సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నో ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు
సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్ చేయకుండా అన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ‘నో ఫోన్ జోన్లు’గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీసుస్టేషన్ల నుంచి తీసుకొనే సమయంలో ఆయా విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది వారి సెల్‌ఫోన్లను పోలీసుస్టేషన్లలో డిపాజిట్ చేయాలని బోర్డు ఆదేశించింది. అలాగే పరీక్షల విధుల్లో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తమ సెల్‌ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద డిపాజిట్ చేయాలి. పోలీస్‌స్టేషన్ల నుంచి తెచ్చిన ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ఎదుటనే విప్పి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అలాగే సమాధాన పత్రాలను బండిళ్లుగా కట్టే పనిని కూడా సీసీ కెమెరాల ముందే చేయాలి.
విధుల్లో ఉండేవారికి ఐడీ తప్పనిసరి..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం, సెకండియర్ పరీక్షలు శనివారం ప్రారంభమవుతాయి. పరీక్ష కేంద్రాల్లోకి మీడియాకు కూడా అనుమతి లేదు. పరీక్షల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డులను కలిగి ఉండాలి. కొన్ని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి జిల్లాలో విద్యార్థులు, పరీక్ష కేంద్రాల సంఖ్యను అనుసరించి తగినన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పిస్తోంది.
తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు
పదో తరగతి పరీక్షల సమయంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు తెగబడటం, టీడీపీకి చెందినవారు కావాలనే కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి లీక్ అంటూ ప్రచారాలు సాగించిన నేపథ్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment