T20 WC 2022: Netherlands Eliminate South Africa, Fans Trolls UAE Reason - Sakshi
Sakshi News home page

WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ!

Published Sun, Nov 6 2022 10:14 AM | Last Updated on Sun, Nov 6 2022 1:58 PM

WC 2022 Netherlands Eliminate South Africa Fans Trolls UAE Reason - Sakshi

ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్‌​-2022 టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మేజర్‌ ఈవెంట్లలో కీలక సమయంలో ప్రొటిస్‌ చేతులెత్తేస్తుందన్న అపవాదును నిజం చేస్తూ కనీసం సెమీస్‌ చేరకుండానే బవుమా బృందం వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అది కూడా పసికూన చేతిలో ఓటమి పాలై సఫారీ జట్టు ఇలా ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.  

మరీ ఇంత ఘోరంగా
ఎలాంటి సమీకరణాలతో సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆదివారం అడిలైడ్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్లకు అనుకూలించే పిచ్‌లపై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లే సవాలు ఎదుర్కొన్న వేళ.. డచ్‌ జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. 

కుప్పకూలిన బ్యాటింగ్‌ ఆర్డర్‌
అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ నెదర్లాండ్స్‌ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్‌ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. అయినా సౌతాఫ్రికాకు ఇదేమీ పెద్ద లక్ష్యం కాబోదని ఫ్యాన్స్‌ భావించారు. కానీ డచ్‌ బౌలర్ల ధాటికి ప్రొటిస్‌ బ్యాటర్లు నిలవలేకపోయారు. ఈ ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన రిలీ రోసో 25 పరుగులతో సఫారీ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడంటే ప్రొటిస్‌ బ్యాటింగ్‌ వైఫల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డికాక్‌ 13, కెప్టెన్‌ తెంబా బవుమా 20, మార్కరమ్‌ 17, డేవిడ్‌ మిల్లర్‌ 17, క్లాసెన్‌ 21, కేశవ్‌ మహరాజ్‌ 13 పరుగులు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13 పరుగుల తేడాతో గెలుపొందిన నెదర్లాండ్స్‌.. సౌతాఫ్రికా సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది. 

ఆ రోజు అలా
నిజానికి సూపర్‌-12లో జింబాబ్వేతో మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించకపోతే సౌతాఫ్రికా ఈ ఓటమి తర్వాత కూడా సెమీస్‌ రేసులో నిలిచేదే! కానీ దురదృష్టం వెంటాడింది. ఆ మ్యాచ్‌ రద్దు కావడంతో ప్రొటిస్‌కు ఒక్క పాయింట్‌ మాత్రమే వచ్చింది. తాజా పరాజయంతో పట్టికలో ఐదు పాయింట్లకే పరిమితమైన బవుమా బృందం భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

యూఏఈ వల్లే ఇదంతా
ఇదిలా ఉంటే.. అనూహ్య పరిస్థితుల్లో సూపర్‌-12కు చేరుకున్న ‘పసికూన’ నెదర్లాండ్స్‌.. సౌతాఫ్రికాను ఎలిమినేట్‌ చేసి సంచలనం చేసింది. కాగా క్వాలిపైయర్స్‌(గ్రూప్‌-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక పోరులో నమీబియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా యూఏఈ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం అన్నట్లుగా నమీబియా ఓటమితో నెదర్లాండ్స్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.

సూపర్‌-12 రేసులో పోటీపడిన నమీబియాను ఓడించిన యూఏఈ దగ్గరుండి మరీ డచ్‌ జట్టును ముందుకు నడిపినట్లయింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సౌతాఫ్రికా ఇంటికి వెళ్లడానికి పరోక్షంగా వర్షం, యూఏఈ కారణం.. ఆరోజు వర్షం రాకపోయినా.. యూఏఈ గెలవకపోయినా పాపం ప్రొటిస్‌ సెమీస్‌ చేరేదేమో అంటూ తోచిన రీతిలో విశ్లేషిస్తున్నారు.

చదవండి: T20 WC 2022: సెమీస్‌కు టీమిండియా.. ఆశల పల్లకీలో పాకిస్తాన్‌, అనూహ్యంగా రేసులోకి బంగ్లా
టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్‌.. అత్యాచారం కేసులో క్రికెటర్‌ అరెస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement