సెల్ఫ్ సెంటర్లలో.. కామ్‌గా కానిచ్చేస్తున్నారు...!
* ఇంటర్ పరీక్షల్లో సర్కారీ కళాశాలల్లో యథేచ్ఛగా చూసి రాతలు
* ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదార్లు తొక్కుతున్న వైనం
* పట్టుబడుతున్న విద్యార్థులు
* ప్రైవేటు కళాశాలల్లోను మాల్‌ప్రాక్టీసులు నమోదు
* తాజాగా మరో ఇద్దరు డీబార్-8కి చేరిన మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సెల్ఫ్ సెంటర్లలో కామ్‌గా కాపీయింగ్‌లు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగు పేపర్లకు పరీక్షలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో ప్రధాన పేపర్ల పరీక్షలు ముగియనున్నాయి. ఇదంతా ఒకెత్తయితే సెల్ఫ్ సెంటర్లతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా చూసిరాతలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సమీపంలోని పొరుగు కళాశాలల అధ్యాపకులతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారులే బాహాటంగా సమీపకుల వద్ద చెబుతుండటంతో కాపీయింగ్‌ల తీరుకు అద్ధం పడుతుతోంది. పలు ప్రైవేటు కళాశాలల్లోను ఇదే సీన్ రిపీటవుతోంది.
జిల్లాలో ముఖ్యంగా లావేరు, తొగరాం, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, ప్రియాగ్రహారం, కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లుగా కేటాయించారు. ఈ ఆరు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు. అలాగే కింతలి, వంగర, జలుమూరు, పోలాకి, నౌపడ, ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, బూర్జ, సరుబుజ్జిలి, భామిని, మందస, ఏపీఆర్‌డబ్ల్యూ మందస తదితర కళాశాలలు పొరుగునే ఉన్న మరో కళాశాల విద్యార్థులతో కలిసి పరీక్షలు రాస్తున్నారు.
తనిఖీలెక్కడ?
తనిఖీలతో పాటు కేంద్రాలపై నిఘా ఉంచేందుకు ఆర్‌ఐవో పాత్రుని పాపారావు కన్వీనర్‌గా డీఈసీ కమిటీతో పాటు, హైపవర్ కమిటీ, నాలుగు ఫ్లైయింగ్, మరో ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. సెల్ఫ్ సెంటర్లతో పాటు పొరుగు కళాశాల విద్యార్థులతో పరీక్షలు జరుగుతున్న సర్కారీ కళాశాలల కేంద్రాలపై అధికారులు ఆది నుంచి చూసీ చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా కేంద్రాల అధికారులు, విద్యార్థుల పాపం పండి ఇప్పటికే ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఒకేరోజు ముగ్గురు పట్టుబడగా..
తాజాగా మరో సెల్ఫ్ సెంటర్‌లో విద్యార్థి డీబారయ్యూడు. అయితే అధికారులు పైపై తనిఖీలతో సరిపెడుతుండటంతో యథేచ్ఛగా చూసి రాతలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంపై ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని భావించి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రిన్సిపాళ్లు, జేఎల్స్ మెమోలకు దూరంగా ఉండాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఇటువంటి చూసి రాతలకు, అక్రమాలకు తావిస్తున్నారని అభియోగాలు వ్యక్తమౌతున్నాయి.
తాజాగా మరో ఇద్దరు డీబార్...
ఇదిలా ఉండగా ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు డీబారయ్యారు. దీంతో జిల్లాలో ఇంతవరకు మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం 8కి చేరుకుంది. పొందూరు సిస్టమ్ జూనియర్ కళాశాలలో మరోసారి మాల్ ప్రాక్టీసులు నమోదు కావడం విశేషం. ఆ కేంద్రంలో జువాలజీ పేపర్-2లో ఓ విద్యార్థి అక్కడి చీఫ్ సూపరింటెండెంట్‌కు పట్టుబడగా.. సెల్ఫ్ సెంటర్‌గా ఉన్న ప్రియూగ్రహారం జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ 2బీ పేపర్‌లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ తనిఖీలకు వెళ్లిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు దొరికపోవడంతో డీబార్ చేశారు. కాగా శుక్రవారం సెట్-3తో కూడిన జువాలజీ-2, హిస్టరీ-2, మ్యాథ్స్ 2బీ పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాయగా.. జనరల్ ఒకేషనల్ కలిపి 22,919 మందికి 761 మంది గైర్హాజరయ్యారు.