సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన డీఎస్సీ-2012 నియామకాల కోసం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. నియామకాల కోసం రెండోసారి తయారు చేసిన జాబితా.. తమ మార్గదర్శకాల ప్రకారం ఉందో లేదో పరిశీలించి, వాటి ప్రకారమే తుది జాబితా విడుదల చేయాలని విద్యా శాఖకు తేల్చి చెప్పింది. ‘నియామక ఉత్తర్వులు కూడా మా మార్గదర్శకాలకు లోబడే ఉం డాలి. వాటికి విరుద్ధంగా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని చట్టవిరుద్ధమైనవిగా భావించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. డీఎస్సీ-2012 పరీక్షా ఫలితాల్లో మొదట తాము ఎంపికైనట్లు ప్రకటించి తర్వాత మరో జాబితా విడుదల చేశారని, అందులో తమ పేర్లు తొలగించాలని ఆరోపిస్తూ సయ్యద్ మహమూద్ అనే అభ్యర్థితోపాటు మరికొంత మంది అభ్యర్థులు దాఖలు చేసిన 262 పిటిషన్లను ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది.
ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.యతిరాజులు, సభ్యులు ఎంవీపీ శాస్త్రిల నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల వాదనలు వినింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎం.రాంగోపాల్‌రావు, సీహెచ్ జగన్నాథరావు, పి.వీరభద్రారెడ్డిలు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం డీఎస్సీ-2012 నియామకాల కోసం 26 మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్ల కోసం ఖాళీగా ఉంచాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను కొట్టేస్తున్నామని చెబుతూ, తమ మార్గదర్శకాల ప్రకారం పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది.
ఏపీఏటీ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..
- {పకటించిన ఖాళీల్లో 20 శాతం పోస్టులను స్థానికులు, స్థానికేతరులతో, 80 శాతం పోస్టులను స్థానికులతో రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి.
- ఓపెన్ కేటగిరీ పోస్టులను ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలి. రిజర్వేషన్ కేటగిరీలోని అభ్యర్థి మెరిట్ జాబితాలో ఎంపికైతే రిజర్వేషన్ కోటాలో ఆ సంఖ్యను తగ్గించ కూడదు.
- స్థానిక అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి. గతంలో మిగిలిన పోస్టులను రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాలి.
- ఉద్యోగుల సర్వీసు నిబంధన 22(2)(ఇ) ప్రకారమే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, మాజీ సైనికుల కేటగిరీ నియామకాలు చేపట్టాలి.
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలకు అనుగుణంగా స్థానిక ఎస్టీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలి. ఏజెన్సీయేతర ప్రాంతాల్లోనూ అర్హులైన ఎస్టీలు ఉంటే నియమించవచ్చు.
- నోటిఫికేషన్‌లో ప్రకటించిన ఖాళీలకన్నా ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయరాదు. వెయిటింగ్ లిస్టు ఉండకూడదు.
- అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే అందులో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ఎక్కువ ర్యాంక్ కేటాయించాలి. ఇందులో ఒకే వయసున్న మహిళలు ఉంటే వారికే ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి.
- విద్యాశాఖ కమిషనర్ జిల్లా, కేటగిరీ వారీగా మెరిట్ లిస్టును రూపొందించి డీఎస్సీలకు పంపాలి.
- ఒకే వయసున్న అభ్యర్థులు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేయాలి.
- ఎంపికైన అభ్యర్థి ఉద్యోగంలో చేరకపోతే ఏర్పడే ఖాళీని తదుపరి నియామకాల్లో భర్తీ చేయాలి. మాజీ సైనికుల కోటా పోస్టులకు అర్హులెవరూ లేకపోతే వాటిని ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయవచ్చు.
డీఎస్సీ నియామకాలకు మార్గదర్శకాలు
Published Wed, Aug 7 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement