుతున్న వేళ వచ్చిన సూపర్ న్యూమరరీ ఉత్తర్వులు ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. -
పట్టు బట్టారు..కొలువు కొట్టారు
టీఎస్పీఎస్సీ గురువారం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని వారు నిరూపించారు. ఉన్నత ఉద్యోగాలు పొంది యువతీయువకులకు ఆదర్శంగా నిలిచారు. వరుసగా ప్రభుత్వ కొలువులు నిర్మల్‌టౌన్: జిల్లా వాసి నీతా గ్రూప్ 2 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఈవోపీఆర్డీ(ఎంపీవో) పోస్టును కైవసం చేసుకుంది. గతంలోనూ నీతా పలు పోటీ పరీక్షల్లో రాణించింది. తెలంగాణ గురుకుల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో టీజీటీగా ఎంపికైంది. అలాగే తెలంగాణ సంక్షేమ గురుకుల కళాశాలలో జేఎల్, డీఎల్ పోస్టుకు సైతం ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం నిర్మల్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. నీతా భర్త రవికుమార్‌రెడ్డి పట్టణంలో కంటి వైద్య సహాయక నిపుణులుగా పనిచేస్తున్నారు. తన భర్త రవికుమార్‌రెడ్డి ప్రోత్సాహం వల్ల తాను గ్రూప్–2 సాధించినట్లు నీతా తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నుంచి గ్రూప్ 2కు ఎంపిక లక్ష్మణచాంద(నిర్మల్): మండలంలోని తిర్పెల్లి గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శోభన గ్రూప్ 2కు ఎంపికైంది. గ్రూప్ 2 ఫలితాల్లో తమ గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి శోభన గ్రూప్ 2కు ఎంపికకావడం ఆనందంగా ఉందని సర్పంచ్ క్రిష్ణారెడ్డి, గ్రామస్తులు తెలిపారు. భర్త రాము, తండ్రి సత్తయ్యల ప్రోత్సాహంతోనే బాగా చదివి గ్రూప్ 2కు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. భర్త రాము ప్రస్తుతం నిర్మల్‌లో పీసీగా పనిచేస్తుండగా, తండ్రి సత్తయ్య హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రైతుబిడ్డ డీటీగా.. జన్నారం(ఖానాపూర్): ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు లాకవత్ తిరుపతి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పోలీస్కానిస్టేబుల్, వీఆర్వో, బీట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం గ్రూపు 2లో డీటీగా ఎంపికయ్యాడు. చింతగూడ గ్రామానికి చెందిన లాకవత్ గంగన్న, సుగుణలకు పెద్ద కుమారుడు లాకవత్ తిరుపతి బీటెక్ చదివాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాడు. తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కాలనే పట్టుదలతో చదివి ఉద్యోగం పొందినట్లు తిరుపతి తెలిపాడు. గ్రూపు 1 అధికారి కావడమే తన లక్ష్యమన్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మంచిర్యాలఅర్బన్: గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తునే గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యానని దీని వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు కిరణ్. మంచిర్యాలకు చెందిన శంకరయ్య, లక్ష్మీల దంపతుల కుమారుడైన కిరణ్ చిన్న నాటి నుంచే చదువులో చురుకైనవాడు. బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంలో గ్రూపు–2 పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇదే సమయంలో గ్రామకార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. డీటీగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపాడు. పోలీస్‌శాఖ నుంచి రెవెన్యూ అధికారులుగా కాగజ్‌నగర్‌టౌన్: ప్రణాళికతో చదివితే ప్రభుత్వ కొలువు సులువేనని నిరూపించారు పట్టణ ఎస్సై శ్రీలేఖ, కానిస్టేబుల్ సందీప్‌లు. గ్రూప్–2 లక్ష్యంగా నిరంతర సాధన చేసిన వీరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వరించింది. కాగజ్‌నగర్ షీ టీం ఎస్సైగా సేవలు అందిస్తున్న ఖానాపూర్ పట్టణాకి చెందిన ఎస్సై శ్రీలేఖ 2017 బ్యాచ్‌లో పోలీస్ శాఖలో ఎస్సైగా ఎంపికైయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికైయ్యారు. మంచిర్యాల జిల్లా కాలేజి రోడ్డుకు చెందిన దూత సందీప్ సీఐ గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. గ్రూప్2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వరించింది. ఉద్యోగాలకు ఎంపికైన శ్రీలేఖ, సందీప్‌లను సీఐ అభినందించారు. కష్టపడి చదివాం భీమిని: భీమిని మండలంలోని వీగాం, ఖర్జీంభీంపూర్ గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు విజయ్‌కుమార్, రాంప్రసాద్‌లు గ్రూప్–2కు ఎంపికయ్యారు. విజయ్‌కుమార్ ఎక్సైజ్ ఎస్సైగా ఎంపిక కాగా, రాంప్రసాద్ వాణిజ్యశాఖ పన్నుల అధికారిగా ఎంపికయ్యారు. ఇటు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్–2కు కష్టపడి చదివి ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు. గ్రూప్–2కు ఎంపిక కావడంపై భీమిని మండలంలోని పలువురు నాయకులు, అధికారులు వీరిని అభినందించారు. కార్యదర్శి నుంచి డీటీగా.. బజార్హత్నూర్(బోథ్): మండలంలోని దిగ్నూర్ గ్రామపంచాయతీలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఓరుగంటి భావన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైంది. ఇచ్చోడ గ్రామానికి చెందిన ఓరుగంటి చిన్నయ్య, భారతి దంపతుల కూతురు ఓరుగంటి భావన పాఠశాల విద్య ఇచ్చోడలోని ప్రగతి పాఠశాలలో, ఇంటర్ విశ్వోదయ కళాశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో పూర్తిచేసి ఆర్సీరెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. డీటీగా ఉద్యోగం సాధించడంతో ఎంపీడీవో దుర్గం శంకర్, ఈవోపీఆర్డీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు అభినందించారు. కష్టపడి.. విజయం సాధించి.. నిర్మల్అర్బన్: నిర్మల్ పట్టణానికి చెందిన బుక్క బద్రి కీర్తన ప్రభుత్వ ఉద్యోగం కష్టపడి చదివి చివరకు అనుకున్నది సాధించింది. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు జగిత్యాలలో చదువుకుంది. అనంతరం ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఏ ఇంగ్లిష్, బీఈడీ పూర్తి చేసింది. గురువారం ప్రకటించిన గ్రూప్ –2 ఫలితాలలో ఏసీటీవోగా ఎంపికైంది. తల్లిదండ్రులు సత్యనారాయణ – మనోహర, భర్త నవీన్‌కుమార్‌ల ప్రోత్సాహంతో ఏసీటీవోగా ఎంపికయ్యానన్నారు. తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు కేరాఫ్ బాసర: మండలంలోని లాబ్ది గ్రామానికి చెందిన డోంగ్రె సాయిప్రసాద్ గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించి ఈవోపీఆర్డీగా ఉద్యోగం రావడంతో గ్రామస్తులు ఆయనను సన్మానించారు. సాయిప్రసాద్ డొంగ్రె మారుతి, సావిత్ర బాయిల దంపతుల కుమారుడు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఉస్మానియాలో ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈవోపీఆర్డీ ఉద్యోగం చేస్తూ గ్రామాభివృద్ధికి సహకారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌గా చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన గద్దె రాజు గ్రూపు–2 ఫలితాల్లో మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. 2018లో ఎఫ్ఆర్వోగా ఎంపికైన రాజు ప్రస్తుతం కర్ణాటకలోని దార్వడ్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 2013లో బీటెక్ పూర్తి చేసిన రాజు రెండేళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. 2017లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించి ఏడాది పాటు విధులు నిర్వర్తించాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే గ్రూప్–2 పరీక్ష రాసి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. కార్యదర్శి నుంచి ఎంపీవోగా.. నేరడిగొండ(బోథ్): రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో బోథ్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన మోర మహేందర్‌రెడ్డి ఎంపీవోగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన బుద్ధికొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్–2కు ఎంపిక కావడంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు నేరడిగొండ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. నిరంతర శ్రమ ఫలించింది ఆదిలాబాద్‌టౌన్: మావల మండలంలోని వాగాపూర్ గ్రామానికి చెందిన ఎల్టీ సంతోష్‌రెడ్డి గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. వాగాపూర్‌కు చెందిన ఎల్టీ సుదర్శన్‌రెడ్డి–విజయమ్మ దంపతుల కుమారుడైన సంతోష్ ఉద్యోగం సాధించడంపై పలువురు అభినందించారు. కాగా సంతోష్ 1 నుంచి 10వ తరగతి వరకు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ శిశుమందిర్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఇంటర్, డిగ్రీ ఆదిలాబాద్‌లో పూర్తి చేశారు. అనంతరం నిరంతరం శ్రమించి ఉద్యోగం పొందినట్లు ఆయన తెలిపారు. స్నేహితుడి ప్రోత్సాహంతో బెల్లంపల్లిరూరల్: మంచికైనా, చెడుకైనా ఓ మంచి స్నేహితుడు తోడుంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని ఆ యువకుడు నిరూపించాడు. బెల్లంపల్లి మండలం బుధాకుర్థు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన వీర్ల వినోద్‌కుమార్ ఇటీవల విడుదలైన గ్రూపు –2 ఫలితాల్లో ఎక్సైజ్ శాఖలో ఎస్సై కొలువు సాధించాడు. గ్రామానికి చెందిన వీర్ల రామయ్య, వజ్రమ్మల కుమారుడు వినోద్ కుమార్ ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం గురువారం విడుదల అయినా గ్రూప్ 2 ఫలితాల్లో కొలువు సాధించాడు. ఉద్యోగాలు సాధించడానికి తన తల్లిదండ్రుల కష్టంతో పాటు యూఎస్ఏలో స్థిరపడిన తన మిత్రుడు భుక్య సుమంత్ కృషి ఎంతో ఉందని వినోద్ కుమార్ తెలిపాడు. అమూల్య సలహాలను అందించిన సుమంత్ పాత్ర ఎంతో ఉందన్నాడు. కొలువు కొట్టిన ఉపాధ్యాయుడు దండేపల్లి(మంచిర్యాల): మండలంలోని కొర్విచెల్మకు చెందిన దండవేణి మల్లేశ్ గ్రూప్–2 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మల్లేశ్ ప్రస్తుతం నెన్నల మండలం కోనంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపనతో గ్రూప్–2కు ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు. కొలువు పొందిన ఆయనను పలువురు అభినందించారు. కొలువు సాధించిన సుంక్లి యువకుడు భైంసారూరల్: మండలంలోని సుంక్లి గ్రామానికి చెందిన మాలేగాం విష్ణువర్ధన్ గ్రూప్–2లో కొలువు సాధించి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా ఎంపికయ్యాడు. రైతు కుటుంబానికి చెందిన విష్ణువర్ధన్ సుంక్లి గ్రామానికి చెందిన మాలేగాం రుక్మవ్వ – భూమన్న అనే దంపతులకు మూడవ సంతానమైన విష్ణువర్ధన్ పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాడు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగాలకు సిద్ధమయ్యాడు. కొలువు రావడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ మేనేజర్ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా.. కుంటాల: మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన గోవర్దన్ గ్రూప్ 2లో విజయం సాధించి ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సారంగపూర్ మండల కేంద్రంలో ఎస్బీఐ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎంబీఏ చేస్తుండగా బ్యాంకులో ఉద్యోగం సాధించారు. అనంతరం గ్రూప్ 2 కోసం నిరంతరం కృషి చేసి ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. గోవర్దన్‌ది రైతు కుటుంబం. తల్లి లక్ష్మీ బీడీ కార్మికులు కాగా, తండ్రి భూమన్న రైతు. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా.. ఆదిలాబాద్‌టౌన్: తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన బోండ్ల మల్లయ్య సుజాత దంపతుల కూమార్తె మానస ఇటీవల విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది. కాగా ఆమె ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని మహిళ కోర్టులో ఫీల్డ్ అíసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తునే గ్రూప్ –2 పరీక్షలు రాసి ఎంపికైంది. ఉద్యోగం రావడంపై కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. -
ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో..ఇంటర్వ్యూలు రద్దు
-
గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్షల (స్క్రీనింగ్ టెస్టు) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గ్రూప్ 2 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం 446 పోస్టుల భర్తీకి 150 మార్కులకు ఈ ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. జనరల్ కటాఫ్ (ఓసీ) కింద 81.20 మార్కులను పరిగణనలోకి తీసుకొని అర్హులైన 6,195 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వీరికి మెయిన్స్ పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. జనరల్ కటాఫ్‌లో 5,540 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. గత ప్రభుత్వం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న నిర్ణయాధికారాన్ని ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ జీవో 5ను జారీ చేసిన నేపథ్యంలో 1:13.89 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నిష్పత్తిలో ఆయా కేటగిరీల వారీగా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఎంపిౖకైన విభాగాల్లో వారికి కటాఫ్ తగ్గించి మిగతా వారిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఇలా ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. మెయిన్స్‌లో వారు అత్యధిక మార్కులతో మెరిట్లో నిలిచినా వారికి ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులు కారు. బీసీ–సీ కేటగిరీలో అభ్యర్థులు తక్కువ కావడంతో కటాఫ్‌ను 66.67 మార్కులకు తగ్గించి అదనంగా 83 మందిని ఎంపిక చేసింది. అలాగే బీసీ–ఈ కేటగిరీలో కటాఫ్‌ను 77.31కి తగ్గించి 77 మందిని, ఎస్సీ కేటగిరీలో కటాఫ్‌ను 78.37కు తగ్గించి 215 మందిని, ఎస్టీ కేటగిరీలో కటాఫ్‌ను 69.15కు కుదించి 195 మందిని, అంధుల కేటగిరీలో కటాఫ్ మార్కులు 60.99గా చేసి 38 మందిని, బధిరుల కేటగిరీలో కటాఫ్‌ను 60.99గా నిర్ణయించి 23 మందిని, ఆర్థో కేటగిరీలో 76.60 మార్కులను కటాఫ్‌గా పరిగణించి 24 మందిని ఎంపిక చేశారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ కేటగిరీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులుండటంతో అక్కడ ఎలాంటి సడలింపు లేకుండానే అభ్యర్థులు ఎంపికయ్యారు. 726 మందితో తిరస్కరణ జాబితా గ్రూప్2 ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన వారిలో వివిధ పొరపాట్లు చేసిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించకుండా తిరస్కరణ జాబితాలో చేర్చింది. ట్యాంపరింగ్, బుక్లెట్ సిరీస్ నంబర్లు సరిగా గుర్తించకపోవడం, ఎక్కువ బుక్లెట్ సిరీస్ నంబర్లను గుర్తించడం, వైట్నర్ను వినియోగించడం తదితర కారణాలతో 726 మంది తిరస్కరణకు గురయ్యారు. వారి జాబితాను కూడా వెబ్సైట్లో పొందుపరచింది. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలి : నిరుద్యోగ జేఏసీ డిమాండ్ ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిరుద్యోగ జేఏసీ విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ధ్వజమెత్తింది. జీవో 5ను రద్దు చేసి పాత విధానంలో ఎంపికలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ‘గ్రూప్2 రివైజ్డ్ కీలో 9 ప్రశ్నలను తొలగించారు. వీటిలో ఒక ప్రశ్నకు మాత్రమే వివరణ ఇచ్చారు. 8 ప్రశ్నలను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వలేదు. 7 ప్రశ్నలకు సమాధానాలను మార్పు చేశారు. దీనివల్ల చాలా మంది నష్టపోయారు. లక్షల మంది రాసే పరీక్షల్లో ప్రశ్నపత్రంలో తప్పులు లేకుండా చూడవలసిన బాధ్యత ఏపీపీఎస్సీ మీద ఉంది. కానీ ప్రతి పరీక్షలోనూ ఏపీపీఎస్సీ తప్పుల తడకల ప్రశ్నపత్రాలు ఇస్తోంది. తెలుగు అనువాద ప్రశ్నలు మరింత అన్యాయంగా ఉండడంతో వేలాది మంది నష్టపోయారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం’ అని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలంగాణలో గ్రూప్-2కు హైకోర్టు లైన్ క్లియర్
-
గ్రూప్-2కి హైకోర్టులో లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-2 నియామక ఎంపిక ప్రక్రియకు సోమవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించాలని టీఎస్పీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో గతంలో తొలగించిన 343 మందికి ఊరట లభించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల వెరిఫికేషన్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. 1032 పోస్టులకు 1:3 రేషియోలో 3147 మంది అభ్యర్థులు సెలెక్టయిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి