ఈనాడు ఆస్తుల జప్తు | Court issues order for confiscation of assets of Eenadu | Sakshi
Sakshi News home page

ఈనాడు ఆస్తుల జప్తు

Published Sun, Mar 16 2025 3:38 AM | Last Updated on Sun, Mar 16 2025 3:38 AM

Court issues order for confiscation of assets of Eenadu

లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని ఈనాడు 

విజయవాడలో స్థల యజమానికి రూ.5.2 కోట్లను 6 శాతం వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు 

పట్టించుకోని ఈనాడు యాజమాన్యం 

దాంతో ఈనాడు ఆస్తుల జప్తు కోరిన బాధితుడు 

గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం 

ఆ ఆస్తులను ఎవరికీ బదలాయించరాదని, తాకట్టుపెట్టడం, విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం కుదరదని ఆదేశాలు

గతంలో విశాఖ స్థల యజమానికీ ముప్పుతిప్పలు.. 

కొనసాగుతున్న ఈనాడు దౌర్జన్యం.. కోర్టులు ఆదేశించినా లెక్కలేనితనం 

ఎవరైనా లీజుకు ఇస్తే అంతే.. ఇక కబ్జానే.. 

అందరికీ చెప్పేవి సూక్తులు.. చేసేవి కబ్జాలు.. 

విజయవాడ కేసులో ఈనాడు సీఎండీ కిరణ్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు..  

తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా  

సాక్షి, అమరావతి: అందరికీ నిత్యం ఉదయాన్నే నీతులు చెప్పే ఈనాడు (ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌) దౌర్జన్యం కొనసాగుతోంది. తమ పత్రిక ద్వారా జనాలకు నీతులు మాత్రమే చెబుతామని, వాటిని తాము మాత్రం ఆచరించమని ఈనాడు మరోమారు నిరూపించింది. గతంలో విశాఖపట్నం ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో దాని యజమాని ఆదిత్య వర్మను ముప్పుతిప్పలు పెట్టిన ఈనాడు యాజమాన్యం, ఇప్పుడు విజయవాడలో ఉన్న కార్యాలయ స్థలం విషయంలో కూడా దాని యజమాని ముసునూరు అప్పారావును సైతం అలాగే ముప్పుతిప్పలు పెడుతోంది. 

ఈనాడు పత్రిక కోసం తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసినా.. దాన్ని అప్పారావుకు అప్పగించకుండా చుక్కలు చూపిస్తోంది. చివరకు అప్పారావు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అక్కడ కూడా అప్పారావుకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టుకెళ్లి అప్పారావు విజయం సాధించినా.. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో కోర్టు ఈనాడు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. 

స్థల యజమానిని వేధించడానికే ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. బాధితుడు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఈనాడు యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనాడు ఆస్తుల జప్తునకు న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు ఆస్తులను బదలాయించడం, తాకట్టు పెట్టడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం చేయరాదని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. 

ఈ ఆస్తులను ఎవరూ కొనడం, బహుమతిగా తీసుకోవడం చేయరాదంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనాడు సీఎండీ కిరణ్‌ను ఆదేశించింది. 

అసలు కథ ఏమిటంటే.. 
ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పటమటలంకలో ముసునూరి అప్పారావుకు చెందిన 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.725 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పక్కనే అప్పారావు సమీప బంధువైన వల్లూరు వెంకటేశ్వరరావుకు చెందిన ఎకరా 47 సెంట్ల భూమిని కూడా రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 30.04.2008న ముగిసింది. దీంతో మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని స్థల యజమాని అప్పారావును రామోజీరావు కోరారు. రామోజీ సంగతి బాగా తెలిసిన అప్పారావు లీజు పొడిగింపునకు నిరాకరించారు. 

6 నెలల్లో స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వాలని రామోజీరావుకు తేల్చిచెప్పారు. 6 నెలల గడువు 2008 అక్టోబర్‌తో ముగిసింది. అయినా రామోజీరావు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇదే సమయంలో మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా అప్పారావును ఆదేశించాలంటూ విజయవాడ జిల్లా కోర్టులో రామోజీరావు సూట్‌ దాఖలు చేశారు. దానిని సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 2013లో కొట్టేసింది. అప్పారావుకు చెందిన స్థలంపై ఈనాడుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిoది. 

అంతేకాక ఈనాడు ఆ స్థలంలో ఉండటం అక్రమమేనని స్పష్టం చేసింది. దీనిపై ఈనాడు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను సైతం కోర్టు కొట్టేసింది. సీనియర్‌ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. అప్పారావును వేధించడానికి ఈ అప్పీల్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని జిల్లా కోర్టు 2017లో తీర్పునిచ్చింది.  

పరిహారంగా రూ.5.20 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా..
2015లో ముసునూరి అప్పారావు తన స్థలం నుంచి ఈనాడును ఖాళీ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టులో సూట్‌ దా3ఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పారావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాదాపు 60 పేజీల తీర్పు వెలువరించింది. 2012–15 వరకు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. 

మిగిలిన కాలానికి పరిహారం కోసం పిటిషన్‌ దాఖలు చేసుకునే వెసులుబాటును అప్పారావుకు ఇస్తూ 2024 అక్టోబర్‌ 3న తీర్పునిచ్చింది. అయితే.. ఈ తీర్పును ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో తీర్పు అమలుకు అప్పారావు కింది కోర్టులో ఈపీ దాఖలు చేశారు. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని జప్తు చేయాలని అందులో కోరారు. 

దానిపై విచారణ జరిపిన కోర్టు తాము ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించడంలో ఈనాడు విఫలమైందని తేల్చింది. ఇందుకు గాను ఈనాడు ఆస్తుల జప్తునకు ఆదేశిస్తున్నట్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ఎండీ కిరణ్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.  

గతంలో ఆదిత్య వర్మను వేధించిన ఈనాడు 
రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మధారలో మంతెన ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.2,500 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2.7 ఎకరాల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మధారలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్య వర్మకు చెందాలి. 

కానీ.. రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడి పేరిట రిజిస్టర్‌ చేయించారు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఏం చేయలేకపోయారు. దీంతో వర్మ న్యాయపోరాటం చేపట్టారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగగా.. ఆ భూమికి సంబంధించి 2007లో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. లీజును మరో 33 ఏళ్ల పాటు పొడిగించాలని కోరారు. 

రామోజీ దుర్బుద్ధి తెలిసిన వర్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తనది కాని స్థలం విషయంలో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. వర్మ కూడా రామోజీరావును దీటుగా ఎదుర్కొన్నారు. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎక్కడా పప్పులు ఉడకకపోవడంతో రామోజీరావు చివరకు వర్మ స్థలాన్ని ఖాళీ చేశారు. వర్మకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పూర్తిగా చెల్లించకుండా కొంత చెల్లించి రామోజీ రాజీ చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement