గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల | APPSC Release Group 2 Prelims Results | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

Published Fri, Jul 26 2019 5:04 AM | Last Updated on Fri, Jul 26 2019 5:05 AM

APPSC Release Group 2 Prelims Results  - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్షల (స్క్రీనింగ్‌ టెస్టు) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గ్రూప్‌ 2 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. మొత్తం 446 పోస్టుల భర్తీకి 150 మార్కులకు ఈ ప్రిలిమ్స్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. జనరల్‌ కటాఫ్‌ (ఓసీ) కింద 81.20 మార్కులను పరిగణనలోకి తీసుకొని అర్హులైన 6,195 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వీరికి మెయిన్స్‌ పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. జనరల్‌ కటాఫ్‌లో 5,540 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. గత ప్రభుత్వం ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న నిర్ణయాధికారాన్ని ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ జీవో 5ను జారీ చేసిన నేపథ్యంలో 1:13.89 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నిష్పత్తిలో ఆయా కేటగిరీల వారీగా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఎంపిౖకైన విభాగాల్లో వారికి కటాఫ్‌ తగ్గించి మిగతా వారిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. 

ఇలా ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్‌ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. మెయిన్స్‌లో వారు అత్యధిక మార్కులతో మెరిట్‌లో నిలిచినా వారికి ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు అర్హులు కారు. బీసీ–సీ కేటగిరీలో అభ్యర్థులు తక్కువ కావడంతో కటాఫ్‌ను 66.67 మార్కులకు తగ్గించి అదనంగా 83 మందిని ఎంపిక చేసింది. అలాగే బీసీ–ఈ కేటగిరీలో కటాఫ్‌ను 77.31కి తగ్గించి 77 మందిని, ఎస్సీ కేటగిరీలో కటాఫ్‌ను 78.37కు తగ్గించి 215 మందిని, ఎస్టీ కేటగిరీలో కటాఫ్‌ను 69.15కు కుదించి 195 మందిని, అంధుల కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 60.99గా చేసి 38 మందిని, బధిరుల కేటగిరీలో కటాఫ్‌ను 60.99గా నిర్ణయించి 23 మందిని, ఆర్థో కేటగిరీలో 76.60 మార్కులను కటాఫ్‌గా పరిగణించి 24 మందిని ఎంపిక చేశారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ కేటగిరీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులుండటంతో అక్కడ ఎలాంటి సడలింపు లేకుండానే అభ్యర్థులు ఎంపికయ్యారు.  

726 మందితో తిరస్కరణ జాబితా  
గ్రూప్‌2 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసిన వారిలో వివిధ పొరపాట్లు చేసిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించకుండా తిరస్కరణ జాబితాలో చేర్చింది. ట్యాంపరింగ్, బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్లు సరిగా గుర్తించకపోవడం, ఎక్కువ బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్లను గుర్తించడం, వైట్నర్‌ను వినియోగించడం తదితర కారణాలతో 726 మంది తిరస్కరణకు గురయ్యారు. వారి జాబితాను కూడా వెబ్‌సైట్లో పొందుపరచింది. 

1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలి : నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌ 
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్‌ పరీక్షల నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నిరుద్యోగ జేఏసీ విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ధ్వజమెత్తింది. జీవో 5ను రద్దు చేసి పాత విధానంలో ఎంపికలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ‘గ్రూప్‌2 రివైజ్డ్‌ కీలో 9 ప్రశ్నలను తొలగించారు. వీటిలో ఒక ప్రశ్నకు మాత్రమే వివరణ ఇచ్చారు. 8 ప్రశ్నలను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వలేదు. 7 ప్రశ్నలకు సమాధానాలను మార్పు చేశారు. దీనివల్ల చాలా మంది నష్టపోయారు. లక్షల మంది రాసే పరీక్షల్లో ప్రశ్నపత్రంలో తప్పులు లేకుండా చూడవలసిన బాధ్యత ఏపీపీఎస్సీ మీద ఉంది. కానీ ప్రతి పరీక్షలోనూ ఏపీపీఎస్సీ తప్పుల తడకల ప్రశ్నపత్రాలు ఇస్తోంది. తెలుగు అనువాద ప్రశ్నలు మరింత అన్యాయంగా ఉండడంతో వేలాది మంది నష్టపోయారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం’ అని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement