సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (మార్చి 4వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కాపీయింగ్‌కు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. మార్చి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 9,96,023 మంది, వొకేషనల్ విద్యార్థులు 69,133 మంది ఉన్నారు.
‘నో యువర్ సీట్’ సదుపాయం
ఫీజులు పూర్తిగా చెల్లించకుంటే హాల్ టికెట్లు ఇవ్వబోమంటూ ప్రైవేట్ కాలేజీలు వేధిస్తున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులే ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని, పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసింది. ప్రిన్సిపాళ్ల సంతకంతో పని లేకుండా ఆ హాల్ టికెట్లతో వచ్చే విద్యార్థులందరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకొనేందుకు ‘యాప్’ సదుపాయాన్ని ఇదివరకే ఇంటర్ బోర్డు కల్పించింది. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఆ కేంద్రంలో వారి సీటు ఏ గదిలో ఉందో తెలుసుకొనేందుకు ‘నో యువర్ సీట్’ను ప్రవేశపెట్టింది. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఆప్షన్ పక్కనే ‘నో యువర్ సీట్’ ఆప్షన్ ఉంటుంది. ఈ సదుపాయం 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది.
సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో నిఘా
ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఇంటర్మీడియెట్ బోర్డు నుంచే ‘లైవ్ స్ట్రీమింగ్’తో పర్యవేక్షిస్తారు. ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాల బండిళ్ల సీళ్లను సీసీ కెమెరాల ముందు మాత్రమే తెరవాలి. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
హాల్ టికెట్లకు క్యూఆర్ కోడ్
ఈసారి విద్యార్థులకు హాల్ టికెట్ల కాపీలను ఇంటర్ బోర్డు నుంచి పంపించలేదు. వారు నేరుగా బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్‌కు సంబంధిత లింకును పంపించారు. బోర్డు వెబ్‌సైట్‌లోని డౌన్‌లోడ్ ఆప్షన్ ద్వారా కూడా పుట్టిన తేదీ, రోల్ నంబర్‌ను నమోదు చేసి, హాల్‌టికెట్‌ను పొందవచ్చు. కాలేజీ లాగిన్‌లోనూ పొందవచ్చు. హాల్ టికెట్లకు ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్ జతచేశారు. ఈ కోడ్‌లో విద్యార్థి సమాచారం మొత్తం ఉంటుంది. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment