వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పిటిషన్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఇకపై ధర్మాసనం విచారించనుంది. ఇలాంటి అంశానికి సంబంధించిన కేసులను గతంలో ధర్మాసనం విచారించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను కూడా ధర్మాసనం విచారించడం సబబుగా ఉంటుందని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, చిదిపిరాళ్ల ఆదినారాయణడ్డి, అత్తార్ చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరివీధి జయరాములు, భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రూ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, పాశం సునీల్‌కుమార్, వరపుల సుబ్బారావు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, అమర్‌నాథ్‌రెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. తమ ఫిర్యాదుపై నెలలు గడుస్తున్నా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నీ గురువారం జస్టిస్ పి.నవీన్‌రావు ముందు విచారణకు వచ్చాయి. వీటిని ధర్మాసనం విచారించడం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అభిప్రాయం కోరారు. ఎక్కడైనా తమకు పర్వాలేదని ఏజీ చెప్పడంతో తన ముందున్న వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదిస్తూ జస్టిస్ నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిరాయింపుల వ్యాజ్యాలు ధర్మాసనానికి
Published Fri, Nov 4 2016 2:27 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement