అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు ‘సూపర్–12’లో బోణీ కొట్టింది. గ్రూప్–2లో బుధవారం జరిగిన పోరులో ఆరెంజ్ టీమ్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లు మీకెరన్ (3/29), బస్‌డి లీడే (2/14), వాన్ బిక్ (2/17), గ్లోవెర్ (2/29) సమష్టిగా దెబ్బతీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆరెంజ్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్ ఒడౌడ్ (47 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో డచ్ జట్టుకిది మూడో గెలుపు. తొలి రౌండ్‌లో యూఏఈ, నమీబియాలను ఓడించి సూపర్–12కు అర్హత సాధించింది.
పవర్‌ప్లేలోనే జింబాబ్వే టాపార్డర్‌ను కోల్పోయింది. వెస్లీ మదెవెర్ (2)ను మీకెరన్, కెప్టెన్ ఇర్విన్ (3), చకబ్వా (5)లను బ్రాండన్ గ్లోవెర్ అవుట్ చేయడంతో జింబాబ్వే 6 ఓవర్లలో 20/3 స్కోరు చేసింది. ఈ దశలో సీన్ విలియమ్స్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు), సికందర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే జట్టుస్కోరు 68 వద్ద మీకెరన్ ఆ జోడీని విడగొట్టి మళ్లీ కష్టాలపాలు చేశాడు. వరుస విరామాల్లో వాన్ బిక్, డి లీడే జింబాబ్వే వికెట్లను పడగొట్టారు. మరోవైపు సికందర్ రజా భారీ సిక్సర్లతో జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ సహచరులు మిల్టన్ (2), రియాన్ బర్ల్ (2), జాంగ్వే (6), ఎన్‌గరవ (9), ముజరబని (1) ఎవరూ పది పరుగులైనా చేయలేకపోయారు.
తర్వాత సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్టీఫన్ మిబర్గ్ (8) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ మ్యాక్స్ ఒడౌడ్, వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ కూపర్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించడంతో నెదర్లాండ్స్ గెలుపుబాట పట్టింది. మిడిలార్డర్ బ్యాటర్స్ అకెర్‌మన్ (1), కెప్టెన్ ఎడ్వర్డ్స్ (5) విఫలమైనా ఇబ్బంది లేకుండా బస్ డి లీడే (12 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించాడు. జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, ముజరబాని రెండు వికెట్లు చొప్పున తీశారు.
Comments
Please login to add a commentAdd a comment