విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక నేరుగా వేతనాలు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గతంలో విద్యుత్ సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అమలు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లేబర్ కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని, వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని, కన్సాలిడేటెడ్ వేతనాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ నేరుగా వేతనాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి.
విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–1, నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–2, స్వల్ప నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–3, నైపుణ్యం లేని వారిని ఆర్టిజన్ గ్రేడ్–4 సిబ్బందిగా వర్గీకరించారు. హైకోర్టు ఆదేశాలతో క్రమబద్ధీకరణ ఉత్తర్వుల అమలు ఆగిపోయినా, ఈ 4 కేటగిరీల కిందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.
హైకోర్టు సూచించిన వేతనాలకు అదనంగా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.వెయ్యి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ వేతనాలను ఖరారు చేసినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్‌కోలో 2,914 మంది, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 9,459 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 4,333 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.