
వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే
తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు
ఫైనాన్షియర్స్‌కు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వత్తాసు
సుప్రీంకోర్టు సూచన మేరకే ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్
మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్‌బీఐ తేల్చింది
క్రిమినల్ చర్యలకు హెచ్‌యూఎఫ్ సభ్యులూ బాధ్యులే
కఠిన శిక్ష విధించకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది
‘మార్గదర్శి’ కేసులో వాదనలు వినిపించిన అరుణ్‌కుమార్
అనుబంధ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్‌బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్‌బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.
రామోజీ అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.
ఇష్టారాజ్యంగా వసూళ్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్‌ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు.
ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్‌పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు.
ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు..
‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్‌యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్‌యూఎఫ్‌ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది.

ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్‌యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్‌బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్‌ఎల్‌పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్‌బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.
‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్‌బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్‌బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు.
లూథ్రాను మందలించిన ధర్మాసనం
ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు.
నాకు డబ్బులు చెల్లించలేదు...
అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.
బాధ్యత నుంచి పారిపోలేరు
రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను ఉల్లంఘించారని ఆర్‌బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్‌యూఎఫ్‌లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.
తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా?
తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్‌లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్