
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్–1, 508 గ్రూప్–2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్) చిరంజీవి చౌధరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు–భవనాల శాఖల్లో గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయనున్నారు.
రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక, సాధారణ పరిపాలన, న్యాయ, లేజిస్లేచర్ తదితర శాఖల్లోనూ గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–1లో అత్యధికంగా హోంశాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–కేటగిరి–2లో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 కేటగిరీలో రాష్ట్ర సచివాలయంలో అత్యధికంగా 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్స్, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్‌సీకి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment