అప్పటి ఉత్తర్వులు అమలు చేస్తాం
ఏపీఏటీపై హైకోర్టుకు తెలంగాణ ఏజీ హామీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ తమ రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తెలంగాణ జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను రోస్టర్ ప్రకారం సింగిల్ జడ్జి విచారిస్తారంది.
ఒకవేళ వివాదం రెండు రాష్ట్రాలకు సంబంధించినది అయితే దానిని కూడా హైకోర్టులో సవాలు చేయవచ్చునని, ఆ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య, ఎన్.నాగరాజు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... కేంద్రం నోటిఫికేషన్ నేపథ్యంలో ఏపీఏటీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ‘ఆర్డినెన్స్’ జారీ చేశామని తెలిపారు. పరిశీలన నిమిత్తం ఆర్డినెన్స్ కాపీని ధర్మాసనం ముందుంచారు. ట్రిబ్యునల్‌లోని కేసులను హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలా అధికారం ఉందని ఏ చట్టంలో ఉందో చూపాలని కోరింది. మధ్యప్రదేశ్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుందని, దానిని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని రామకృష్ణారెడ్డి చెప్పారు. న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహకారం అందుతూనే ఉంటుందని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించేంత వరకు కేంద్ర నోటిఫికేషన్ అమలును నిలిపేయవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు.
నోటిఫికేషన్‌తో స్తబ్దత...
ఈ సమయంలో కిరణ్‌కుమార్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనర్సింహ... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్ర నోటిఫికేషన్ వల్ల తెలంగాణ కేసుల విచారణ విషయంలో స్తబ్దత ఏర్పడిందన్నారు. ఏపీఏటీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదన్నారు. దీనిపై ధర్మాసనం ఏజీ వివరణ కోరింది. నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కక్షిదారుల సౌలభ్యం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పి.వి.కృష్ణయ్య, నాగరాజుల వ్యాజ్యాల్లో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.