గ్రూప్స్‌ వైపు వైద్యుల చూపు | Hyderabad: MBBS Students Interest To Write Group Exam Tests | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌ వైపు వైద్యుల చూపు

Published Mon, Apr 4 2022 3:16 AM | Last Updated on Mon, Apr 4 2022 3:16 AM

Hyderabad: MBBS Students Interest To Write Group Exam Tests - Sakshi

ఆయన పేరు డాక్టర్‌ రామకృష్ణ (పేరు మార్చాం). హైదరాబాద్‌లో ఒక పేరొందిన మెడికల్‌ కాలేజీలో అధ్యాపకుడిగా, బోధనాసుపత్రిలో స్పెషలిస్ట్‌ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కానీ, ఏదో అసంతృప్తి. ఎంత చేసినా పదోన్నతులు ఆలస్యం అవుతుండటం, గుర్తింపు లేదన్న భావనతో ఉన్న ఆయన ఇటీవల ప్రకటించిన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గ్రూప్‌–1 పరీక్షలు రాయాలని, ఉన్నతస్థాయి పోస్టు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. 

మరొకరు డాక్టర్‌ రాహుల్‌ (పేరు మార్చాం). ఎంబీబీఎస్‌ పూర్తిచేసి రాష్ట్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో మెడికల్‌ ఆఫీసర్‌. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే. కానీ, మూడు నాలుగేళ్లుగా మెడికల్‌ పీజీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నా ఎండీలో సీటు రావడంలేదు. పీహెచ్‌సీలో పనిచేసుకుంటూ పోవడం, ఎదుగుబొదుగూ లేని జీవితంతో విసిగిపోయిన ఆయన ఈసారి గ్రూప్‌–1, 2 రెండూ రాయాలని నిర్ణయించుకున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకుపైగా వివిధ రకాల పోస్టులు వేయడంతో నిరుద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పుడు పోటీ పరీక్షల వైపు దృష్టి సారిస్తున్నారు. వీరిలో పీజీ మెడికల్‌ సీటు రాని వైద్యులు కూడా ఉన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించి ఎంబీబీఎస్‌ చదివినవారు కూడా గ్రూప్స్‌ పోస్టులపై కన్నేశారు.

చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎదుగుబొదుగూ లేని జీతం, ఇంకా పెళ్లికాక స్థిరపడని జీవితం.. వంటి సమస్యలతో మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటివారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసిన 75 శాతం మంది ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌(ఎఫ్‌ఎంజీఈ) పాస్‌ కాకపోవడంతో దేశంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేకపోవడం, ప్రాక్టీస్‌కు కూడా అర్హత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

వారిలో చాలామంది ఇప్పుడు పోటీపరీక్షలపై దృష్టి సారించారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులతోపాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. కేవలం ఎంబీబీఎస్‌ చది వి స్థిరపడే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో 5,200 ఎంబీబీఎస్‌ సీట్లుంటే, 2 వేల వరకే పీజీ సీట్లున్నాయి.  

కోచింగ్‌ సెంటర్లలో చేరికలు 
రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ఇప్పటికే కోచింగ్‌లు ప్రారంభమయ్యా యి. హైదరాబాద్‌ లో కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ‘ఈసారి 500 పైగా ఉన్న గ్రూప్‌–1 పోస్టుల్లో కనీసం 50 మంది వైద్యులే సాధిస్తారని అనుకుంటున్నా. గతంలో నేను సివిల్స్‌ కోసం కూడా పోటీపడ్డాను. మెయిన్స్‌ పాసయ్యాను. మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం రావడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నా.

ఇప్పుడు గ్రూప్‌–1 సాధిద్దామని అనుకుంటున్నా’అని ఒక బోధనాసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్‌ వైద్యుడు పేర్కొన్నారు. ఇక్కడ చాకిరి తప్ప ఏమీ లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. గ్రూప్‌–1 అధికారిగా ఎంతో సేవచేయొచ్చు. సమాజంలో గౌరవం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్‌ పూర్తి చేసిన డాక్టర్లు, స్పెషలిస్ట్‌ వైద్యులుగా పనిచేస్తున్నవారు కూడా చేరుతున్నారని ఒక కోచింగ్‌ సెంటర్‌ యజమాని తెలిపారు. మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్లు కూడా గ్రూప్‌–1 పోస్టులకు సన్నద్ధం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement