ముఖ్యమంత్రి అంగీకారం
మొదటి జాబితాపై వారంలో నివేదిక: మంత్రి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-2012 రెండో జాబితాలోని 468 మందికి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఇటీవల ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం ఇదే అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు సమావేశమై చర్చించారు. కోర్టు స్టేతో ఉద్యోగాలకు దూరమైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడమే కాక, అభ్యర్థులకు సంబంధించి పరిశీలన వెంటనే పూర్తిచేయాలని ఆయా డీఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మొదటి ఎంపిక జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేని 987 మందికి కూడా ఎలా న్యాయం చేయాలనే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. లోకల్, నాన్‌లోకల్‌కు సంబంధించి మొదటి జాబితాలో తప్పులు దొర్లడంతో విద్యాశాఖ ఆ జాబితాను రద్దు చేసి రెండో జాబితాను రూపొందించిన సంగతి తెలిసిందే.
దీంతో పోస్టులకు ఎంపికైనట్లు మొదటి జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆ 987 మంది ఉద్యోగాలకు దూరం అయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలని వారంతా అప్పటినుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే మానవతా దృక్పథంతో వారికి కూడా పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఇందుకు ఏ విధానాన్ని అనుసరించాలనే దానిపైనా చర్చించామని మంత్రి పార్థసారథి విలేకరులతో చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టులు రూపొందించాలా?, ఖాళీల్లో నియమించాలా? సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, ఎంపిక జాబితాలను మరోసారి పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. వారికి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వివరించారు.