పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఉండవనే వార్తలతో ఉద్యోగార్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనతో పోటీ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగార్థుల పరిస్థితి ఆయోమయంలో పడింది. ఇప్పట్లో నోటిఫికేషన్లుండవనే వార్తలు, రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో తెలియకపోవడంతో వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఎస్సీ, ఎస్సైలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రాతపరీక్షల కోసం శిక్షణ తీసుకోవాలా వద్దా అనే దానిపై కూడా నిరుద్యోగుల మెదళ్లలో సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల నుంచి తరలివచ్చి.. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న వారిలో కొందరు ఇప్పటికే స్వస్థలాలకు తిరుగుముఖం పట్టగా.. మరికొందరు నేడో రేపో వెళ్లిపోదామనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు ఇక గడ్డుకాలమేనని చెబుతున్నారు.
ఖర్చు తప్ప ఉపయోగం లేదు..
గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఎస్సీ, ఎస్సైలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రాతపరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకుగాను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కోచింగ్ సెంటర్లున్నాయి. ఈ కోచింగ్ సెంటర్లలో లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయం నేపథ్యంలో సాధారణ ఎన్నికలు అయిపోయేంతవరకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు రావంటూ వస్తున్న వార్తలతో వీరు ఆందోళన చెందుతున్నారు.
దీని వల్ల కోచింగ్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని విద్యానగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అధ్యాపకుడు చెప్పారు. ఇప్పుడు ఉద్యోగార్థులకు సంధికాలమని, ఈ సంధికాలం ముగిసి ఉద్యోగ ప్రకటనలపై స్పష్టత వచ్చేంతవరకు కోచింగ్ సెంటర్లు మూతపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 కోచింగ్‌కయితే సెంటర్‌ను బట్టి గరిష్టంగా రూ.50 వేలు, గ్రూప్-2కు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోచింగ్ తీసుకుంటే ఆర్థికంగా ఖర్చు తప్ప ఉపయోగం లేదనే ఆలోచనతో కొందరు నిరుద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. ‘మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పట్లో ఉద్యోగ ప్రకటనలు ఉండకపోవచ్చు. ఇక్కడ ఉండి ఉపయోగం ఏముంది? హాస్టళ్లలో ఉన్నా ఖాళీగా ఉండి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిందే. మళ్లీ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కోచింగ్ సెంటర్లే కబురు పెడతాయి. రెండు రోజుల్లో మా ఇంటికి వెళ్లిపోతా’ అని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉంటున్న ఓ నిరుద్యోగి అన్నాడు.
ఉద్యోగాల భర్తీ కొత్త రాష్ట్రాల్లోనేనా?
కొత్త రాష్ట్రాల్లోనే ఉద్యోగాల ప్రకటనలు వస్తాయని నిరుద్యోగులు నమ్ముతున్నారు. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు హైదరాబాద్ వస్తుంటారు. విభజన వల్ల పబ్లిక్ సర్వీసు కమిషన్ రెండుగా విడిపోతుంది. అప్పుడున్న ఖాళీలు, పోస్టుల అవసరం మేరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశముంది. సిలబస్, పరీక్షా విధానం పాతదే కొనసాగుతుందని చెప్పడానికీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం సిలబస్‌లో మార్పేమీ ఉండదని, కనీసం రెండేళ్ల వరకైతే మారదని అంటున్నారు.
వయసు మీరిన వారి పరిస్థితేంటి?
ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు విధించిన గరిష్ట వయోపరిమితికి అతి సమీపంలోఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏడాది, ఏడాదిన్నరలో వయోపరిమితి దాటే నిరుద్యోగుల సంఖ్య దాదాపు లక్ష ఉంటుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు మారి.. ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేసరికి తమ వయసు అడ్డంకిగా మారుతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అయితే, నిరుద్యోగ సంఘాలు ఒక డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటివరకు గుర్తించి, నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఇవి కోరుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా కనీసం ఆరేడు నెలలు పడుతుందని, పోటీపరీక్షలు నిర్వహించి.. వాటి ఫలితాలు వచ్చి పోస్టింగ్‌లిచ్చేందుకు కూడా అదే సమయం పడుతుందని, అప్పుడు రెండు రాష్ట్రాలకు ఉద్యోగులను పంచవచ్చని గ్రూప్-2 సాధన సమితి నాయకుడు చందు అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని నోటిఫికేషన్లు ఇస్తుందా? లేక రెండు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు భర్తీ అవుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది.