మాది మార్వాడీ కంపెనీ కాదు
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం.. జీవో 123పై హైకోర్టులో రాష్ట్ర సర్కారు
* వ్యవసాయ కూలీలకు తప్పక పునరావాసం కల్పిస్తాం
* పునరావాసం కోసం ఏం చేయబోతున్నారో అఫిడవిట్ ఇవ్వండి: ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయ కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని సింగిల్ జడ్జి అన్నారు. కానీ మేం ఎంత మాత్రం ఆ పనిచేయడం లేదు. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. వ్యాపారం చేసే మార్వాడీ కంపెనీ కాదు. ప్రజల విషయంలో మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి’’ అని జీవో 123పై జరిగిన వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టంచేసింది.
రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి తప్పక పునరావాసం కల్పిస్తామని తెలిపింది. అయితే వారి పునరావాసం కోసం ఏమి చేయబోతున్నారో వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాతే జీవో 123 విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఉద్దేశాలను తాము అనుమానించడం లేదని, స్పష్టత కోసమే అఫిడవిట్‌ను తమ ముందుంచాలని కోరుతున్నామంది. వ్యవసాయ కార్యకలాపాలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డికి స్పష్టం చేసింది. ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి రెండ్రోజుల కిందట తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీన్ని సవాలు చేస్తూ మెదక్ ఆర్డీవో డి.శ్రీనివాసరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో అప్పీల్ చేశారు. దీనిని అత్యవసరంగా విచారిం చాలంటూ ఏజీ కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అందుకు అనుమతినిచ్చిన ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు అప్పీల్‌పై విచారణ చేపట్టింది.
చట్టప్రకారం దక్కాల్సినవన్నీ ఇస్తాం
ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు విని పిస్తూ.. జీవో 123 ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న భూములపై ఆధారపడి జీవిస్తున్నవారికి తప్పక పునరావాసం కల్పిస్తామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారు. చట్ట ప్రకారం వారికి ఏ ప్రయోజనాలు దక్కాలో వాటన్నింటినీ ఇస్తామని చెప్పారు. జీవో 123లో తొలగించిన పునరావాస క్లాజ్‌ను తిరిగి అమల్లోకి తీసుకొస్తామని కోర్టుకు నివేదించారు. పునరావాస కల్పనపై ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించబోదన్నారు.
భూములను అమ్మేందుకు స్వచ్ఛందం గా ముందుకొచ్చిన రైతుల నుంచే సంతృప్తికరమైన మొత్తాలకు భూమి కొంటున్నామని చెప్పారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం ఆకర్షణీయంగా ఉండటంతో భూములమ్మేందుకు భూయజమానులు క్యూలో నిల్చున్నారన్నారు. జీవో 123 విషయంలో జోక్యానికి ఇదే హైకోర్టు ధర్మాసనం నిరాకరించిందని గుర్తు చేశారు. తమది ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే తప్ప.. వ్యాపారం చేసే మార్వాడీ కంపెనీ కాద ని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. 2013 భూ సేకరణ చట్టం వ్యవసాయ కూలీల గురించి ఏం చెబుతోందని ఏజీని ప్రశ్నించింది.వ్యవసాయ కూలీలు ‘ప్రభావిత కుటుం బం’ నిర్వచన పరిధిలోకి వస్తారా? రారా? అని అడిగింది. వస్తారని ఏజీ చెప్పడంతో.. మరి వారికి ఆ చట్ట ప్రకారం ప్రయోజనాలు దక్కి తీరాలి కదా? అని పేర్కొంది.
ఆ ధర్మాసనం కేసు లోతుల్లోకెళ్లలేదు...
ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. అప్పటి ధర్మాసనం కేసు లోతుల్లోకెళ్లి ఆ ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆ రోజుకు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేసింది. ‘పరిహారం విషయంలో ఓ విధానం తీసుకొచ్చే యోచన చేస్తున్నారని చెబుతున్నారు కదా.. ఆ విధానంతో కోర్టు ముందుకు రండి’ అని ఏజీకి ధర్మాసనం తెలిపింది. తప్పకుండా పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, అయితే జీవో 123 అమలుకు అనుమతినివ్వాలని ఏజీ కోరారు. కనీసం భూముల రిజిస్ట్రేషన్‌కైనా అనుమతినివ్వాలన్నారు. పునరావాసం విషయంలో ఏజీ స్పష్టమైన హామీ ఇస్తున్నారు కదా.. మరి ఇంకేం అభ్యంతరమని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
పరిహారం, పునరావాసం వారి హక్కు
పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి వాదిస్తూ.. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నుంచి దాతృత్వం కింద పరిహారం పొందాల్సిన పరిస్థితి లేదని, పరిహారం, పునరావాసం వారి హక్కులని తెలిపా రు. చట్ట ప్రకారం వారికి మెరుగైన పరిహారం దక్కాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, ఇందుకు గ్రామ సభలు నిర్వహించాలని, అవేమీ చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.
భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తే వాటి యజమానులు వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించరని, ఫలితంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతుందన్నా రు.ధర్మాసనం స్పందిస్తూ.. పునరావాసం విషయంలో వ్యవసాయ కూలీల తోపాటు ఇతరుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంది. పునరావాస కల్పన కోసం ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందించాలంది.
మీరూ మీరూ.. హ్యాపీ.. మరి వారి సంగతేంటి?
‘‘జీవో 123 ద్వారా మీరు భూ యజమానుల నుంచి కొంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం కింద ఇచ్చే మొత్తం కంటే ఎక్కువే భూ యజమానులకు ఇస్తున్నారు. అటు మీరూ, ఇటు భూయజమానులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ వ్యవసాయ భూ ములపై ఆధారపడి బతికే వారి పరిస్థితేమి టి? మీరూ మీరూ సంతోషంగా ఉంటే సరి పోతుందా? వ్యవసాయ కార్మికులు బతికేదెలా? వారి పునరావాసం సంగతేంటి? 2013 భూ సేకరణ చట్టం సెక్షన్ 108 ప్రకా రం వీరి బాగోగుల విషయంలో ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలి.
దాని మాటేమిటి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ.. వారికి తప్పక పునరావాసం కల్పిస్తామన్నారు. భూములు లేనంత మాత్రాన జీవోనోపాధి పోయినట్లు కాదని, ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా వారికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చే యోచన కూడా చేస్తోందన్నారు. సింగిల్ జడ్జి 214 జీవోను కొట్టేశారని, వాస్తవానికి పిటిషనర్లు ఆ జీవోను సవాలు చేయలేదని, అయినా కూడా సింగిల్ జడ్జి దాన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చారని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా, విచారణకు స్వీకరించే దశలోనే సింగిల్ జడ్జి తుది తీర్పు వెలువరించారన్నారు.