పచ్చ పార్టీలో పల్నాటి యుద్ధం జరుగుతోందా? ఆ పార్టీ మాజీ స్పీకర్ నియోజకవర్గం పేరు చెబితే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయెందుకు? ఆ నియోజకవర్గంలో చంద్రబాబునే పట్టించుకోని నాయకులెవరు? రెండు వర్గాలకు తోడు ఇప్పుడు మూడో కృష్ణుడు తోడయ్యాడా? ఇంతకీ సత్తెనపల్లి టీడీపీలో ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి రాంబాబు ఘన విజయం సాధించారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని ప్రకటించలేదు.
దీంతో కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మధ్య తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతి కార్యక్రమంలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకుంటున్నారు కోడెల, వైవీ వర్గీయులు. సాక్షాత్తూ చంద్రబాబు చెప్పినా ఎవరూ వినని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా ఎవరి వర్గాలతో వారు కమిటీలు కూడా వేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ఒక దూతను నియమించారు. కానీ వచ్చిన చంద్రబాబు దూత ఈ ఇద్దరి టార్చర్ తట్టుకోలేక దండం పెట్టి పారిపోయారు.
సత్తెనపల్లిలో పార్టీని గాడిలో పెడదామని చాలాసార్లు ప్రయత్నించిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికు ఆయన కూడా చేతులెత్తేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మాటకే విలువ ఇవ్వకపోగా.. రెండు వర్గాలు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ పార్టీని రోడ్డున పడేశారు. పార్టీ నాయకత్వం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లోనే విడి విడిగా రెండు వర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
సత్తెనపల్లి పార్టీని ఎలా దారికి తేవాలో అర్థంకాని పరిస్థితుల్లో.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కన్నా కూడా ఇప్పుడు సత్తెనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నా తరచూ వెళ్ళి..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అటు కోడెల శివరాం, ఇటు వైవీ ఆంజనేయులు వర్గీయులకు మింగుడు పడడం లేదు. నాలుగేళ్ల నుంచి పార్టీకోసం కష్టపడుతున్నాం.. ఇప్పుడు కన్నా వచ్చి ఫోజులు కొడితే ఊరుకునేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అదే సమయంలో రెండు వర్గాలు ఎక్కడా తగ్గడంలేదు. టికెట్ నేనే తెచ్చుకుంటా.. ఇక్కడ పోటీ చేసేది కూడా నేనే అని కోడెల శివరాం తేల్చిచెబుతున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు అయితే పార్టీ నాయకత్వం తనకు హామీ ఇచ్చిందని చెబుతున్నారు.
రెండు వర్గాలనే దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణను తెచ్చుకుని మరో కొరివి నెత్తిన పెట్టుకున్నారు. మూడో కృష్ణుడు కన్నా రెండు పాత వర్గాలను దెబ్బ తీయడానికి తన వర్గం కేడర్‌తో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని కన్నా అవమానించారంటూ కోడెల శివరాం కొత్త రాగం అందుకున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు కూడా కన్నాను దెబ్బ తీసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్‌ఆర్‌ఐ
ఈ మూడు ముక్కలాట వ్యవహారంతో చంద్రబాబు పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. కోడెల శివరాం మాత్రం.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తానంటూ నాయకత్వానికే వార్నింగ్ లు ఇస్తున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేసేది మనమే అంటూ కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులకు సంకేతాలిస్తున్నారు. చంద్రబాబు స్వయంగానే ఈ విషయాన్ని చెబుతారంటూ సత్తెనపల్లిలో ప్రచారం చేయించుకుంటున్నారు.
రెండు వర్గాలకు తోడుగా మరో వర్గాన్ని తెచ్చి పెట్టుకున్న చంద్రబాబు.. పల్నాటి యుద్ధాన్ని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గం చంద్రబాబుకు బీపీ పెంచుతోందని అక్కడి పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..!
Comments
Please login to add a commentAdd a comment