
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందంటూ కొందరు అభ్యర్థులు వేసిన కేసులో విధించిన స్టేను ఎత్తేస్తూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ అభ్యర్థుల మార్కుల జాబితాను విడుదల చేసింది. వీటిని ‘పీఎస్‌సీ. ఏపీ.జీఓ వీ.ఐఎన్’లో పొందు పరిచినట్లు కమిషన్ చైర్మన్ పి.ఉదయ భాస్కర్, కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు.
మరో 20 రోజుల్లో అభ్యర్థుల మార్కులు, వారిచ్చిన పోస్టుల ఆప్షన్ల ప్రకారం జోన్ల వారీగా, రిజర్వేషన్ల వారీగా అలాట్‌మెంట్ జాబితాను రూపొందిస్తుందని చైర్మన్ చెప్పారు. కాగా మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విశాఖపట్నంలోని గీతం వర్సిటీ, చీరాలలోని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో గీతంలో పరీక్ష రాసిన 159 మంది, చీరాలలో పరీక్ష రాసిన 58 మంది ఫలితాలను కమిషన్ విత్‌హెల్డ్‌లో పెట్టింది. వీరికి నోటీసులు ఇచ్చి విచారించామని, వివరణ తీసుకున్నామని ఉదయభాస్కర్ తెలిపారు. వారి ఇచ్చిన వివరణలను, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి రూపొందించిన నివేదికలోని అంశాలను నిపుణుల కమిటీ ద్వారా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పు చేసినట్లు తేలినవారిని అనర్హులుగా ప్రకటిస్తామని, మిగిలినవారి మార్కుల జాబితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment