APAT
-
గ్రూప్ – 2 మెయిన్స్ మార్కుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందంటూ కొందరు అభ్యర్థులు వేసిన కేసులో విధించిన స్టేను ఎత్తేస్తూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ అభ్యర్థుల మార్కుల జాబితాను విడుదల చేసింది. వీటిని ‘పీఎస్సీ. ఏపీ.జీఓ వీ.ఐఎన్’లో పొందు పరిచినట్లు కమిషన్ చైర్మన్ పి.ఉదయ భాస్కర్, కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. మరో 20 రోజుల్లో అభ్యర్థుల మార్కులు, వారిచ్చిన పోస్టుల ఆప్షన్ల ప్రకారం జోన్ల వారీగా, రిజర్వేషన్ల వారీగా అలాట్మెంట్ జాబితాను రూపొందిస్తుందని చైర్మన్ చెప్పారు. కాగా మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విశాఖపట్నంలోని గీతం వర్సిటీ, చీరాలలోని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో గీతంలో పరీక్ష రాసిన 159 మంది, చీరాలలో పరీక్ష రాసిన 58 మంది ఫలితాలను కమిషన్ విత్‌హెల్డ్‌లో పెట్టింది. వీరికి నోటీసులు ఇచ్చి విచారించామని, వివరణ తీసుకున్నామని ఉదయభాస్కర్ తెలిపారు. వారి ఇచ్చిన వివరణలను, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి రూపొందించిన నివేదికలోని అంశాలను నిపుణుల కమిటీ ద్వారా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పు చేసినట్లు తేలినవారిని అనర్హులుగా ప్రకటిస్తామని, మిగిలినవారి మార్కుల జాబితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
ఏపీఏటీ మాజీ సభ్యుడు మదన్‌మోహన్‌రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) విశ్రాంత సభ్యుడు, న్యాయశాఖ మాజీ కార్యదర్శి టి.మదన్‌మోహన్‌రెడ్డి(68) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం 9గంటలకు విస్పర్ వ్యాలీలోని మహాప్రస్థానంలో అంత్యక్రియ లు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు హైకోర్టు న్యాయవాది టి.ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి తెలిపారు. మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదు లు సందర్శించి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. -
అప్పటి ఉత్తర్వులు అమలు చేస్తాం
ఏపీఏటీపై హైకోర్టుకు తెలంగాణ ఏజీ హామీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ తమ రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తెలంగాణ జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను రోస్టర్ ప్రకారం సింగిల్ జడ్జి విచారిస్తారంది. ఒకవేళ వివాదం రెండు రాష్ట్రాలకు సంబంధించినది అయితే దానిని కూడా హైకోర్టులో సవాలు చేయవచ్చునని, ఆ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య, ఎన్.నాగరాజు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... కేంద్రం నోటిఫికేషన్ నేపథ్యంలో ఏపీఏటీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ‘ఆర్డినెన్స్’ జారీ చేశామని తెలిపారు. పరిశీలన నిమిత్తం ఆర్డినెన్స్ కాపీని ధర్మాసనం ముందుంచారు. ట్రిబ్యునల్‌లోని కేసులను హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలా అధికారం ఉందని ఏ చట్టంలో ఉందో చూపాలని కోరింది. మధ్యప్రదేశ్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుందని, దానిని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని రామకృష్ణారెడ్డి చెప్పారు. న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహకారం అందుతూనే ఉంటుందని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించేంత వరకు కేంద్ర నోటిఫికేషన్ అమలును నిలిపేయవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. నోటిఫికేషన్‌తో స్తబ్దత... ఈ సమయంలో కిరణ్‌కుమార్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనర్సింహ... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్ర నోటిఫికేషన్ వల్ల తెలంగాణ కేసుల విచారణ విషయంలో స్తబ్దత ఏర్పడిందన్నారు. ఏపీఏటీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదన్నారు. దీనిపై ధర్మాసనం ఏజీ వివరణ కోరింది. నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కక్షిదారుల సౌలభ్యం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పి.వి.కృష్ణయ్య, నాగరాజుల వ్యాజ్యాల్లో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
కేసులు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్
* ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకు మార్పు * హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ జారీ చేయకపోతే.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తూ.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణ కేసులను హైకోర్టుకు బదిలీ చేసేందుకు ఆర్డినెన్స్ తెస్తామని విన్నవించారు. దీంతో ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా శాసనసభ సమావేశాలను దసరా తర్వాత నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. -
మా నిర్ణయం తేలకుండానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పిస్తూ జారీ అయిన నోటిఫికేషన్ వ్యవహారంలో కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పించే విషయంలో పరిపాలన పరంగా హైకోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా ఏపీఏటీ పరిధి నుంచి తప్పించాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్నీ నిలదీసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏపీఏటీలో అపరిష్కృతంగా ఉన్న దాదాపు 8,670 కేసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.ఈ కేసుల గురించి స్పష్టత తీసుకోకుండానే లేఖ రాసిందే తడవుగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా ఓ ట్రిబ్యునల్ పరిధి నుంచి మరో రాష్ట్రాన్ని తప్పించినప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేసులను హైకోర్టుకు బదలాయించే విషయంలో అనుసరించిన విధానంపై తగిన అధ్యయనం చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని అటు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఇటు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.నారాయణరెడ్డిలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. -
టీ సర్కారుకు ఏపీఏటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: యూజీసీ నిబంధనల మేరకు వేతనాలు ఇవ్వడం లేదంటూ తెలంగాణ వైద్య విద్య విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాబూరావు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ సభ్యుడు రత్నకిషోర్... కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీచేశారు. -
‘ఏపీఏటీ’పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) న్యాయ పరిధిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. అనంతరం తీర్పునువాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల వివాదాలను విచారించే న్యాయ పరిధి ఏపీఏటీకి లేదంటూ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.లక్ష్మయ్య, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఏపీఏటీని యథాతథం గా కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. -
మళ్లీ మెరిట్ జాబితా!
డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీలో ఏపీపీఎస్సీకి ఏపీఏటీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 50 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి రూపొందించిన మెరిట్ లిస్టును రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) తప్పుబట్టింది. వివాదాస్పదంగా మారిన నాలుగు ప్రశ్నలను... ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం సరిదిద్ది తాజాగా మెరిట్ లిస్టును రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీఏటీ సభ్యులు వీపీ జౌహారీ మంగళవారం తీర్పునిచ్చారు. నాలుగు ప్రశ్నలకు ఉన్న ఎనిమిది మార్కులను పక్కనబెట్టి ఏపీపీఎస్సీ మెరిట్ జాబితా రూపొందించడంతో అర్హులకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ వారి వాదనతో ఏకీభవిస్తూ ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరిన నేపథ్యంలో ఏపీఏటీ తీర్పు రావడంతో ఈ నియామకాలు వివాదం కానున్నాయి. -
డీఎస్సీ నియామకాలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన డీఎస్సీ-2012 నియామకాల కోసం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. నియామకాల కోసం రెండోసారి తయారు చేసిన జాబితా.. తమ మార్గదర్శకాల ప్రకారం ఉందో లేదో పరిశీలించి, వాటి ప్రకారమే తుది జాబితా విడుదల చేయాలని విద్యా శాఖకు తేల్చి చెప్పింది. ‘నియామక ఉత్తర్వులు కూడా మా మార్గదర్శకాలకు లోబడే ఉం డాలి. వాటికి విరుద్ధంగా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని చట్టవిరుద్ధమైనవిగా భావించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. డీఎస్సీ-2012 పరీక్షా ఫలితాల్లో మొదట తాము ఎంపికైనట్లు ప్రకటించి తర్వాత మరో జాబితా విడుదల చేశారని, అందులో తమ పేర్లు తొలగించాలని ఆరోపిస్తూ సయ్యద్ మహమూద్ అనే అభ్యర్థితోపాటు మరికొంత మంది అభ్యర్థులు దాఖలు చేసిన 262 పిటిషన్లను ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.యతిరాజులు, సభ్యులు ఎంవీపీ శాస్త్రిల నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల వాదనలు వినింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎం.రాంగోపాల్‌రావు, సీహెచ్ జగన్నాథరావు, పి.వీరభద్రారెడ్డిలు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం డీఎస్సీ-2012 నియామకాల కోసం 26 మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్ల కోసం ఖాళీగా ఉంచాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను కొట్టేస్తున్నామని చెబుతూ, తమ మార్గదర్శకాల ప్రకారం పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది. ఏపీఏటీ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి.. - {పకటించిన ఖాళీల్లో 20 శాతం పోస్టులను స్థానికులు, స్థానికేతరులతో, 80 శాతం పోస్టులను స్థానికులతో రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి. - ఓపెన్ కేటగిరీ పోస్టులను ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలి. రిజర్వేషన్ కేటగిరీలోని అభ్యర్థి మెరిట్ జాబితాలో ఎంపికైతే రిజర్వేషన్ కోటాలో ఆ సంఖ్యను తగ్గించ కూడదు. - స్థానిక అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి. గతంలో మిగిలిన పోస్టులను రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాలి. - ఉద్యోగుల సర్వీసు నిబంధన 22(2)(ఇ) ప్రకారమే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, మాజీ సైనికుల కేటగిరీ నియామకాలు చేపట్టాలి. - ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలకు అనుగుణంగా స్థానిక ఎస్టీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలి. ఏజెన్సీయేతర ప్రాంతాల్లోనూ అర్హులైన ఎస్టీలు ఉంటే నియమించవచ్చు. - నోటిఫికేషన్లో ప్రకటించిన ఖాళీలకన్నా ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయరాదు. వెయిటింగ్ లిస్టు ఉండకూడదు. - అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే అందులో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ఎక్కువ ర్యాంక్ కేటాయించాలి. ఇందులో ఒకే వయసున్న మహిళలు ఉంటే వారికే ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి. - విద్యాశాఖ కమిషనర్ జిల్లా, కేటగిరీ వారీగా మెరిట్ లిస్టును రూపొందించి డీఎస్సీలకు పంపాలి. - ఒకే వయసున్న అభ్యర్థులు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేయాలి. - ఎంపికైన అభ్యర్థి ఉద్యోగంలో చేరకపోతే ఏర్పడే ఖాళీని తదుపరి నియామకాల్లో భర్తీ చేయాలి. మాజీ సైనికుల కోటా పోస్టులకు అర్హులెవరూ లేకపోతే వాటిని ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయవచ్చు.