
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం గజదొంగల కుటుంబంగా తయారైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడెల పెద్ద గజదొంగ అని, కోడెల కుమారుడు, కుమార్తె పోలీసు కేసుల్లో ఉండి పారిపోయారని ఆరోపించారు. అటువంటి కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను కోడెల తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పటికైనా స్పీకర్‌గా ఉండి అనేక అన్యాయాలు చేశానని కోడెల ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారన్నారు.
కోడెల దొరికిన దొంగ అని చంద్రబాబు దొరకని దొంగ అని దుయ్యబట్టారు. కోడెల పేర్కొంటున్న అర్జున్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అని, అతడు తమ కార్యాలయం ఉద్యోగి కానేకాదన్నారు. కోడెల ఇంట్లో కంప్యూటర్లను దొంగిలించడానికి అర్జున్‌ను తానే పంపానని ఆరోపించడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్లు సత్తెనపల్లిలో శిక్షణ కోసం కంప్యూటర్లు తెచ్చిపెట్టారన్నారు. వాటిలో కోడెల కుమారుడు, కుమార్తె 30 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారన్నారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీకి లేఖ రాశానని చెప్పారు. రెండు రోజుల క్రితం ఎండీ అక్కడకు వచ్చి కంప్యూటర్ల కోసం చూస్తే అవిలేవన్నారు. ఈ విషయం ఆ దొంగల ముఠాకు తెలిశాక రాత్రికి రాత్రే 29 కంప్యూటర్లు ప్రత్యక్షమయ్యాయన్నారు.
కంప్యూటర్లు దొరికాయి కాబట్టి కేసును మూసివేయాలన్నది కోడెల ఉద్దేశమన్నారు. కంప్యూటర్ల కుంభకోణం బయటకు వస్తుందని తెలిసి కోడెల దీన్ని రచించారని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన ఇంట్లో దొంగతనాన్ని సృష్టించారని ఆరోపించారు. అదేవిధంగా అసెంబ్లీ సిబ్బంది వెళ్లి హీరో హోండా షోరూమ్‌ను తనిఖీ చేస్తే అక్కడ అసెంబ్లీ ఫర్నిచర్ అంతా కనిపించిందన్నారు. కోడెల దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చేసినంత మాత్రాన కేసులు మాఫీ కావన్నారు. శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment