తప్పుడు కీలు.. అడ్డగోలు నియామకాలు
ఏపీపీఎస్సీ వ్యవహారంపై మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి... అర్హులకు తీవ్ర అన్యాయం చేశారని ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఆరోపించారు. వివిధ నోటిఫికేషన్లలో దాదాపు 8 వేల పోస్టుల భర్తీకి సంబంధించి నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు ‘కీ’లు ఇచ్చారని విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తప్పిదాలను ప్రశ్నించినందుకే తనపై ఏసీబీ దాడి జరిగిందని ఆరోపించారు. కమిషన్‌లో ఉన్నప్పుడే వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా తమను బెదిరించారని చెప్పారు. ‘‘గ్రూప్-1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. తప్పులు, అనువాద దోషాలపై వెరిఫై చేయించాలన్నా వినిపించుకోలేదు. గ్రూప్-1లో డబుల్ వాల్యుయేషన్‌కు ఒప్పుకున్నా.. సింగిల్ వాల్యుయేషన్ మాత్రమే చేశారు. మెరిట్‌కు అన్యాయం చేశారు. సర్వీసు కమిషన్‌లో రీవాల్యుయేషన్ అనేదే లేదు.
కానీ, కోర్టు ఆఫీసర్స్ నోటిఫికేషన్‌లో జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేసి పోస్టులకు ఎంపిక చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులకు మెడికల్ ఫిట్‌నెస్ లేని 63 మందిని ఎంపిక చేశారు. డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ లెక్చరర్ల పోస్టుల పరీక్షలకు సంబంధించి కూడా అన్నీ తప్పుడు ‘కీ’లు ఇచ్చారు. ఆ తప్పుడు ‘కీ’లతోనే నియామకాలు చేపట్టారు’’ అని రిపుంజయరెడ్డి పేర్కొన్నారు.