మిల్లర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం | T20 World Cup 2022: South Africa beat India by 5 wickets | Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: మిల్లర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం

Published Mon, Oct 31 2022 6:03 AM | Last Updated on Mon, Oct 31 2022 7:02 AM

T20 World Cup 2022: South Africa beat India by 5 wickets - Sakshi

బౌన్స్‌...బౌన్స్‌...బౌన్స్‌... మాకెవరికీ పడదు, మేం ఆడలేం... కానీ బౌన్స్‌ మాత్రం మమ్మల్ని వదల్లేదు... మా వెంట పడి మరీ వేటాడింది... పెర్త్‌లో తమ ఆట తర్వాత భారత క్రికెటర్లు మనసులో ఇలాగే అనుకొని ఉంటారు. ఊహించిన విధంగానే ఆప్టస్‌ స్టేడియంలో బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగిపోయారు... అన్నీ తెలిసినా మేం మాత్రం దానికి
సిద్ధంగా లేము అన్నట్లుగా భారత బ్యాటర్లు ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్‌ శర్మ, కోహ్లి, హార్దిక్, కార్తీక్, అశ్విన్‌... ఐదుగురూ ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పుల్‌ షాట్‌ ఆడబోయి విఫలం కాగా, కేఎల్‌ రాహుల్‌ అదే తరహా అనూహ్య బౌన్స్‌కు వెనుదిరిగాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 50 షార్ట్‌ బంతులు వేసిన ప్రత్యర్థి బౌలర్లు ఈ ఆరు వికెట్లతో పండగ  చేసుకున్నారు. ఒకదశలో స్కోరు 49/5... 100 కూడా చేయడం కష్టమనిపించించిది. అయితే సూర్యకుమార్‌ మాత్రం పిచ్‌ను పట్టించుకోను అనే రీతిలో కొన్ని చక్కటి షాట్లతో అర్ధసెంచరీ చేసి ఆదుకోవడంతో భారత్‌ పరువు కొంత దక్కింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. మన పేసర్లూ మెరిసినా... 134 పరుగుల లక్ష్యం మరీ చిన్నదైపోయింది. మిల్లర్, మార్క్‌రమ్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌ సఫారీ టీమ్‌ను ఆదుకుంది. ఫలితంగా రెండు వరుస విజయాల తర్వాత రోహిత్‌ బృందం తొలి పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పటిష్ట జట్టుపై నెగ్గి దక్షిణాఫ్రికా గ్రూప్‌–2లో అగ్రస్థానానికి చేరింది.   

పెర్త్‌: టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌–2లో బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు టీమిండియా తలవంచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లుంగి ఇన్‌గిడి (4/29) భారత టాపార్డర్‌ను కుప్పకూల్చగా, పార్నెల్‌ (3/15) కూడా రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు సాధించి గెలిచింది. డేవిడ్‌ మిల్లర్‌ (46 బంతుల్లో 59 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలతో జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 76 పరుగులు జోడించారు. అర్‌‡్షదీప్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.  

టపటపా...
పెర్త్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ ఎంచుకున్న తర్వాత తొలి తొమ్మిది బంతుల్లో భారత్‌ ఒక్క పరుగు కూడా తీయలేకపోవడం ప్రమాద హెచ్చరికను చూపించింది! గతంలో మొదటి పరుగు సాధించేందుకు భారత్‌ ఎప్పుడూ 10 బంతులు తీసుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (15), కేఎల్‌ రాహుల్‌ (9) సిక్సర్లతోనే తమ ఖాతాలు తెరిచినా ఆ జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపించగా, కోహ్లి (12) అరుదైన వైఫల్యం భారత్‌ కష్టాలు పెంచింది. తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడుతున్న దీపక్‌ హుడా (0) డకౌట్‌ కాగా, రబడ అద్భుత క్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా (2) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత జట్టును రక్షించే బాధ్యతను సూర్యకుమార్‌ తీసుకున్నాడు.  

ఒకే ఒక్కడు...
9 ఓవర్లోలోపే భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయిన సమయంలో మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్‌ స్కోరు 7 పరుగులు. ఇలాంటి స్థితి నుంచి అతను అద్భుత బ్యాటింగ్‌తో జట్టును 100 పరుగులు దాటించడంతో పాటు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించగలిగాడు. నోర్జే 143 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని లెగ్‌సైడ్‌ ఫ్లిక్‌తో సిక్సర్‌గా మలచిన తీరు సూర్య బ్యాటింగ్‌ ప్రత్యేకతను చూపించింది. మహరాజ్‌ బౌలింగ్‌లోనూ మరో సిక్సర్‌తో అతను తన ధాటిని కొనసాగించాడు. అప్పటి వరకు భారత్‌ను బెంబేలెత్తించిన ఇన్‌గిడి ఓవర్లోనే సిక్స్, ఫోర్‌ బాది 30 బంతుల్లోనే సూర్య హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. దినేశ్‌ కార్తీక్‌ (6)తో ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించగా అందులో 44 సూర్యవే ఉన్నాయి. ఆ తర్వాతా మరో మూడు ఫోర్లు బాదిన తర్వాత పార్నెల్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు.  

కీలక భాగస్వామ్యం...
ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. 24 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే డి కాక్‌ (1), రోసో (0), బవుమా (10) వెనుదిరిగారు. అర్‌‡్షదీప్‌ తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయగా, సఫారీ కెప్టెన్‌ను షమీ అవుట్‌ చేశాడు. ఇలాంటి దశలో మార్క్‌రమ్, మిల్లర్‌ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జట్టుకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. 35 పరుగుల వద్ద మార్క్‌రమ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి వదిలేయగా... 15 పరుగుల వద్ద ఉన్న మిల్లర్‌ను దగ్గరి నుంచి అండర్‌ఆర్మ్‌ త్రోతో రనౌట్‌ చేసే అతి సునాయాస అవకాశాన్ని రోహిత్‌ చేజార్చాడు. 7 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్‌ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు చెరో సిక్స్‌ బాది జట్టుపై ఒత్తిడి తగ్గించారు. తక్కువ వ్యవధిలో మార్క్‌రమ్, స్టబ్స్‌ (6) వెనుదిరిగినా, పట్టుదలగా చివరి వరకు నిలిచి మిల్లర్‌ పని పూర్తి చేశాడు. అశ్విన్‌ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, భువీ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లతో మ్యాచ్‌ ముగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 9.4 ఓవర్లలో 97 పరుగులు చేయడం విశేషం.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఇన్‌గిడి 9; రోహిత్‌ (సి అండ్‌ బి) ఇన్‌గిడి 15; కోహ్లి (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; సూర్యకుమార్‌ (సి) మహరాజ్‌ (బి) పార్నెల్‌ 68; హుడా (సి) డికాక్‌ (బి) నోర్జే 0; హార్దిక్‌ (సి) రబడ (బి) ఇన్‌గిడి 2; కార్తీక్‌ (సి) రోసో (బి) పార్నెల్‌ 6; అశ్విన్‌ (సి) రబడ (బి) పార్నెల్‌ 7; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 4; షమీ (రనౌట్‌) 0; అర్‌‡్షదీప్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–23, 2–26, 3–41, 4–42, 5–49, 6–101, 7–124, 8–127, 9–130.
బౌలింగ్‌: పార్నెల్‌ 4–1–15–3, రబడ 4–0–26–0, ఇన్‌గిడి 4–0–29–4, నోర్జే 4–0–23–1, మహరాజ్‌ 3–0–28–0, మార్క్‌రమ్‌ 1–0–5–0.  

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) రాహుల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 1; బవుమా (సి) కార్తీక్‌ (బి) షమీ 10; రోసో (ఎల్బీ) (బి) అర్‌‡్షదీప్‌ 0; మార్క్‌రమ్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 52; మిల్లర్‌ (నాటౌట్‌) 59; స్టబ్స్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 6; పార్నెల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–3, 2–3, 3–24, 4–100, 5–122.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.4–0–21–0, అర్‌‡్షదీప్‌ 4–0–25–2, షమీ 4–0–13–1, హార్దిక్‌ 4–0–29–1, అశ్విన్‌ 4–0–43–1.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement