DSC-2012
-
డీఎస్సీ-2012 రెండో జాబితా.. 468 మందికి పోస్టింగ్‌లు
ముఖ్యమంత్రి అంగీకారం మొదటి జాబితాపై వారంలో నివేదిక: మంత్రి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-2012 రెండో జాబితాలోని 468 మందికి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఇటీవల ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం ఇదే అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు సమావేశమై చర్చించారు. కోర్టు స్టేతో ఉద్యోగాలకు దూరమైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడమే కాక, అభ్యర్థులకు సంబంధించి పరిశీలన వెంటనే పూర్తిచేయాలని ఆయా డీఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మొదటి ఎంపిక జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేని 987 మందికి కూడా ఎలా న్యాయం చేయాలనే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. లోకల్, నాన్‌లోకల్‌కు సంబంధించి మొదటి జాబితాలో తప్పులు దొర్లడంతో విద్యాశాఖ ఆ జాబితాను రద్దు చేసి రెండో జాబితాను రూపొందించిన సంగతి తెలిసిందే. దీంతో పోస్టులకు ఎంపికైనట్లు మొదటి జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆ 987 మంది ఉద్యోగాలకు దూరం అయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలని వారంతా అప్పటినుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే మానవతా దృక్పథంతో వారికి కూడా పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఇందుకు ఏ విధానాన్ని అనుసరించాలనే దానిపైనా చర్చించామని మంత్రి పార్థసారథి విలేకరులతో చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టులు రూపొందించాలా?, ఖాళీల్లో నియమించాలా? సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, ఎంపిక జాబితాలను మరోసారి పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. వారికి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వివరించారు. -
పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఉండవనే వార్తలతో ఉద్యోగార్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనతో పోటీ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగార్థుల పరిస్థితి ఆయోమయంలో పడింది. ఇప్పట్లో నోటిఫికేషన్లుండవనే వార్తలు, రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో తెలియకపోవడంతో వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఎస్సీ, ఎస్సైలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రాతపరీక్షల కోసం శిక్షణ తీసుకోవాలా వద్దా అనే దానిపై కూడా నిరుద్యోగుల మెదళ్లలో సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల నుంచి తరలివచ్చి.. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న వారిలో కొందరు ఇప్పటికే స్వస్థలాలకు తిరుగుముఖం పట్టగా.. మరికొందరు నేడో రేపో వెళ్లిపోదామనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు ఇక గడ్డుకాలమేనని చెబుతున్నారు. ఖర్చు తప్ప ఉపయోగం లేదు.. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఎస్సీ, ఎస్సైలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రాతపరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకుగాను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కోచింగ్ సెంటర్లున్నాయి. ఈ కోచింగ్ సెంటర్లలో లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయం నేపథ్యంలో సాధారణ ఎన్నికలు అయిపోయేంతవరకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు రావంటూ వస్తున్న వార్తలతో వీరు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల కోచింగ్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని విద్యానగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్న అధ్యాపకుడు చెప్పారు. ఇప్పుడు ఉద్యోగార్థులకు సంధికాలమని, ఈ సంధికాలం ముగిసి ఉద్యోగ ప్రకటనలపై స్పష్టత వచ్చేంతవరకు కోచింగ్ సెంటర్లు మూతపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 కోచింగ్కయితే సెంటర్‌ను బట్టి గరిష్టంగా రూ.50 వేలు, గ్రూప్-2కు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోచింగ్ తీసుకుంటే ఆర్థికంగా ఖర్చు తప్ప ఉపయోగం లేదనే ఆలోచనతో కొందరు నిరుద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. ‘మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పట్లో ఉద్యోగ ప్రకటనలు ఉండకపోవచ్చు. ఇక్కడ ఉండి ఉపయోగం ఏముంది? హాస్టళ్లలో ఉన్నా ఖాళీగా ఉండి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిందే. మళ్లీ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కోచింగ్ సెంటర్లే కబురు పెడతాయి. రెండు రోజుల్లో మా ఇంటికి వెళ్లిపోతా’ అని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉంటున్న ఓ నిరుద్యోగి అన్నాడు. ఉద్యోగాల భర్తీ కొత్త రాష్ట్రాల్లోనేనా? కొత్త రాష్ట్రాల్లోనే ఉద్యోగాల ప్రకటనలు వస్తాయని నిరుద్యోగులు నమ్ముతున్నారు. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు హైదరాబాద్ వస్తుంటారు. విభజన వల్ల పబ్లిక్ సర్వీసు కమిషన్ రెండుగా విడిపోతుంది. అప్పుడున్న ఖాళీలు, పోస్టుల అవసరం మేరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశముంది. సిలబస్, పరీక్షా విధానం పాతదే కొనసాగుతుందని చెప్పడానికీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం సిలబస్‌లో మార్పేమీ ఉండదని, కనీసం రెండేళ్ల వరకైతే మారదని అంటున్నారు. వయసు మీరిన వారి పరిస్థితేంటి? ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు విధించిన గరిష్ట వయోపరిమితికి అతి సమీపంలోఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏడాది, ఏడాదిన్నరలో వయోపరిమితి దాటే నిరుద్యోగుల సంఖ్య దాదాపు లక్ష ఉంటుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు మారి.. ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేసరికి తమ వయసు అడ్డంకిగా మారుతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అయితే, నిరుద్యోగ సంఘాలు ఒక డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటివరకు గుర్తించి, నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఇవి కోరుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా కనీసం ఆరేడు నెలలు పడుతుందని, పోటీపరీక్షలు నిర్వహించి.. వాటి ఫలితాలు వచ్చి పోస్టింగ్లిచ్చేందుకు కూడా అదే సమయం పడుతుందని, అప్పుడు రెండు రాష్ట్రాలకు ఉద్యోగులను పంచవచ్చని గ్రూప్-2 సాధన సమితి నాయకుడు చందు అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని నోటిఫికేషన్లు ఇస్తుందా? లేక రెండు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు భర్తీ అవుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. -
డీఎస్సీ నియామకాలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన డీఎస్సీ-2012 నియామకాల కోసం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. నియామకాల కోసం రెండోసారి తయారు చేసిన జాబితా.. తమ మార్గదర్శకాల ప్రకారం ఉందో లేదో పరిశీలించి, వాటి ప్రకారమే తుది జాబితా విడుదల చేయాలని విద్యా శాఖకు తేల్చి చెప్పింది. ‘నియామక ఉత్తర్వులు కూడా మా మార్గదర్శకాలకు లోబడే ఉం డాలి. వాటికి విరుద్ధంగా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని చట్టవిరుద్ధమైనవిగా భావించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. డీఎస్సీ-2012 పరీక్షా ఫలితాల్లో మొదట తాము ఎంపికైనట్లు ప్రకటించి తర్వాత మరో జాబితా విడుదల చేశారని, అందులో తమ పేర్లు తొలగించాలని ఆరోపిస్తూ సయ్యద్ మహమూద్ అనే అభ్యర్థితోపాటు మరికొంత మంది అభ్యర్థులు దాఖలు చేసిన 262 పిటిషన్లను ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.యతిరాజులు, సభ్యులు ఎంవీపీ శాస్త్రిల నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల వాదనలు వినింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎం.రాంగోపాల్‌రావు, సీహెచ్ జగన్నాథరావు, పి.వీరభద్రారెడ్డిలు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం డీఎస్సీ-2012 నియామకాల కోసం 26 మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్ల కోసం ఖాళీగా ఉంచాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను కొట్టేస్తున్నామని చెబుతూ, తమ మార్గదర్శకాల ప్రకారం పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది. ఏపీఏటీ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి.. - {పకటించిన ఖాళీల్లో 20 శాతం పోస్టులను స్థానికులు, స్థానికేతరులతో, 80 శాతం పోస్టులను స్థానికులతో రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి. - ఓపెన్ కేటగిరీ పోస్టులను ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలి. రిజర్వేషన్ కేటగిరీలోని అభ్యర్థి మెరిట్ జాబితాలో ఎంపికైతే రిజర్వేషన్ కోటాలో ఆ సంఖ్యను తగ్గించ కూడదు. - స్థానిక అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి. గతంలో మిగిలిన పోస్టులను రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాలి. - ఉద్యోగుల సర్వీసు నిబంధన 22(2)(ఇ) ప్రకారమే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, మాజీ సైనికుల కేటగిరీ నియామకాలు చేపట్టాలి. - ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలకు అనుగుణంగా స్థానిక ఎస్టీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలి. ఏజెన్సీయేతర ప్రాంతాల్లోనూ అర్హులైన ఎస్టీలు ఉంటే నియమించవచ్చు. - నోటిఫికేషన్లో ప్రకటించిన ఖాళీలకన్నా ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయరాదు. వెయిటింగ్ లిస్టు ఉండకూడదు. - అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే అందులో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ఎక్కువ ర్యాంక్ కేటాయించాలి. ఇందులో ఒకే వయసున్న మహిళలు ఉంటే వారికే ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి. - విద్యాశాఖ కమిషనర్ జిల్లా, కేటగిరీ వారీగా మెరిట్ లిస్టును రూపొందించి డీఎస్సీలకు పంపాలి. - ఒకే వయసున్న అభ్యర్థులు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేయాలి. - ఎంపికైన అభ్యర్థి ఉద్యోగంలో చేరకపోతే ఏర్పడే ఖాళీని తదుపరి నియామకాల్లో భర్తీ చేయాలి. మాజీ సైనికుల కోటా పోస్టులకు అర్హులెవరూ లేకపోతే వాటిని ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయవచ్చు.