ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదు
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్యలు తీసుకోవట్లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తగిన చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరువీధి జయరాములు, భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, పాశం సునీల్‌కుమార్, వరుపుల సుబ్బారావులతోపాటు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం విచారించారు. సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.ప్రతాప్‌కుమార్ నివేదించారు. ఇదే సమయంలో అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని, దానిపై వాదనలు వినిపిస్తామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.