డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీలో ఏపీపీఎస్సీకి ఏపీఏటీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 50 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి రూపొందించిన మెరిట్ లిస్టును రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) తప్పుబట్టింది. వివాదాస్పదంగా మారిన నాలుగు ప్రశ్నలను... ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం సరిదిద్ది తాజాగా మెరిట్ లిస్టును రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీఏటీ సభ్యులు వీపీ జౌహారీ మంగళవారం తీర్పునిచ్చారు. నాలుగు ప్రశ్నలకు ఉన్న ఎనిమిది మార్కులను పక్కనబెట్టి ఏపీపీఎస్సీ మెరిట్ జాబితా రూపొందించడంతో అర్హులకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ వారి వాదనతో ఏకీభవిస్తూ ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరిన నేపథ్యంలో ఏపీఏటీ తీర్పు రావడంతో ఈ నియామకాలు వివాదం కానున్నాయి.