
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
హాజరుకానున్న 10,58,893 మంది విద్యార్థులు
రాష్ట్రవ్యాప్తంగా 1,535 సెంటర్ల ఏర్పాటు
20 నుంచి హాల్‌టికెట్ల జారీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీన ముగుస్తాయి. మైనర్, ఒకేషనల్ పరీక్షలు 20వ తేదీ వరకు ఉంటాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్ల పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం పాటిస్తారు. ఈ విధానంలో ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది సెంటర్‌తో సహా సమస్త వివరాలు తెలిసిపోతాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment