సాక్షి, హైదరాబాద్: దేశంలో 512 మెడికల్ కాలేజీల్లో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎంబీబీఎస్ తదితర వైద్య గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా, 55 మంది ఎండీ, ఎంఎస్ చదువుతున్న విద్యార్థులున్నారని పేర్కొంది. వేధింపులు, ఒత్తిడి తదితర కారణాల వల్ల 1,166 మంది మధ్యలోనే వైద్యవిద్యను వదిలేసి వెళ్లిపోయారని వివరించింది.
అందులో ఎంబీబీఎస్ విద్యార్థులు 160 మంది, పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ విద్యార్థులు 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 50 మంది, గైనిక్ 103 మంది, ఎంఎస్ ఈఎన్‌టీ 100 మంది, పీజీ ఎండీ జనరల్ మెడిసిన్56 మంది, ఎండీ పీడియాట్రిక్స్ 54 మంది, ఇతర బ్రాంచీలకు చెందినవారు 529 మంది ఉన్నారని తెలిపింది. 18–30 ఏళ్ల మధ్యలో వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలో వెల్లడించింది.
వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్‌ఎంజీఈ పాసైతేనే మన దేశంలో మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. పీజీలో ఆర్థికభారం, వృత్తి బాధ్యతలు, పెళ్లికాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment