విద్యుత్ సంస్థలకు హైకోర్టు నోటీసులు
రైతుల భూముల్లో విద్యుత్ లైన్లపై స్పందించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రైతుల భూముల్లో విద్యుత్ లైన్లు వేస్తున్న విద్యుత్ సంస్థలు వారికి ఎటువంటి పరిహారం ఇవ్వడంలేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ కన్సార్షి యం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి చేసిన అభ్యర్థనపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యుత్ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండళ్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రైతుల పొలాల్లో వేస్తున్న విద్యుత్ లైన్ల విషయంలో ఉభయ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు 2003 విద్యుత్ చట్టం, వర్క్స్ ఆఫ్ లైసెన్సీస్ రూల్స్ 2006కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రైతులకు పరిహారం చెల్లించడంలేదని చెంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి, ఇదే వ్యవహారంపై అంతకు ముందు దాఖలైన వ్యాజ్యంతో దీనిని జత చేసింది.