సాక్షి, అమరావతి : అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కావడంపై శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా టీడీపీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.
చదవండి : చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!
పాపం చంద్రబాబు..!
తమ పార్టీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురమనలేని దయనీయ స్థితి చంద్రబాబు గారిది అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘అమిత్ షా గారికి కోపం వస్తుందేమోనని వణికి పోతున్నాడు. పార్టీ వదిలి వెళ్తున్న వారినీ నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అవినీతి కేసులు తిరగ తోడతారనే భయం వల్ల సైలెంటైనట్టున్నాడు అని ఆయన ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడంపై స్పందించిన విజయసాయిరెడ్డి...‘ నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే. ముంపు ప్రాంతాలను పర్యటిస్తామని సార్ ప్రకటించిన వెంటనే వరద నిలిచి పోయింది. అన్ని డ్యాముల గేట్లు మూతపడ్డాయి. ఇంతకూ ఈయన పరామర్శించేదెవరినో? మీ ఇల్లే మునిగి పోయిందట. ఇక మాకేం ధైర్యం చెబ్తారయ్యా అని బాధితులంతా ఈయననే ఓదార్చేట్టున్నారు’ అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment