విస్తృత ప్రజా ప్రయోజనాలు చూడాలి..
- ఆ బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది
- పిల్ కాదన్న నెపంతో న్యాయమూర్తిని ఆపలేరు
- స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఓ అంశానికి సంబంధించి ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాజ్యాన్ని విచారించాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కాదన్న నెపంతో న్యాయమూర్తిని తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించకుండా ఎవ్వరూ ఆపలేరని పేర్కొంది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్‌డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. స్విస్ చాలెంజ్ కేసులో పిటిషనర్లు దాఖలు చేసింది పిల్ కాదని, వారు కోరని అంశాలపై కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు చేసిన సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.