ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి పెంపు గడువును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం జీఓ నెంబర్ 381ను జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొన్నేళ్లుగా జరగకపోవడంతో చదువులు పూర్తిచేసిన లక్షలాది మంది అభ్యర్ధులకు వయోపరిమితి దాటిపోవడంతో వారంతా వయోపరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని అర్థించడంతో వయోపరిమితిని 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచారు. ఈమేరకు 2014 సెప్టెంబర్ 23న ప్రభుత్వం జీఓ 295ను విడుదల చేసింది. ఆ వయోపరిమితి పెంపు జీఓ గడువు 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది.
ఏపీపీఎస్సీ ద్వారా 4009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించినా కేవలం ఏఈఈ తదితర 1004 పోస్టుల భర్తీకి వీలుగా మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇంకా వేలాది పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉన్నాయి. వయోపరిమితి గడువు ముగిసిసోవడంతో కొత్త నోటిఫికేషన్లు వెలువడితే లక్షలాది మంది నిరుద్యోగ యువ తకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. ఈ తరుణంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలను పెండింగ్‌లో పెట్టి వయోపరిమితి పెంపు జీఓ పొడిగింపు కోసం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈమేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వయోపరిమితి పెంపును మరో ఏడాదిపాటు అమలయ్యేలా పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం వయోపరిమితి పెంపు (34 ఏళ్లనుంచి 40 ఏళ్లు) 2017 సెప్టెంబర్ 30వరకు అమల్లో ఉంటుంది.