సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పేపర్‌లో తప్పిదం | Error in Senior Inter Chemistry paper | Sakshi
Sakshi News home page

సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పేపర్‌లో తప్పిదం

Published Sun, Mar 16 2025 3:31 AM | Last Updated on Sun, Mar 16 2025 3:31 AM

Error in Senior Inter Chemistry paper

పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత సవరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది. ప్రశ్నాపత్రంలోని సెక్షన్‌–బీలో నాలుగు మార్కులకు ఇచ్చిన 14వ ప్రశ్నలో ‘ఏ సొల్యూషన్‌ ఆఫ్‌ గ్లూకోజ్‌ ఇన్‌ వాటర్‌ ఈజ్‌ లేబుల్డ్‌ యాజ్‌ 100 పర్సంట్‌ (డబ్ల్యూ/వీ)’గా వచ్చింది. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 10.30 గంటలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి అందిన సమాచారంతో ఈ ప్రశ్నలో ఉన్న ‘డబ్ల్యూ/వీ’కి బదులుగా డబ్ల్యూ/డబ్ల్యూగా మార్చుకుని జవాబులు రాయాలని విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సూచించారు. 

ముద్రణ లోపం కారణంగా తప్పిదం జరిగిందని, అందుకే ప్రశ్నను మార్పు చేసుకుని జవాబు రాయాలని పేర్కొన్నారు. అయితే, అప్పటికే గంటన్నర సమయం గడిచిపోవడంతోపాటు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నకు యథావిధిగా చాలామంది విద్యార్థులు జవాబు రాశారు. దానిని మళ్లీ మార్పుచేసి జవాబు రాయాల్సి రావడంతో సమయం సరిపోక ఇబ్బందిపడినట్లు విద్యార్థులు తెలిపారు. 

కాగా, ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ‘డబ్ల్యూ/వీ’ అనే పదం సరైనదేనని, అనవసరంగా దీనిని మార్పుచేసి విద్యార్థులను అయోమయానికి గురిచేశారని కెమిస్ట్రీ సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు తమ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్‌లో డబ్ల్యూ/డబ్ల్యూ అని ఉందని, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రశ్నను సవరించారని ఆరోపిస్తున్నారు.

ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాస్‌కాపీయింగ్‌!
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఇంటర్మీడియెట్‌ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాగలమర్రిలోని శ్రీ వాసవి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు కాలేజీలకు చెందిన విద్యార్థులు గత 15 రోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఇటీవల ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా, శ్రీ వాసవి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వీడియో తీసినట్లు తెలిసింది. 

ఆ వీడియోను తమ కాలేజీ కరస్పాండెంట్‌కు ఆయన పంపినట్లు సమాచారం. దీంతో వాసవి కాలేజీ కరస్పాండెంట్‌ ఆ వీడియోను మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల కాలేజీ కరస్పాండెంట్‌కు పంపించి.. ‘మీ పిల్లలు ఎలా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారో.. చూడండి..’ అని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ వీడియా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు, కరస్పాండెంట్ల వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లోకి చేరినట్లు సమాచారం. 

ఈ వీడియోను ఒక కాలేజీ కరస్పాండెంట్‌ కొద్దిరోజుల కిందట ఆర్‌ఐవోకు పంపినట్లు తెలిసింది. వెంటనే ఆర్‌ఐవో సునీత స్పందించి ముగ్గురు అధికారులను తనిఖీల కోసం పంపించగా, వారికి ముడుపులు ముట్టచెప్పి అసలు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయినా, ఆర్‌ఐవో ఆదేశాల మేరకు గత ఐదారు రోజుల నుంచి ఈ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. 

మాస్‌కాపీయింగ్‌ జరగలేదు: ప్రిన్సిపాల్‌ ఓబులేసు 
తమ కాలేజీ గుర్తింపు రెన్యూవల్‌కు గడువు పూర్తికావడంతో అఫిలియేషన్‌ కొనసాగించేందుకు పరిశీలించడానికి ఆర్‌ఐవో సునీతతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు వచ్చారని శ్రీ వాసవి కాలేజీ ప్రిన్సిపాల్‌ ఓబులేసు తెలిపారు. తమ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎలాంటి మాస్‌కాపీయింగ్‌ జరగలేదని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement