సాక్షి, అమరావతి: ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్ల జారీ మొదలుకాగా ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు.. ఎస్‌బీఐ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు.
దీంతో గ్రూప్–2తో పాటు ఎస్‌బీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు బ్యాంకు అంగీకారం తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ఈ అంశాన్ని సాకుగా చూపి గ్రూప్ –2 పరీక్షను వాయిదా వేయించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అడ్డంకులన్నీ తొలగడంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు.
4,83,525 మంది దరఖాస్తు..
గ్రూప్–2 పరీక్షల షెడ్యూల్‌ను గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్‌బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25, మార్చి 4ను మెయిన్స్ తేదీలుగా ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజు ఎస్‌బీఐ, గ్రూప్స్ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల 5 వేల మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి.
అభ్యర్థుల వివరాలు పంపండి..
ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌తోపాటు ఎస్‌బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోగా appschelpdesk@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది.
ఎస్‌బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్‌లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2తో పాటు ఎస్‌బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్‌బీఐ స్లాట్‌లో వారికి అవకాశం కల్పించాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్‌బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే ఎస్‌బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్‌లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రూప్–2తో పాటు ఎస్‌బీఐ పరీక్ష కూడా రాసేవారు 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీపీఎస్సీ.. ఎస్‌బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను యధావిధిగా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment