Intermediate Public Examinations
-
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్–2023 పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. వీటిని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30, మే 10వ తేదీలలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఆదివారాలతో కలుపుకొని ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ ఇదే షెడ్యూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం: ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనిలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఏప్రిల్‌లో ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సాధారణంగా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేసేవారు. ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ప్రాక్టికల్స్‌ను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా కేటాయించింది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించడంతోపాటు 13, 15 తేదీలను రిజర్వులో ఉంచింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఇంటర్మీడియెట్‌బోర్డు ఈసారి ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నో ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్ చేయకుండా అన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ‘నో ఫోన్ జోన్లు’గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీసుస్టేషన్ల నుంచి తీసుకొనే సమయంలో ఆయా విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది వారి సెల్ఫోన్లను పోలీసుస్టేషన్లలో డిపాజిట్ చేయాలని బోర్డు ఆదేశించింది. అలాగే పరీక్షల విధుల్లో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తమ సెల్ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద డిపాజిట్ చేయాలి. పోలీస్స్టేషన్ల నుంచి తెచ్చిన ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ఎదుటనే విప్పి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అలాగే సమాధాన పత్రాలను బండిళ్లుగా కట్టే పనిని కూడా సీసీ కెమెరాల ముందే చేయాలి. విధుల్లో ఉండేవారికి ఐడీ తప్పనిసరి.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం, సెకండియర్ పరీక్షలు శనివారం ప్రారంభమవుతాయి. పరీక్ష కేంద్రాల్లోకి మీడియాకు కూడా అనుమతి లేదు. పరీక్షల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డులను కలిగి ఉండాలి. కొన్ని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి జిల్లాలో విద్యార్థులు, పరీక్ష కేంద్రాల సంఖ్యను అనుసరించి తగినన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు పదో తరగతి పరీక్షల సమయంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు తెగబడటం, టీడీపీకి చెందినవారు కావాలనే కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి లీక్ అంటూ ప్రచారాలు సాగించిన నేపథ్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు. -
ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు చెప్పారు. ఆయన సోమవారం ‘సాక్షితో మాట్లాడారు. ఇతర పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకేరోజున రాకుండా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అవసరాలకోసం జిల్లాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు. విద్యార్థుల కోసం సబ్జెక్టుల కంటెంట్ సిద్ధం కోవిడ్ కారణంగా 2021– 22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావ డం, ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుకాకపోవడం వంటి కారణాలతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తక్కిన 70 శాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించినందున ఆ మేరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కు ఉపయోగపడేలా కంటెంట్ రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతా మని శేషగిరిబాబు చెప్పారు. ఈ మెటీరియల్ ఇం టర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకే కాకుండా జాయిం ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వా న్స్, నీట్, ఏపీఈఏపీసెట్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పకడ్బందీగా ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను మార్చిలో పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్న ట్లు శేషగిరిబాబు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు సం బంధించి విద్యార్థులకు జంబ్లింగ్ ఉండదని, ఎగ్జామినర్లను జంబ్లింగ్ విధానంలో నియమించనున్న ట్లు చెప్పారు. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సిలబస్‌పై నిపుణులతో అధ్యయనం మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమలు, వివిధ సంస్థలు, పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇంటర్మీడియట్ బోర్డులోని ఎడ్యుకేషన్ రీసెర్చి ట్రయినింగ్ వింగ్ (ఈఆర్టీడబ్ల్యూ)ను బలోపేతం చేస్తున్నట్లు తెలి పారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సిలబస్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం, సిఫా ర్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రతినిధులు, ఐఐటీల ప్రొఫెసర్లు, ఎన్సీఈఆర్టీ ప్రముఖులు, ఈఆర్టీడబ్ల్యూ ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్న కమిటీ.. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేర్పులకు సిఫార్సులు చేస్తుందని వివరించారు -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (మార్చి 4వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కాపీయింగ్‌కు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. మార్చి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 9,96,023 మంది, వొకేషనల్ విద్యార్థులు 69,133 మంది ఉన్నారు. ‘నో యువర్ సీట్’ సదుపాయం ఫీజులు పూర్తిగా చెల్లించకుంటే హాల్ టికెట్లు ఇవ్వబోమంటూ ప్రైవేట్ కాలేజీలు వేధిస్తున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులే ఇంటర్మీడియెట్ వెబ్సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని, పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసింది. ప్రిన్సిపాళ్ల సంతకంతో పని లేకుండా ఆ హాల్ టికెట్లతో వచ్చే విద్యార్థులందరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకొనేందుకు ‘యాప్’ సదుపాయాన్ని ఇదివరకే ఇంటర్ బోర్డు కల్పించింది. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఆ కేంద్రంలో వారి సీటు ఏ గదిలో ఉందో తెలుసుకొనేందుకు ‘నో యువర్ సీట్’ను ప్రవేశపెట్టింది. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పక్కనే ‘నో యువర్ సీట్’ ఆప్షన్ ఉంటుంది. ఈ సదుపాయం 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో నిఘా ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఇంటర్మీడియెట్ బోర్డు నుంచే ‘లైవ్ స్ట్రీమింగ్’తో పర్యవేక్షిస్తారు. ప్రతి జిల్లాలో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాల బండిళ్ల సీళ్లను సీసీ కెమెరాల ముందు మాత్రమే తెరవాలి. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లకు క్యూఆర్ కోడ్ ఈసారి విద్యార్థులకు హాల్ టికెట్ల కాపీలను ఇంటర్ బోర్డు నుంచి పంపించలేదు. వారు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్‌కు సంబంధిత లింకును పంపించారు. బోర్డు వెబ్‌సైట్‌లోని డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కూడా పుట్టిన తేదీ, రోల్ నంబర్‌ను నమోదు చేసి, హాల్‌టికెట్‌ను పొందవచ్చు. కాలేజీ లాగిన్‌లోనూ పొందవచ్చు. హాల్ టికెట్లకు ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్ జతచేశారు. ఈ కోడ్‌లో విద్యార్థి సమాచారం మొత్తం ఉంటుంది. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. -
సెల్ఫ్ సెంటర్లలో.. కామ్‌గా కానిచ్చేస్తున్నారు...!
* ఇంటర్ పరీక్షల్లో సర్కారీ కళాశాలల్లో యథేచ్ఛగా చూసి రాతలు * ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదార్లు తొక్కుతున్న వైనం * పట్టుబడుతున్న విద్యార్థులు * ప్రైవేటు కళాశాలల్లోను మాల్‌ప్రాక్టీసులు నమోదు * తాజాగా మరో ఇద్దరు డీబార్-8కి చేరిన మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సెల్ఫ్ సెంటర్లలో కామ్‌గా కాపీయింగ్‌లు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగు పేపర్లకు పరీక్షలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో ప్రధాన పేపర్ల పరీక్షలు ముగియనున్నాయి. ఇదంతా ఒకెత్తయితే సెల్ఫ్ సెంటర్లతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా చూసిరాతలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సమీపంలోని పొరుగు కళాశాలల అధ్యాపకులతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారులే బాహాటంగా సమీపకుల వద్ద చెబుతుండటంతో కాపీయింగ్ల తీరుకు అద్ధం పడుతుతోంది. పలు ప్రైవేటు కళాశాలల్లోను ఇదే సీన్ రిపీటవుతోంది. జిల్లాలో ముఖ్యంగా లావేరు, తొగరాం, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, ప్రియాగ్రహారం, కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లుగా కేటాయించారు. ఈ ఆరు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు. అలాగే కింతలి, వంగర, జలుమూరు, పోలాకి, నౌపడ, ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, బూర్జ, సరుబుజ్జిలి, భామిని, మందస, ఏపీఆర్డబ్ల్యూ మందస తదితర కళాశాలలు పొరుగునే ఉన్న మరో కళాశాల విద్యార్థులతో కలిసి పరీక్షలు రాస్తున్నారు. తనిఖీలెక్కడ? తనిఖీలతో పాటు కేంద్రాలపై నిఘా ఉంచేందుకు ఆర్ఐవో పాత్రుని పాపారావు కన్వీనర్‌గా డీఈసీ కమిటీతో పాటు, హైపవర్ కమిటీ, నాలుగు ఫ్లైయింగ్, మరో ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సెల్ఫ్ సెంటర్లతో పాటు పొరుగు కళాశాల విద్యార్థులతో పరీక్షలు జరుగుతున్న సర్కారీ కళాశాలల కేంద్రాలపై అధికారులు ఆది నుంచి చూసీ చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా కేంద్రాల అధికారులు, విద్యార్థుల పాపం పండి ఇప్పటికే ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఒకేరోజు ముగ్గురు పట్టుబడగా.. తాజాగా మరో సెల్ఫ్ సెంటర్లో విద్యార్థి డీబారయ్యూడు. అయితే అధికారులు పైపై తనిఖీలతో సరిపెడుతుండటంతో యథేచ్ఛగా చూసి రాతలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంపై ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని భావించి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రిన్సిపాళ్లు, జేఎల్స్ మెమోలకు దూరంగా ఉండాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఇటువంటి చూసి రాతలకు, అక్రమాలకు తావిస్తున్నారని అభియోగాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా మరో ఇద్దరు డీబార్... ఇదిలా ఉండగా ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు డీబారయ్యారు. దీంతో జిల్లాలో ఇంతవరకు మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం 8కి చేరుకుంది. పొందూరు సిస్టమ్ జూనియర్ కళాశాలలో మరోసారి మాల్ ప్రాక్టీసులు నమోదు కావడం విశేషం. ఆ కేంద్రంలో జువాలజీ పేపర్-2లో ఓ విద్యార్థి అక్కడి చీఫ్ సూపరింటెండెంట్‌కు పట్టుబడగా.. సెల్ఫ్ సెంటర్‌గా ఉన్న ప్రియూగ్రహారం జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ 2బీ పేపర్లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ తనిఖీలకు వెళ్లిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు దొరికపోవడంతో డీబార్ చేశారు. కాగా శుక్రవారం సెట్-3తో కూడిన జువాలజీ-2, హిస్టరీ-2, మ్యాథ్స్ 2బీ పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాయగా.. జనరల్ ఒకేషనల్ కలిపి 22,919 మందికి 761 మంది గైర్హాజరయ్యారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 20 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులు తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లింపునకు ఇదివరకు ఈ నెల 15 వరకు గ డువు ఇవ్వగా ఇప్పుడు దాన్ని 20వ తేదీవరకు పొడిగించారు.