బాలికలదే పైచేయి..
సీనియర్ ఇంటర్లో 54 శాతం ఉత్తీర్ణత.. రాష్ర్టంలో 8వ స్థానం
-సర్కార్ కళాశాలల ఫలితాల్లో జిల్లా టాప్
- జిల్లా విద్యార్థినికి సీఈసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్
- మెరుగుపడిన ఉత్తీర్ణత శాతం
ఆదిలాబాద్ టౌన్ : సీనియర్ ఇంటర్మీడియెట్‌లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఉత్తీర్ణత శాతంలో వారిదే హవా కొనసాగింది. గతంతో పోల్చుకుంటే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతంలో కాస్తంతా మెరుగుపడింది. గతానికంటే ఐదు శాతం పెరిగి.. ఈ ఏడాది జిల్లా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరీక్ష ఫలితాల్లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్ధానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల పరంగా రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. ఇదిలా ఉండగా జైనూర్ ప్రభుత్వ కళాశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఉత్తీర్ణత శాతం..
జనరల్ కోర్సుల్లో మొత్తం 22,251 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 12,093 మంది ఉత్తీర్ణత సాదించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 10,694 మంది పరీక్షకు హాజరుకాగా 5,121 మంది పాసయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలికలు 11,557 మంది పరీక్షకు హాజరుకాగా 6,972 ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ కోర్సుల్లో మొత్తం 2,756 మంది పరీక్షకు హాజరు కాగా 1483 మంది ఉత్తీర్ణత సాధించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 1,787 మందికి 894 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 50 శాతం నమోదైంది. బాలికలు 969 మందికి 589 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 61 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో వొకేషనల్ ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఫలితాలను గ్రేడ్, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతం పైగా మార్కులు వచ్చిన వారికి ఏ-గ్రేడ్, 60-75 వరకు బి-గ్రేడ్, 50-60 వరకు సి-గ్రేడ్, 35-50 డి-గ్రేడ్ కేటాయించారు.
ప్రభుత్వ కళాశాలల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్..
ప్రభుత్వ కళాశాలలు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మంచి ఉత్తమ సాధించాయి. ప్రభుత్వ కళాశాలల పరంగా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాలల్లో చదివిన విద్యార్థులు 5,451 మంది పరీక్షకు హాజరుకాగా 4,064 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,701 మందికి గాను 1,925 మంది పాసయ్యారు. 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,750 మంది పరీక్షకు హాజరుకాగా 2,139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 77.78 శాతం నమోదైంది. వొకేషనల్ ఫలితాల్లో మొత్తం 643 మంది పరీక్షకు హాజరుకాగా 546 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 85గా నమోదైంది. బాలురు 490 మంది పరీక్షకు హాజరుకాగా 407 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 83.06 శాతం నమోదైంది. బాలికలు 153 మంది పరీక్షకు హాజరుకాగా 139 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.85 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది
వందశాతం ఉత్తీర్ణత..
ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 93 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 93 మంది ఉత్తీర్ణత సాధించారు. నార్నూర్ జూనియర్ కళాశాలలో 98.73 ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 79 మంది పరీక్ష రాయగా 78 మంది ఉత్తీర్ణులయ్యారు. సారంగాపూర్, జైపూర్ కళాశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10 ప్రభుత్వ కళాశాలల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా సర్కార్ కళాశాలల్లో పలితాలు రావడంపై అయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు.
మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
మే 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐవో ప్రభాకర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు మే 6లోగా చెల్లించాలన్నారు. మే 1 నుంచి మార్కుల మెమోలను అందజేస్తామని తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, జిరాక్స్ కాపీ కోసం రూ.600 డీడీ తీయాలని ఆయన సూచించారు.
సత్తాచాటిన విద్యార్థులు
ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తమ మార్కులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో సీఈసీ గ్రూప్‌లో జిల్లా విద్యార్థిని పులి రాణి 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎంపీసీలో నిర్మల్‌లోని దీక్ష కళాశాలకు చెందిన వినీత్‌కుమార్ 978 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. బైపీసీలో కె.నవత 958, సీఈసీలో ప్రశాంత్ 917 మార్కులు సాధించారు. ఎస్ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థిని సంకీర్తన ఎంపీసీలో 973, వి.రాణి బైపీసీలో 962 మార్కులు సాధించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని క్రీసెంట్ కళాశాలకు చెందిన సబా ఖానమ్ ఎంపీసీలో 966, గుల్నాజ్ 936, తన్వీర్ అహ్మద్ ఖాన్ 923 మార్కులు సాధించారు. బైపీసీలో ముషరఫ్ అర్జుమాండ్ 976, షాహిస్తా నజ్రీన్ 933, సానియా ఫాతిమ 971 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో హరితగౌడ్ 939, కె.అంకిత 938, ృసష్టి 929, బైపీసీలో మల్లికార్జున్ 897, సీఈసీలో ప్రాచి 910 మార్కులు సాధించారు. నలంద కళాశాల విద్యార్థులు ఎంపీసీలో హీన అగర్వాల్ 975, శ్వేత జెన్కర్ 970, జ్యోతి అమ్మాని 965, బైపీసీలో గేడం గోవర్ధన్ 926, సౌమ్య 918, సీఈసీలో సాయిరాం 910, ఎంఈసీలో అహుజ స్నేహ సుభాష్లాల్ 875 మార్కులు సాధించారు. పట్టణంలోని ఆదిత్య కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో సౌమ్య యాదవ్ 948, బైపీసీలో షాహిద్ అన్సారీ 918 మార్కులు సాధించారు.