పట్టు బట్టారు..కొలువు కొట్టారు | TSPSC Group 2 Results Released Many Are Got Jobs From Adilabad | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2కు ఎన్నికైన ఉమ్మడి జిల్లా అభ్యర్థులు

Published Sat, Oct 26 2019 11:31 AM | Last Updated on Sat, Oct 26 2019 11:33 AM

TSPSC Group 2 Results Released Many Are Got Jobs From Adilabad - Sakshi

టీఎస్‌పీఎస్‌సీ గురువారం విడుదల చేసిన గ్రూప్‌ 2 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని వారు నిరూపించారు. ఉన్నత ఉద్యోగాలు పొంది యువతీయువకులకు ఆదర్శంగా నిలిచారు.

వరుసగా ప్రభుత్వ కొలువులు
నిర్మల్‌టౌన్‌: జిల్లా వాసి నీతా గ్రూప్‌ 2 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఈవోపీఆర్‌డీ(ఎంపీవో) పోస్టును కైవసం చేసుకుంది. గతంలోనూ నీతా పలు పోటీ పరీక్షల్లో రాణించింది. తెలంగాణ గురుకుల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో టీజీటీగా ఎంపికైంది. అలాగే తెలంగాణ సంక్షేమ గురుకుల కళాశాలలో జేఎల్, డీఎల్‌ పోస్టుకు సైతం ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం నిర్మల్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. నీతా భర్త రవికుమార్‌రెడ్డి పట్టణంలో కంటి వైద్య సహాయక నిపుణులుగా పనిచేస్తున్నారు. తన భర్త రవికుమార్‌రెడ్డి ప్రోత్సాహం వల్ల తాను గ్రూప్‌–2 సాధించినట్లు నీతా తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి నుంచి గ్రూప్‌ 2కు ఎంపిక
లక్ష్మణచాంద(నిర్మల్‌): మండలంలోని తిర్పెల్లి గ్రామ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శోభన గ్రూప్‌ 2కు ఎంపికైంది. గ్రూప్‌ 2 ఫలితాల్లో తమ గ్రామ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి శోభన గ్రూప్‌ 2కు ఎంపికకావడం ఆనందంగా ఉందని సర్పంచ్‌ క్రిష్ణారెడ్డి, గ్రామస్తులు తెలిపారు. భర్త రాము, తండ్రి సత్తయ్యల ప్రోత్సాహంతోనే బాగా చదివి గ్రూప్‌ 2కు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. భర్త రాము ప్రస్తుతం నిర్మల్‌లో పీసీగా పనిచేస్తుండగా, తండ్రి సత్తయ్య హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రైతుబిడ్డ డీటీగా.. 
జన్నారం(ఖానాపూర్‌): ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు లాకవత్‌ తిరుపతి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పోలీస్‌కానిస్టేబుల్, వీఆర్వో, బీట్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం గ్రూపు 2లో డీటీగా ఎంపికయ్యాడు. చింతగూడ గ్రామానికి చెందిన లాకవత్‌ గంగన్న, సుగుణలకు పెద్ద కుమారుడు లాకవత్‌ తిరుపతి బీటెక్‌ చదివాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాడు. తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కాలనే పట్టుదలతో చదివి ఉద్యోగం పొందినట్లు తిరుపతి తెలిపాడు. గ్రూపు 1 అధికారి కావడమే తన లక్ష్యమన్నాడు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
మంచిర్యాలఅర్బన్‌: గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తునే గ్రూప్‌–2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యానని దీని వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు కిరణ్‌. మంచిర్యాలకు చెందిన శంకరయ్య, లక్ష్మీల దంపతుల కుమారుడైన కిరణ్‌ చిన్న నాటి నుంచే చదువులో చురుకైనవాడు. బీటెక్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంలో గ్రూపు–2 పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇదే సమయంలో గ్రామకార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. ఆదిలాబాద్‌ జిల్లాలోని గాదిగూడ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. డీటీగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపాడు. 

పోలీస్‌శాఖ నుంచి రెవెన్యూ అధికారులుగా
కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రణాళికతో చదివితే ప్రభుత్వ కొలువు సులువేనని నిరూపించారు పట్టణ ఎస్సై శ్రీలేఖ, కానిస్టేబుల్‌ సందీప్‌లు. గ్రూప్‌–2 లక్ష్యంగా నిరంతర సాధన చేసిన వీరికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం వరించింది. కాగజ్‌నగర్‌ షీ టీం ఎస్సైగా సేవలు అందిస్తున్న ఖానాపూర్‌ పట్టణాకి చెందిన ఎస్సై శ్రీలేఖ 2017 బ్యాచ్‌లో పోలీస్‌ శాఖలో ఎస్సైగా ఎంపికైయ్యారు. గ్రూప్‌–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్‌ గా ఎంపికైయ్యారు. మంచిర్యాల జిల్లా కాలేజి రోడ్డుకు చెందిన దూత సందీప్‌ సీఐ గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. గ్రూప్‌2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వరించింది. ఉద్యోగాలకు ఎంపికైన శ్రీలేఖ, సందీప్‌లను సీఐ అభినందించారు. 

కష్టపడి చదివాం
భీమిని: భీమిని మండలంలోని వీగాం, ఖర్జీంభీంపూర్‌ గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు విజయ్‌కుమార్, రాంప్రసాద్‌లు గ్రూప్‌–2కు ఎంపికయ్యారు. విజయ్‌కుమార్‌ ఎక్సైజ్‌ ఎస్సైగా ఎంపిక కాగా, రాంప్రసాద్‌ వాణిజ్యశాఖ పన్నుల అధికారిగా ఎంపికయ్యారు. ఇటు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌–2కు కష్టపడి చదివి ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు. గ్రూప్‌–2కు ఎంపిక కావడంపై భీమిని మండలంలోని పలువురు నాయకులు, అధికారులు వీరిని అభినందించారు.

కార్యదర్శి నుంచి డీటీగా..
బజార్‌హత్నూర్‌(బోథ్‌): మండలంలోని దిగ్నూర్‌ గ్రామపంచాయతీలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఓరుగంటి భావన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైంది. ఇచ్చోడ గ్రామానికి చెందిన ఓరుగంటి చిన్నయ్య, భారతి దంపతుల కూతురు ఓరుగంటి భావన పాఠశాల విద్య ఇచ్చోడలోని ప్రగతి పాఠశాలలో, ఇంటర్‌ విశ్వోదయ కళాశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్‌ కళాశాలలో పూర్తిచేసి ఆర్‌సీరెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. డీటీగా ఉద్యోగం సాధించడంతో ఎంపీడీవో దుర్గం శంకర్, ఈవోపీఆర్‌డీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు అభినందించారు.

కష్టపడి.. విజయం సాధించి..
నిర్మల్‌అర్బన్‌:  నిర్మల్‌ పట్టణానికి చెందిన బుక్క బద్రి కీర్తన ప్రభుత్వ ఉద్యోగం కష్టపడి చదివి చివరకు అనుకున్నది సాధించింది. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు జగిత్యాలలో చదువుకుంది. అనంతరం ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఏ ఇంగ్లిష్, బీఈడీ పూర్తి చేసింది. గురువారం ప్రకటించిన గ్రూప్‌ –2 ఫలితాలలో  ఏసీటీవోగా ఎంపికైంది. తల్లిదండ్రులు సత్యనారాయణ – మనోహర, భర్త నవీన్‌కుమార్‌ల ప్రోత్సాహంతో ఏసీటీవోగా ఎంపికయ్యానన్నారు. తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. 

ప్రభుత్వ ఉద్యోగాలకు కేరాఫ్‌
బాసర: మండలంలోని లాబ్ది గ్రామానికి చెందిన డోంగ్రె సాయిప్రసాద్‌ గ్రూప్‌ 2 ఫలితాల్లో విజయం సాధించి ఈవోపీఆర్డీగా ఉద్యోగం రావడంతో గ్రామస్తులు ఆయనను సన్మానించారు. సాయిప్రసాద్‌ డొంగ్రె మారుతి, సావిత్ర బాయిల దంపతుల కుమారుడు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఉస్మానియాలో ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈవోపీఆర్డీ ఉద్యోగం చేస్తూ గ్రామాభివృద్ధికి సహకారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. 

మున్సిపల్‌ కమిషనర్‌గా
చెన్నూర్‌రూరల్‌: మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన గద్దె రాజు గ్రూపు–2 ఫలితాల్లో మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికయ్యారు. 2018లో ఎఫ్‌ఆర్వోగా ఎంపికైన రాజు ప్రస్తుతం కర్ణాటకలోని దార్‌వడ్‌ ఫారెస్ట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 2013లో బీటెక్‌ పూర్తి చేసిన రాజు రెండేళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ 

ఇంజనీర్‌గా పని చేశారు. 2017లో రైల్వేలో జూనియర్‌ 
ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించి ఏడాది పాటు విధులు నిర్వర్తించాడు. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న తరుణంలోనే గ్రూప్‌–2 పరీక్ష రాసి మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగాన్ని సంపాదించాడు.  

కార్యదర్శి నుంచి ఎంపీవోగా..
నేరడిగొండ(బోథ్‌): రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో బోథ్‌ మండలం పొచ్చర గ్రామానికి చెందిన మోర మహేందర్‌రెడ్డి ఎంపీవోగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన బుద్ధికొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్‌–2కు ఎంపిక కావడంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు నేరడిగొండ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.

నిరంతర శ్రమ ఫలించింది
ఆదిలాబాద్‌టౌన్‌: మావల మండలంలోని వాగాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్టీ సంతోష్‌రెడ్డి గ్రూప్‌–2లో డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టుకు ఎంపికయ్యారు. వాగాపూర్‌కు చెందిన ఎల్టీ సుదర్శన్‌రెడ్డి–విజయమ్మ దంపతుల కుమారుడైన సంతోష్‌ ఉద్యోగం సాధించడంపై పలువురు అభినందించారు. కాగా సంతోష్‌ 1 నుంచి 10వ తరగతి వరకు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ శిశుమందిర్‌ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఇంటర్, డిగ్రీ ఆదిలాబాద్‌లో పూర్తి చేశారు. అనంతరం నిరంతరం శ్రమించి ఉద్యోగం పొందినట్లు ఆయన తెలిపారు. 

స్నేహితుడి ప్రోత్సాహంతో
బెల్లంపల్లిరూరల్‌: మంచికైనా, చెడుకైనా ఓ మంచి స్నేహితుడు తోడుంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని ఆ యువకుడు నిరూపించాడు. బెల్లంపల్లి మండలం బుధాకుర్థు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన వీర్ల వినోద్‌కుమార్‌ ఇటీవల విడుదలైన గ్రూపు –2 ఫలితాల్లో ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై కొలువు సాధించాడు. గ్రామానికి చెందిన వీర్ల రామయ్య, వజ్రమ్మల కుమారుడు వినోద్‌ కుమార్‌ ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం గురువారం విడుదల అయినా గ్రూప్‌ 2 ఫలితాల్లో కొలువు సాధించాడు. ఉద్యోగాలు సాధించడానికి తన తల్లిదండ్రుల కష్టంతో పాటు యూఎస్‌ఏలో స్థిరపడిన తన మిత్రుడు భుక్య సుమంత్‌ కృషి ఎంతో ఉందని వినోద్‌ కుమార్‌ తెలిపాడు. అమూల్య సలహాలను అందించిన సుమంత్‌ పాత్ర ఎంతో ఉందన్నాడు.

కొలువు కొట్టిన ఉపాధ్యాయుడు
దండేపల్లి(మంచిర్యాల): మండలంలోని కొర్విచెల్మకు చెందిన దండవేణి మల్లేశ్‌ గ్రూప్‌–2 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మల్లేశ్‌ ప్రస్తుతం నెన్నల మండలం కోనంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపనతో గ్రూప్‌–2కు ప్రిపేర్‌ అయి పరీక్ష రాశాడు. కొలువు పొందిన ఆయనను పలువురు అభినందించారు.               

కొలువు సాధించిన సుంక్లి యువకుడు
భైంసారూరల్‌: మండలంలోని సుంక్లి గ్రామానికి చెందిన మాలేగాం విష్ణువర్ధన్‌ గ్రూప్‌–2లో కొలువు సాధించి అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిగా ఎంపికయ్యాడు. రైతు కుటుంబానికి చెందిన విష్ణువర్ధన్‌ సుంక్లి గ్రామానికి చెందిన మాలేగాం రుక్మవ్వ – భూమన్న అనే దంపతులకు మూడవ సంతానమైన విష్ణువర్ధన్‌ పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాడు. గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ ఉద్యోగాలకు సిద్ధమయ్యాడు. కొలువు రావడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ఎస్‌బీఐ మేనేజర్‌ నుంచి ఎక్సైజ్‌ ఎస్సైగా..
కుంటాల: మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన గోవర్దన్‌ గ్రూప్‌ 2లో విజయం సాధించి ఎక్సైజ్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సారంగపూర్‌ మండల కేంద్రంలో ఎస్‌బీఐ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎంబీఏ చేస్తుండగా బ్యాంకులో ఉద్యోగం సాధించారు. అనంతరం గ్రూప్‌ 2 కోసం నిరంతరం కృషి చేసి ఎక్సైజ్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. గోవర్దన్‌ది రైతు కుటుంబం. తల్లి లక్ష్మీ బీడీ కార్మికులు కాగా, తండ్రి భూమన్న రైతు.  

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి ఎక్సైజ్‌ ఎస్సైగా..
ఆదిలాబాద్‌టౌన్‌: తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన బోండ్ల మల్లయ్య సుజాత దంపతుల కూమార్తె మానస ఇటీవల విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది. కాగా ఆమె ప్రస్తుతం ఆదిలాబాద్‌ పట్టణంలోని మహిళ కోర్టులో ఫీల్డ్‌ అíసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తునే గ్రూప్‌ –2 పరీక్షలు రాసి ఎంపికైంది. ఉద్యోగం రావడంపై కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement