India defeat
-
IND Vs AUS: పోరాడినా... ఓటమి తప్పలేదు
భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యం... తొలి సెషన్లో 33/3 స్కోరుతో కాస్త ఆందోళన... అయితే రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా చేజార్చుకోలేదు... దాంతో ఓటమిని తప్పించుకోవడంపై ఆశలు... విరామం తర్వాత 121/3తో మెరుగైన స్థితి... అయితే అనూహ్యంగా 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... పంత్ ఆడిన తప్పుడు షాట్‌తో ఈ పతనం మొదలైంది... అయినా సరే జైస్వాల్ పట్టుదలగా ఆడుతుండటం, మరో నాలుగు వికెట్లు ఉండటంతో కొంత భరోసా... మరో 21.2 ఓవర్లు నిలబడిగలిగితే చాలు... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించవచ్చు... కానీ జైస్వాల్ అవుట్ కావడంతో అంతా మారిపోయింది... అతను వెనుదిరిగిన తర్వాత టీమిండియా ఆట ముగించేందుకు ఆసీస్‌కు 8.2 ఓవర్లు సరిపోయాయి... ఒక్క సెషన్లోనే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్ మరో 12.5 ఓవర్లు మిగిలి ఉన్న దశలో ఓటమిని ఖరారు చేసుకుంది... వరుస మలుపులతో సాగుతూ వచ్చిన మెల్బోర్న్ టెస్టులో చివరకు ఆ్రస్టేలియానే గెలుపు బావుటా ఎగరవేసింది. వేర్వేరు సందర్భాల్లో పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా... వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేక రోహిత్ బృందం సిరీస్‌లో వెనుకబడిపోయింది. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. మెల్బోర్న్: నాలుగేళ్ల క్రితం ‘గాబా’ మైదానం తరహాలో భారీ లక్ష్యాన్ని ఛేదించి మెల్బోర్న్లో భారత్ సంచలన విజయం సాధిస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. గెలుపు కాదు కదా ... ఓటమి నుంచి తప్పించుకొని ‘డ్రా’గా ముగించే చాన్స్ కూడా ఆ్రస్టేలియా ఇవ్వలేదు. ఎంసీజీలో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కమిన్స్, బోలండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లయన్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 2–1తో ముందంజ వేసింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మ్యాచ్‌లో కీలకమైన 90 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. జైస్వాల్ మినహా... సిరీస్‌లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కెపె్టన్ రోహిత్ శర్మ (9) ఈసారి చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే 40 బంతులు ఎదుర్కొన్న అతను తొలిసారి కమిన్స్ బౌలింగ్‌లో దూకుడైన షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అదే ఓవర్లో రాహుల్ (0) కూడా అవుట్ కాగా, స్టార్క్ పదునైన బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లి (5) కూడా స్లిప్‌లో చిక్కడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత జైస్వాల్, పంత్ (104 బంతుల్లో 30; 2 ఫోర్లు) సాధికారికంగా ఆడారు. 27.5 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే టీ తర్వాత ఎట్టకేలకు పార్ట్‌టైమర్ హెడ్‌తో బౌలింగ్ చేయించిన వ్యూహం ఫలించింది. పంత్‌ను అవుట్ చేసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతే... ఆ తర్వాత జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 34 పరుగుల వ్యవధిలోనే జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. జడేజా (2), నితీశ్ రెడ్డి (1) విఫలం కాగా, సిరాజ్ (0)ను లయన్ ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/9తో ఆట కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 234; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) కమిన్స్ 84; రోహిత్ (సి) మార్‡్ష (బి) కమిన్స్ 9; రాహుల్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 5; పంత్ (సి) మార్‡్ష (బి) హెడ్ 30; జడేజా (సి) కేరీ (బి) బోలండ్ 2; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) లయన్ 1; సుందర్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) బోలండ్ 0; సిరాజ్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–25, 2–25, 3–33, 4–121, 5–127, 6–130, 7–140, 8–150, 9–154, 10–155. బౌలింగ్: స్టార్క్ 16– 8–25–1, కమిన్స్ 18–5–28–3, బోలండ్ 16–7 –39–3, మార్‡్ష 3–2–2–0, లయన్ 20.1–6– 37–2, హెడ్ 5–0–14–1, లబుషేన్ 1–1–0–0. చాలా నిరాశగా ఉంది. చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం కానీ అది సాధ్యం కాలేదు. ఆఖర్లో అంతా మారిపోయింది. టెస్టు మొత్తాన్ని చూస్తే మాకూ కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ మేం వాడుకోలేక పోయాం. వారి చివరి వికెట్ భాగస్వామ్యం కూడా దెబ్బ తీసింది. 340 పరుగులు ఎప్పుడైనా కష్టమే. చివరి రెండు సెషన్లలో ధాటిగా ఆడి లక్ష్యం చేరేందుకు ప్రయతి్నంచేందుకు కావాల్సిన పునాది వేయలేకపోయాం. తర్వాతి టెస్టుకు ముందు కొన్ని లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. గట్టిగా ప్రయతి్నంచి 2–2గా మార్చే ప్రయత్నం చేస్తాం. నా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మానసికంగా నేను సరైన స్థితిలో లేను. నేను ఏం చేయాలని ప్రయతి్నంచినా కలిసి రావడం లేదు. ఫలితం దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందనేది మాత్రం వాస్తవం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ జైస్వాల్ అవుట్‌పై వివాదం! చక్కటి ఇన్నింగ్స్‌తో ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. కమిన్స్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా వెళుతున్న బంతిని ఆడి కీపర్ కేరీకి అతను క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ విల్సన్ స్పందించకపోవడంతో ఆసీస్ రివ్యూ కోరింది. ఇదే చివరకు చర్చకు దారి తీసింది. వరుస రీప్లేల తర్వాత స్పష్టత రాకపోగా, ‘స్నికో’లో కూడా ఏదీ తేలలేదు. ఇక్కడా బంతి బ్యాట్‌ను తాకినట్లుగా కనిపించలేదు. అయితే ముందు భాగంనుంచి చూసిన రీప్లేలో బంతి బ్యాట్‌ను దాటిన తర్వాత దిశను మార్చుకున్నట్లుగా కనిపించింది. దీని ఆధారంగానే అది బ్యాట్‌కు తగిలిందని చెబుతూ థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ‘అవుట్’గా ప్రకటించడంతో జైస్వాల్ నిరాశగా మైదానం వీడాడు. అయితే ‘స్నికో’ను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ప్రశి్నంచిన సునీల్ గావస్కర్... ఇక సాంకేతికత ఎందుకని, కొన్నిసార్లు బ్యాట్‌కు తగలకపోయినా బంతి దిశ మార్చుకోవడం సహజమని విమర్శించాడు. మరోవైపు మాజీ అంపైర్ సైమన్ టఫెల్ కూడా ఇది ‘అవుట్’ అని నిర్ధారించాడు. అంపైరింగ్ ప్రొటోకాల్ ప్రకారం బంతి దిశ మార్చుకున్నట్లు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత కెపె్టన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ బ్యాట్‌కి బంతి తాకిందని, అతను అవుట్ అని తేల్చి వివాదానికి ముగింపు పలకడం గమనార్హం. -
India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ!
షార్జా: భారత మహిళల ముందున్న లక్ష్యం 152...అసాధ్యమేమీ కాదు కానీ 47 పరుగులకే టాపార్డర్ అవుట్! ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (47 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), దీప్తిశర్మ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) భాగస్వామ్యం ఆశలు రేపింది. 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి అవుటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 40; 5 ఫోర్లు), కెపె్టన్ తాహ్లియా మెక్‌గ్రాత్ (26 బంతుల్లో 32; 4 ఫోర్లు), ఎలైస్ పెరీ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రాణించిన గ్రేస్ హారిస్ భారత సీమర్ రేణుక ఆరంభ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 17 పరుగుల వద్దే వరుస బంతుల్లో బెత్ మూని (2), జార్జియా (0) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ గ్రేస్ హారిస్, కెపె్టన్ తాహ్లియా కుదురుగా ఆడటంతో 10 ఓవర్లలో జట్టు 65/2 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్నర్ (6) విఫలం కాగా, ఎలైస్ పెరీ ధాటిగా ఆడింది.హర్మన్ పోరాడినా... షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (16) విఫలం అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ నడిపించారు. జట్టు స్కోరును 15.1 ఓవర్లలో వందకు చేర్చారు. అయితే భారీ షాట్‌కు యతి్నంచిన దీప్తిశర్మ బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా...4 పరుగుల చేసిన భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. పాక్ గెలిస్తేనే... ‘ఎ’ గ్రూప్ నుంచి ఆసీస్ సెమీస్ చేరగా...భారత్, కివీస్ మధ్య రెండో స్థానం కోసం పోటీ ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో ఆ జట్టుకు ముందుకు వెళ్లి భారత్ ని్రష్కమిస్తుంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత కూడా భారత్ రన్‌రేట్ కివీస్కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్ చేతిలో ఆ జట్టు ఓడిపోతే చాలు. అయితే బలహీనమైన పాక్‌పై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: హారిస్ (సి) స్మృతి (బి) దీప్తిశర్మ 40; బెత్ మూని (సి) రాధ (బి) రేణుక 2; జార్జియా (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 0; తాహ్లియా (స్టంప్డ్) రిచా (బి) రాధ 32; పెర్రీ (సి) సబ్–సజన (బి) దీప్తిశర్మ 32; ఆష్లే గార్డ్నెర్ (సి) రాధ (బి) పూజ 6; లిచ్‌ఫీల్డ్ నాటౌట్ 15; అనాబెల్ (బి) శ్రేయాంక 10; సోఫీ రనౌట్ 0; మేగన్ షట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–17, 2–17, 3–79, 4–92, 5–101, 6–134, 7–145, 8–145. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, శ్రేయాంక 4–0–32–1, పూజ వస్త్రకర్ 3–0–22–1, అరుంధతీ రెడ్డి 3–0–24–0, దీప్తిశర్మ 4–0–28–2, రాధా యాదవ్ 2–0–14–1. భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) అనాబెల్ (బి) ఆష్లే గార్డ్నర్ 20; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) సోఫి 6; జెమీమా (సి) గార్డ్నర్ (బి) మేగన్ షటల్ 16; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 54; దీప్తిశర్మ (సి) జార్జియా (బి) సోఫీ 29; రిచా ఘోష్ రనౌట్ 1; పూజ (బి) అనాబెల్ 9; అరుంధతి రనౌట్ 0; శ్రేయాంక రనౌట్ 0; రాధ (ఎల్బీడబ్ల్యూ) (బి) అనాబెల్ 0; రేణుక నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–26, 2–39, 3–47, 4–110, 5–111, 6–139, 7–139, 8–141, 9–141. బౌలింగ్: మేగన్ షట్ 4–0–25–1, ఆష్లే గార్డ్నర్ 4–0–32–1, అనాబెల్ 4–0–22–2, సోఫి మోలినెక్స్ 4–0–32–2, జార్జియా 3–0–22–0, డార్సిబ్రౌన్ 1–0–8–0. -
Intercontinental Cup football 2024: టీమిండియాకు ‘సున్నా’
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు. సమష్టి వైఫల్యం... ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది. తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది. -
గెలుపు మలుపు విండీస్‌దే
ప్రావిడెన్స్ (గయానా): బ్యాటింగ్‌లో తిలక్‌వర్మ (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) ప్రతాపం చూపినా, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/35) నిప్పులు చెరిగినా, చహల్ (2/19) స్పిన్‌తో తిప్పినా... భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆదివారం రెండో టి20లో విండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే పాండ్యా ప్రత్యర్థిని దెబ్బ తీసినా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలుపుబాట వేశాడు. రేపు మూడో టి20 కూడా ఇదే వేదికపై జరుగుతుంది. తిలక్ ఫిఫ్టీతో... అరంగేట్రం చేసిన తొలి టి20లోనే ఆకట్టుకున్న హైదరాబాద్ యువ సంచలనం ఠాకూర్ తిలక్‌వర్మ ఈ రెండో మ్యాచ్‌లో అయితే భారత జట్టును ఆదుకున్నాడు. 18 పరుగులకే భారత్ కీలకమైన శుబ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ (1) వికెట్లను కోల్పోగా, కాసేపటికే ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (7)లు వికెట్లను పారేసుకున్నాడు. ఈ దశలో తిలక్ తనశైలి స్కూప్, స్వీప్ షాట్లతో మైదానంతా ఫీల్డర్లను పరుగు పెట్టించాడు. కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోరుబోర్డులో వేగం పెంచిన వర్మ 39 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 24; 2 సిక్సర్లు) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో దంచికొట్టే బ్యాటరే కరువయ్యాడు. భారీషాట్లు బాదే అక్షర్ (14) ఆట కూడా ఎంతోసేపు నిలువలేదు. దీంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పూరన్ ధనాధన్ లక్ష్యఛేదన మొదలు పెట్టగానే పాండ్యా వికెట్ల భరతం పట్టడంతో తొలి ఓవర్లోనే కింగ్ (0), చార్లెస్ (2) వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాలపాలైంది. మేయర్స్ (15)ను అర్ష్ దీప్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం కానీ... తర్వాత పూరన్ ఉత్పాతంలా వచ్చిపడ్డాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో బంతుల అంతరాన్ని అమాంతం తగ్గించేశాడు. 126/4 స్కోరు వద్ద గెలుపుబాటలో కనిపించింది. కానీ ఆ స్కోరువద్దే పూరన్ జోరుకు ముకేశ్ కళ్లెం వేశాడు. ఈ దశలో చహల్ స్పిన్ మ్యాజిక్‌తో హెట్‌మైర్ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), హోల్డర్ (0)లను అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం భారత్‌వైపు మలుపు తిరిగేలా కనిపించింది. కానీ హోసీన్ (16 నాటౌట్; 2 ఫోర్లు), జోసెఫ్ (10 నాటౌట్; 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 26 పరుగులు జోడించి టీమిండియాకు గెలుపు అవకాశమివ్వకుండా ఇంకా 7 బంతులు మిగిలుండగానే విండీస్‌ను విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) షెఫర్డ్ 27; గిల్ (సి) హెట్‌మైర్ (బి) జోసెఫ్ 7; సూర్యకుమార్ (రనౌట్) 1; తిలక్ వర్మ (సి) మెకాయ్ (బి) హోసీన్ 51; సంజూ సామ్సన్ (స్టంప్డ్) పూరన్ (బి) హోసీన్ 7; పాండ్యా (బి) జోసెఫ్ 24; అక్షర్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 14; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–16, 2–18, 3–60, 4–76, 5–114, 6–129, 7–139. బౌలింగ్: మెకాయ్ 4–0–25–0, హోసీన్ 4–0–29–2, జోసెఫ్ 4–0–28–2, హోల్డర్ 4–0–29–0, షెఫర్డ్ 3–0–28–2, మేయర్స్ 1–0–12–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 0; మేయర్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 15; చార్లెస్ (సి) తిలక్ వర్మ (బి) పాండ్యా 2; పూరన్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 67; పావెల్ (సి) ముకేశ్ (బి) పాండ్యా 21; హెట్‌మైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; షెఫర్డ్ (రనౌట్) 0; హోల్డర్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చహల్ 0; హోసీన్ (నాటౌట్) 16; జోసెఫ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.5 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–32, 4–89, 5–126, 6–128, 7–128, 8–129. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–35–3 అర్ష్ దీప్ 4–0–34–1, ముకేశ్ 3.5–0–35–1, బిష్ణోయ్ 4–0–31–0, చహల్ 3–0–19–12. -
IND vs AUS 2nd ODI 2023: ఆసీస్ పేస్‌కు భారత్ బోల్తా
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం... తీరా మ్యాచ్ సమయానికి వరుణుడు కూడా కరుణించడంతో ... నిర్ణీత సమయానికే ఆట ప్రారంభం... ఇక పరుగుల విందు ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా... పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్టార్క్ స్వింగ్ బౌలింగ్‌కు భారత స్టార్ బ్యాటర్లు గిల్, రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టి 11 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు. సాక్షి, విశాఖపట్నం: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఎలిస్ (2/13) తమ స్వింగ్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ కొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (35 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా... రోహిత్ శర్మ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16; 1 ఫోర్), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అలరించారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా... సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరుగుతుంది. సూర్యకుమార్ మళ్లీ విఫలం... బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడ్డారు. పిచ్‌పై ఉన్న తేమను ఆసీస్ పేసర్ స్టార్క్ సద్వినియోగం చేసుకున్నాడు. స్వింగ్‌తోపాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. స్టార్క్ బౌలింగ్‌లో గిల్, రోహిత్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడి అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్, కోహ్లి, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయారు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా (1) షాట్ ఆడతా... స్టీవ్ స్మిత్ స్లిప్‌లో తన కుడి వైపునకు గాల్లో అమాంతం డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ధనాధన్ ఆట... స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్, మార్ష్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా మార్ష్ చెలరేగిపోయాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టగా... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అనంతరం హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మార్ష్ 3 సిక్స్‌లతో అలరించాడు. దాంతో ఆసీస్ 8 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించి ఆసీస్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; శుబ్‌మన్ గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 9; హార్దిక్ పాండ్యా (సి) స్మిత్ (బి) అబాట్ 1; రవీంద్ర జడేజా (సి) క్యారీ (బి) ఎలిస్ 16; అక్షర్ పటేల్ (నాటౌట్) 29; కుల్దీప్ యాదవ్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (26 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–3, 2–32, 3–32, 4–48, 5–49, 6–71, 7–91, 8–103, 9–103, 10–117. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–1–53–5, కామెరాన్ గ్రీన్ 5–0–20–0, సీన్ అబాట్ 6–0–23–3, నాథన్ ఎలిస్ 5–0–13–2, ఆడమ్ జంపా 2–0–6–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (నాటౌట్) 51; మిచెల్ మార్‡్ష (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121. బౌలింగ్: షమీ 3–0–29–0, సిరాజ్ 3–0–37–0, అక్షర్ పటేల్ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కుల్దీప్ యాదవ్ 1–0–12–0. -
Womens T20 World Cup 2023: రేణుక, స్మృతి మెరుపులు వృథా
కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్‌ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్‌ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్‌స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147. బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్‌ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్‌స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119. బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్‌స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0. -
Hockey World Cup 2023: హతవిధి!.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా
మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 26న జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది. న్యూజిలాండ్‌తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్‌నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10 పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. హోరాహోరీ షూటౌట్... నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్లో గోల్ చేస్తే భారత్‌కు విజయం దక్కేది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్‌కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్లో భారత ప్లేయర్ సుఖ్జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి. -
T20 World Cup 2022: ఈసారీ ఫ్లాప్ షో
ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశకే పరిమితమైన జట్టు ఆ నిరాశను దూరం చేస్తూ ఈసారి అత్యధిక విజయాలతో సెమీస్ చేరడంతో కొత్తగా ఆశలు చిగురించాయి. అయితే ఇంగ్లండ్ అద్భుత బ్యాటింగ్‌తో వాటిని తుంచేసింది. ఇప్పటి వరకు మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు చూస్తే సెమీస్‌లోనూ విజయం సులువనిపించింది. కానీ బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించలేక సగం ఆట ముగిసే సరికే వెనకడుగు వేసిన టీమిండియా... బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఓపెనర్లు చెలరేగుతుంటే ఏం చేయాలో కెప్టెన్ సహా ఆటగాళ్లు బిక్కమొహం వేశారు! టాస్ ఓడిపోవటం మొదలు ఏదీ భారత్‌కు అనుకూలంగా సాగలేదు. ఓపెనర్ల వైఫల్యం ఇక్కడా కొనసాగగా, మరోసారి ఆదుకోవాల్సిన భారం కోహ్లిపై పడింది. పరిస్థితిని బట్టి అతను కూడా కాస్త తగ్గి ఆడాల్సి రాగా, 360 డిగ్రీ సూర్యకుమార్‌ను సరైన వ్యూహంతో ఇంగ్లండ్ కట్టిపడేసింది. అంతా చేయిదాటిపోతున్న దశలో హార్దిక్ చెలరేగడంతో కీలక పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఛేదన ఇంత సులువా అనిపించేలా హేల్స్, బట్లర్ ఎవరినీ లెక్క చేయకుండా మన బౌలర్లందరిపై విరుచుకుపడ్డారు. ఫలితమే టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యం... ఆపై టీమిండియా ఓటమి ఖాయం. టోర్నీ తొలి విజేత తర్వాతి ఏడు ప్రయత్నాల్లోనూ రిక్తహస్తాలతో ఇంటికి..! అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. సెమీస్‌లో సత్తా చాటి ఎంసీజీలో మరోసారి పాకిస్తాన్‌ను ఢీకొడుతుందని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఫైనల్ సాధ్యమవుతుందని భావించిన వారందరికీ ఇంగ్లండ్ బలమైన షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లి (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) మరో అర్ధసెంచరీ సాధించాడు. జోర్డాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), కెప్టెన్ జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం మెల్బోర్న్లో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలోనే ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడగా పాక్ గెలిచింది. సూర్యకుమార్ విఫలం... ఈ నాకౌట్ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో భారత్ స్కోరు 62/2 మాత్రమే! ఈ అతి జాగ్రత్తే చివరకు జట్టు కొంప ముంచింది. చివర్లో హార్దిక్ జోరుతో కొన్ని పరుగులు వేగంగా వచ్చినా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తగినంత స్కోరు చేయలేక టీమిండియా భంగపడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) మరో కీలక పోరులోనూ పేలవ ప్రదర్శన కనబర్చగా, రోహిత్ శర్మ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు. రోహిత్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ (10 బంతుల్లో 14) వరుస బంతుల్లో 6, 4 కొట్టి తన శైలిని ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాతి బంతికే రషీద్ అతని ఆటను ముగించడంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగి లింది. ఫలితంగా కోహ్లి కూడా ఆత్మరక్షణలో పడి ధాటిని ప్రదర్శించలేకపోయాడు. 16 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 110 పరుగులకు చేరింది. 4 ఓవర్లలో 58 పరుగులు... భారత జట్టు చివరకు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందంటే హార్దిక్ బ్యాటింగే కారణం. చివరి 4 ఓవర్లలో భారత్ 58 పరుగులు సాధిస్తే అందులో హార్దిక్ ఒక్కడే 50 కొట్టాడు! 18 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను, స్యామ్ కరన్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. మరో ఎండ్‌లో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరగ్గా, పంత్ (6) రనౌటయ్యాడు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కూడా వరుసగా 6, 4 కొట్టాక వెనక్కి జరిగి మరో భారీ షాట్ ఆడే క్రమంలో ఆఖరి బంతికి హార్దిక్ అవుటయ్యాడు. బంతి బౌండరీని దాటినా, షాట్ ఆడే సమయంలో అతని కాలు స్టంప్స్‌ను తాకింది. ఎదురులేని బ్యాటింగ్... ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించే వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి వరకు దానిని కొనసాగించింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఓపెనింగ్ జోడీనే విడదీయలేకపోయారు. ఈ మ్యాచ్‌కు ముందు భువనేశ్వర్ బౌలింగ్‌లో చెత్త రికార్డు (32 బంతుల్లో 5 సార్లు అవుట్) ఉన్న బట్లర్ ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. భువీ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు బాది అతను తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్‌తో) సాధించింది. ఆ తర్వాత మరింత జోరుగా లక్ష్యం దిశగా జట్టు దూసుకుపోయింది. 28 బంతుల్లోనే హేల్స్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 61 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. అశ్విన్ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టగా, హార్దిక్ ఓవర్లో 6, 4 బాది బట్లర్ 36 బంతుల్లో తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత షమీ ఓవర్లో బట్లర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. షమీ తర్వాతి ఓవర్ ఆఖరి బంతికి లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌తో హేల్స్ ఆట ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వోక్స్ 5; రోహిత్ (సి) కరన్ (బి) జోర్డాన్ 27; కోహ్లి (సి) రషీద్ (బి) జోర్డాన్ 50; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రషీద్ 14; హార్దిక్ (హిట్‌వికెట్) (బి) జోర్డాన్ 63; పంత్ (రనౌట్) 6; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–56, 3–75, 4–136, 5–158, 6–168. బౌలింగ్: స్టోక్స్ 2–0–18–0, వోక్స్ 3–0–24–1, స్యామ్ కరన్ 4–0–42–0, రషీద్ 4–0–20–1, లివింగ్‌స్టోన్ 3–0–21–0, జోర్డాన్ 4–0–43–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బట్లర్ (నాటౌట్) 80; హేల్స్ (నాటౌట్) 86; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 170. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–25–0, అర్‡్షదీప్ 2–0–15–0, అక్షర్ 4–0–30–0, షమీ 3–0–39–0, అశ్విన్ 2–0–27–0, హార్దిక్ 3–0–34–0. ఈ రోజు మా ఆటతో చాలా నిరాశ చెందాను. మేం బ్యాటింగ్ బాగానే చేశామని భావిస్తున్నా. బౌలింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం. 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యం ఛేదించేంత సులువైన పిచ్ ఏమీ కాదిది. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ముఖ్యం. ఇది ఎలా చేయాలో ఎవరూ నేర్పించరు. అది వ్యక్తిగతంగా చేయాల్సిన పని. ఐపీఎల్లో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లలో వారంతా ఒత్తిడిని అధిగమించినవారే. మా బౌలింగ్‌కు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లో బంతి కొంత స్వింగ్ అయినా అది సరైన దిశలో వెళ్లలేదు. మైదానం కొలతలపై మాకు అవగాహన ఉంది. వికెట్‌కు ఇరువైపులా పరుగులు ఆపేందుకు వ్యూహాలు రూపొందించినా ఇంగ్లండ్ ఓపెనర్లు భారీగా పరుగులు రాబట్టగలిగారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 170: టి20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం. 1: టి20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఒక జట్టు 10: వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి. 2:టి20 ప్రపంచకప్‌లో (2021లో పాక్ చేతిలో) రెండుసార్లు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఏకైక జట్టు భారత్. 4008: అంతర్జాతీయ టి20ల్లో కోహ్లి పరుగులు. 4 వేల పరుగులు దాటిన తొలి ఆటగాడిగా కోహ్లి. -
మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
బౌన్స్...బౌన్స్...బౌన్స్... మాకెవరికీ పడదు, మేం ఆడలేం... కానీ బౌన్స్ మాత్రం మమ్మల్ని వదల్లేదు... మా వెంట పడి మరీ వేటాడింది... పెర్త్‌లో తమ ఆట తర్వాత భారత క్రికెటర్లు మనసులో ఇలాగే అనుకొని ఉంటారు. ఊహించిన విధంగానే ఆప్టస్ స్టేడియంలో బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగిపోయారు... అన్నీ తెలిసినా మేం మాత్రం దానికి సిద్ధంగా లేము అన్నట్లుగా భారత బ్యాటర్లు ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్, కార్తీక్, అశ్విన్... ఐదుగురూ ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పుల్ షాట్ ఆడబోయి విఫలం కాగా, కేఎల్ రాహుల్ అదే తరహా అనూహ్య బౌన్స్‌కు వెనుదిరిగాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 50 షార్ట్ బంతులు వేసిన ప్రత్యర్థి బౌలర్లు ఈ ఆరు వికెట్లతో పండగ చేసుకున్నారు. ఒకదశలో స్కోరు 49/5... 100 కూడా చేయడం కష్టమనిపించించిది. అయితే సూర్యకుమార్ మాత్రం పిచ్‌ను పట్టించుకోను అనే రీతిలో కొన్ని చక్కటి షాట్లతో అర్ధసెంచరీ చేసి ఆదుకోవడంతో భారత్ పరువు కొంత దక్కింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. మన పేసర్లూ మెరిసినా... 134 పరుగుల లక్ష్యం మరీ చిన్నదైపోయింది. మిల్లర్, మార్క్రమ్ బాధ్యతాయుత బ్యాటింగ్ సఫారీ టీమ్‌ను ఆదుకుంది. ఫలితంగా రెండు వరుస విజయాల తర్వాత రోహిత్ బృందం తొలి పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పటిష్ట జట్టుపై నెగ్గి దక్షిణాఫ్రికా గ్రూప్–2లో అగ్రస్థానానికి చేరింది. పెర్త్: టి20 ప్రపంచకప్ గ్రూప్–2లో బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు టీమిండియా తలవంచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లుంగి ఇన్‌గిడి (4/29) భారత టాపార్డర్‌ను కుప్పకూల్చగా, పార్నెల్ (3/15) కూడా రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు సాధించి గెలిచింది. డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్రమ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 76 పరుగులు జోడించారు. అర్‡్షదీప్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. టపటపా... పెర్త్ పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత తొలి తొమ్మిది బంతుల్లో భారత్ ఒక్క పరుగు కూడా తీయలేకపోవడం ప్రమాద హెచ్చరికను చూపించింది! గతంలో మొదటి పరుగు సాధించేందుకు భారత్ ఎప్పుడూ 10 బంతులు తీసుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) సిక్సర్లతోనే తమ ఖాతాలు తెరిచినా ఆ జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపించగా, కోహ్లి (12) అరుదైన వైఫల్యం భారత్ కష్టాలు పెంచింది. తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతున్న దీపక్ హుడా (0) డకౌట్ కాగా, రబడ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ పాండ్యా (2) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జట్టును రక్షించే బాధ్యతను సూర్యకుమార్ తీసుకున్నాడు. ఒకే ఒక్కడు... 9 ఓవర్లోలోపే భారత్ ఐదో వికెట్ కోల్పోయిన సమయంలో మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ స్కోరు 7 పరుగులు. ఇలాంటి స్థితి నుంచి అతను అద్భుత బ్యాటింగ్‌తో జట్టును 100 పరుగులు దాటించడంతో పాటు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించగలిగాడు. నోర్జే 143 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని లెగ్‌సైడ్ ఫ్లిక్‌తో సిక్సర్‌గా మలచిన తీరు సూర్య బ్యాటింగ్ ప్రత్యేకతను చూపించింది. మహరాజ్ బౌలింగ్‌లోనూ మరో సిక్సర్‌తో అతను తన ధాటిని కొనసాగించాడు. అప్పటి వరకు భారత్‌ను బెంబేలెత్తించిన ఇన్‌గిడి ఓవర్లోనే సిక్స్, ఫోర్ బాది 30 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. దినేశ్ కార్తీక్ (6)తో ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించగా అందులో 44 సూర్యవే ఉన్నాయి. ఆ తర్వాతా మరో మూడు ఫోర్లు బాదిన తర్వాత పార్నెల్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. కీలక భాగస్వామ్యం... ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. 24 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే డి కాక్ (1), రోసో (0), బవుమా (10) వెనుదిరిగారు. అర్‡్షదీప్ తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయగా, సఫారీ కెప్టెన్‌ను షమీ అవుట్ చేశాడు. ఇలాంటి దశలో మార్క్రమ్, మిల్లర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జట్టుకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. 35 పరుగుల వద్ద మార్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి వదిలేయగా... 15 పరుగుల వద్ద ఉన్న మిల్లర్‌ను దగ్గరి నుంచి అండర్‌ఆర్మ్ త్రోతో రనౌట్ చేసే అతి సునాయాస అవకాశాన్ని రోహిత్ చేజార్చాడు. 7 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు చెరో సిక్స్ బాది జట్టుపై ఒత్తిడి తగ్గించారు. తక్కువ వ్యవధిలో మార్క్రమ్, స్టబ్స్ (6) వెనుదిరిగినా, పట్టుదలగా చివరి వరకు నిలిచి మిల్లర్ పని పూర్తి చేశాడు. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, భువీ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లతో మ్యాచ్ ముగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 9.4 ఓవర్లలో 97 పరుగులు చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 9; రోహిత్ (సి అండ్ బి) ఇన్‌గిడి 15; కోహ్లి (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; సూర్యకుమార్ (సి) మహరాజ్ (బి) పార్నెల్ 68; హుడా (సి) డికాక్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 2; కార్తీక్ (సి) రోసో (బి) పార్నెల్ 6; అశ్విన్ (సి) రబడ (బి) పార్నెల్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 4; షమీ (రనౌట్) 0; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–23, 2–26, 3–41, 4–42, 5–49, 6–101, 7–124, 8–127, 9–130. బౌలింగ్: పార్నెల్ 4–1–15–3, రబడ 4–0–26–0, ఇన్‌గిడి 4–0–29–4, నోర్జే 4–0–23–1, మహరాజ్ 3–0–28–0, మార్క్రమ్ 1–0–5–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 1; బవుమా (సి) కార్తీక్ (బి) షమీ 10; రోసో (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (సి) సూర్య (బి) హార్దిక్ 52; మిల్లర్ (నాటౌట్) 59; స్టబ్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; పార్నెల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–24, 4–100, 5–122. బౌలింగ్: భువనేశ్వర్ 3.4–0–21–0, అర్‡్షదీప్ 4–0–25–2, షమీ 4–0–13–1, హార్దిక్ 4–0–29–1, అశ్విన్ 4–0–43–1. -
T20 World Cup: ఓటమితో ముగిసిన ‘సాధన’
పెర్త్: టి20 ప్రపంచకప్ అధికారిక వామప్ మ్యాచ్‌లకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు గురువారం అదే జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. బౌన్సీ పిచ్ ఉండే ‘వాకా’ మైదానంలో పెర్త్ పేస్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (41 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా (17), దినేశ్ కార్తీక్ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అయితే టీమిండియా టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. రోహిత్, సూర్య గత మ్యాచ్‌లో ఆడగా, కోహ్లి రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం స్థానిక అభిమానులను నిరాశపర్చింది. అయితే మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ ఫీల్డింగ్‌లో మాత్రం మైదానమంతటా చురుగ్గా వ్యవహరించారు. పెర్త్నుంచి బ్రిస్బేన్ చేరుకునే భారత జట్టు ఈ నెల 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌లలో తలపడుతుంది. 23న తమ తొలి పోరు లో పాకిస్తాన్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. -
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
Davis Cup 2022: తొలి సింగిల్స్‌లో ప్రజ్నేశ్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. యూఎస్ ఓపెన్ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 335వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్ విక్టర్ దురాసోవిచ్, రామ్‌కుమార్ రామనాథన్ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్ మ్యాచ్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
IND W vs ENG W 3rd T20: మళ్లీ ఓడిన మన మహిళలు
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన హర్మన్ బృందానికి ఓటమిని అందించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 9.5 ఓవర్లకే షఫాలీ (5), స్మృతి (9), మేఘన (0), హేమలత (0), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (5) వెనుదిరగ్గా... 52 పరుగుల వద్ద స్నేహ్ రాణా (8) వికెట్ పడింది. ఈ దశలో రిచా ఘోష్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు), దీప్తి శర్మ (25 బంతుల్లో 24) ఆదుకోవడంతో స్కోరు 100 పరుగులు దాటగలిగింది. చివర్లో పూజ వస్త్రకర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) కూడా కొన్ని పరుగులు జోడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (3/25) భారత్‌ను దెబ్బ తీయగా, సారా గ్లెన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు సాధించి గెలిచింది. సోఫియా డంక్లీ (44 బంతుల్లో 49; 6 ఫోర్లు), అలైస్ క్యాప్సీ (24 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, డానీ వ్యాట్ (22; 1 ఫోర్) రాణించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హోవ్‌లో తొలి వన్డే జరుగుతుంది. -
Asia Cup 2022: భారత్ కథ ముగిసె!
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్‌కు ఊహించని షాక్! అభిమానుల గుండె పగిలె ఫలితం శ్రీలంక చేతిలోనూ ఎదురైంది. సూపర్ –4లో వరుసగా రెండో ఓటమి. దీంతో ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. మదుషంక 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. నిసాంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన షనకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్‌కు భిన్నంగా ఆట మొదలైంది. పాక్‌పై ధాటిగా ఆరంభమైన ఓపెనింగ్ మెరుపులు... శ్రీలంకపై కరువయ్యాయి. ఓపెనర్ రాహుల్ (6) రెండో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరుసటి ఓవర్లోనే కోహ్లి (0) డకౌటయ్యాడు. 13 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రోహిత్ బాధ్యతగా నడిపించాడు. అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టి రన్‌రేట్ పెంచాడు. మళ్లీ తనే వేసిన పదో ఓవర్లో మరో సిక్సర్, బౌండరీతో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 79/2. సగం ఓవర్లు అయిపోవడంతో ‘హిట్‌మ్యాన్’ ధాటిని మరింత పెంచాడు. కానీ ఆ క్రమంలోనే వెనుదిరిగాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. మరుసటి ఓవర్లో కరుణరత్నే స్లో డెలివరీతో రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి సూర్యకుమార్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్)ను స్లో బౌన్సర్‌తో షనక పెవిలియన్ చేర్చాడు. పాండ్యా (17), పంత్ (17) పెద్దగా మెరిపించలేదు. అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) చేసిన ఆ కాస్త పరుగులతోనే కష్టంగా 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెలరేగిన ఓపెనర్లు లంక ఛేదన తొలి ఓవర్లో కేవలం పరుగుతో మొదలైంది. తర్వాత ఓవర్ నుంచి ఫోర్లతో, అటు నుంచి సిక్సర్లతో చకచకా సాగిపోయింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ల జోరుతో అర్‡్షదీప్ తేలిపోయాడు. ఐదో ఓవర్లో అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంక 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్లు... మొత్తంగా సగం ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. అవతలివైపు ఓపెనర్లే లక్ష్యంలో సగం స్కోరును (10 ఓవర్లలో 89/0) దాటేశారు. 12వ ఓవర్ వేసిన చహల్ నిసాంకతో పాటు అసలంక (0)ను పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో గుణతిలక (1)ను అశ్విన్, కుశాల్ మెండిస్‌ను చహల్ అవుట్ చేయడంతో 110 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరం ఆనందంలో తేలియాడింది. కానీ రాజపక్స వచ్చీ రాగానే స్పిన్నర్లిదరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. తర్వాత కెప్టెన్ షనక కూడా జాగ్రత్తగా ఆడటంతో లక్ష్యానికి చేరువైంది. ఆఖరి అవకాశాన్ని కూడా కీపర్ పంత్, బౌలర్ అర్‡్షదీప్ చేజార్చడంతో లంక మరో బంతి ఉండగానే గెలిచింది. 2 బంతుల్లో 2 పరుగుల సమీకరణం వద్ద ఐదో బంతిని షనక బీట్ అయ్యాడు. పంత్ వికెట్లపై విసరగా తగలకుండా బంతి బౌలర్ అర్‡్షదీప్ చేతుల్లో పడింది. తను పరుగెత్తుకుంటూ వికెట్లను కొట్టకుండా బలంగా విసరడంతో అవుట్ కావాల్సిన చోట ఓవర్‌త్రోతో 2 పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 6; రోహిత్ (సి) నిసాంక (బి) కరుణరత్నే 72; కోహ్లి (బి) మదుషంక 0; సూర్యకుమార్ (సి) తీక్షణ (బి) షనక 34; పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17; పంత్ (సి) నిసాంక (బి) మదుషంక 17; దీపక్ హుడా (బి) మదుషంక 3; అశ్వి న్ (నాటౌట్) 15; భువనేశ్వర్ (బి) కరుణరత్నే 0; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–11, 2–13, 3–110, 4–119, 5–149, 6–157, 7–158, 8–164. బౌలింగ్: మదుషంక 4–0–24–3, మహీశ్ తీక్షణ 4–0–29–1, చమిక 4–0–27–2, అసిత ఫెర్నాండో 2–0–28–0, హసరంగ 4–0–39–0, షనక 2–0–26–2. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రోహిత్ (బి) చహల్ 52; కుశాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 57; అసలంక (సి) సూర్యకుమార్ (బి) చహల్ 0; గుణతిలక (సి) రాహుల్ (బి) అశ్విన్ 1; రాజపక్స (నాటౌట్) 25; షనక (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–97, 2–97, 3–110, 4–110. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–0, అర్‡్షదీప్ 3.5–0–40–0, పాండ్యా 4–0–35–0, చహల్ 4–0–34–3, అశ్విన్ 4–0–32–1. భారత్ ఫైనల్ చేరాలంటే... నేడు జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ కూడా విజయం సాధించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా శ్రీలంక తప్పనిసరిగా నెగ్గాలి. ఇలా జరిగితే శ్రీలంక ఫైనల్ చేరుతుంది. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ మూడు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఒకవేళ నేడు అఫ్గానిస్తాన్‌పై గెలిస్తే పాకిస్తాన్ ఫైనల్లోకి అడుగు పెడుతుంది. పాక్ , భారత్‌లపై అఫ్గానిస్తాన్ గెలిచి... లంకపై పాకిస్తాన్ నెగ్గితే... పాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. -
Asia Cup 2022: మన పోరాటం సరిపోలేదు
టీమిండియా మంచి స్కోరే చేసింది. తన పనైపోయిందనుకున్న విమర్శకుల నోళ్లను కోహ్లి బ్యాట్‌తో, చిరుతను తలపించే పరుగుతో మూయించాడు. 182 పరుగుల లక్ష్యం పాక్‌కు కష్టమైందే. కానీ ప్రధాన బౌలర్లు భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, చహల్ ముగ్గురు 40 పైచిలుకు పరుగులు సమర్పించుకోవడం, 18వ ఓవర్లో, పట్టుబిగించే దశలో ఆసిఫ్ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ నేలపాలు చేయడం, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ వైడ్లకు గేట్లు ఎత్తేయడంతో టీమిండియా మ్యాచ్‌నే మూల్యంగా చెల్లించుకుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ జోరుకు ‘సూపర్–4’లో పాకిస్తాన్ కళ్లెం వేసింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యం నిర్దేశించినా... పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌తో రోహిత్ శర్మ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం. రేపు సూపర్–4 రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్ గెలవాల్సి ఉంటుంది. ధనాధన్‌గా మొదలై... టి20 మెరుపులకు తగ్గట్లే దాటిగా భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ కవర్స్‌లో ఫోర్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇదే జోరుతో ‘హిట్‌మ్యాన్’ రెండో ఓవర్లో మరో బౌండరీని మిడాఫ్ దిశగా తరలించాడు. ఇక మూడో ఓవర్లో రాహుల్ ఆట మొదలైంది. తొలి బంతిని చక్కని డ్రైవ్‌తో లాంగాఫ్‌లో సిక్స్ కొట్టిన తను ఆఖరి బంతిని నేరుగా బౌలర్ ఎండ్‌లోని సైట్ స్క్రీన్కు ముద్దాడించాడు. 3 ఓవర్లలో 34/0 స్కోరు... వెంటనే రవూఫ్‌ను రంగంలోకి దించితే తొలి రెండు బంతుల్ని రోహిత్ 4, 6గా మళ్లీ బౌండరీ లైన్‌ను దాటించాడు. ఐదో ఓవర్ రెండో బంతిని రాహుల్ ఫోర్ కొట్టడంతో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. దెబ్బ మీద దెబ్బ ఐదు ఓవర్ల దాకా 54/0 స్కోరుతో బాగానే ఉంది. పవర్ ప్లేకు ఇంకో ఓవర్ మిగిలుంది. ఇంకేం మన ఓపెనర్లు ఇంకో రెండు మూడైనా తగిలిస్తారనుకుంటే రవూఫ్ తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 6వ)లో గట్టి దెబ్బే తీశాడు. రోహిత్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీషాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతికాస్తా బ్యాట్ అంచును తాకి అక్కడే గాల్లోకి లేచింది. ఫఖర్ జమాన్, ఖుష్దిల్ల మధ్య క్యాచ్ చేజారుతుందనుకుంటే... జమాన్ చేతులకి అందని బంతిని ఖుష్దిల్ చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. తర్వాత షాదాబ్ బౌలింగ్‌కు దిగిన తొలిబంతికే రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. లాంగాన్‌లో నవాజ్ క్యాచ్ అందుకోవడంతో 62 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. కోహ్లికి జతయిన సూర్యకుమార్ (13) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో భారత్ సగం ఓవర్లు ముగిసేసరికి 93/3 స్కోరు చేసింది. రాణించిన కోహ్లి తర్వాత క్రీజులోకి హార్డ్ హిట్టర్ రిషభ్ పంత్ (14) వచ్చినప్పటికీ స్కోరు, జోరు రెండూ తగ్గాయి. 11వ ఓవర్లో టీమిండియా 100 పరుగులు దాటింది. తన వికెట్ ప్రాధాన్యం దృష్ట్యా కోహ్లి చూసుకొని ఆడగా, పంత్ కాస్త ఆలస్యంగా తానెదుర్కొన్న 8వ బంతికి ఫోర్ కొట్టాడు. మరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టిన పంత్ అత్యుత్సాహానికి పోయి మూల్యం చెల్లించుకున్నాడు. షాదాబ్ గూగ్లీని రివర్స్‌స్వీప్ ఆడి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఆసిఫ్ అలీ చేతుల్లో పెట్టాడు. ఆఖర్లో శివమెత్తే హార్దిక్ పాండ్యా (0) చెత్త షాట్ ఆడి డకౌటయ్యాడు. ఓ రకంగా స్లాగ్ ఓవర్లలో భారీషాట్లతో విరుచుకుపడే బ్యాటర్స్‌ను కోల్పోయిన భారత్‌ను కోహ్లి ఆదుకున్నాడు. దీపక్ హుడా (11 బంతుల్లో 16; 2 ఫోర్లు)తో కలిసి పటిష్టమైన స్కోరుకు బాటవేశాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలో వచ్చినవి 22 పరుగులే అయినా యువ ఆటగాళ్లకు కూడా సాధ్యంకానీ రీతిలో చకచకా సింగిల్స్, డబుల్స్ పిండుకున్నాడు. 36 బంతుల్లోనే (4ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేసిన కోహ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు. రవి బిష్ణోయ్ (2 బంతుల్లో 8 నాటౌట్;) చివరి 2 బంతుల్ని బౌండరీలకు తరలించాడు. పాక్ బౌలర్లు నసీమ్ షా, హస్నైన్, రవూఫ్, నవాజ్ తలా ఒక వికెట్ తీశారు. గెలిపించిన రిజ్వాన్ భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో పాక్ ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ ఆజమ్ (14) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఏడో ఓవర్లలో పాక్ 50 పరుగులను చేరుకుంది. 9వ ఓవర్లో చహల్... ఫఖర్‌ను పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 76/2 స్కోరు చేసింది. గెలిచేందుకు ఇంకా వందకు పైగా పరుగులు చేయాల్సిన స్థితి! అయితే 11వ ఓవర్ నుంచి 15వ ఓవర్‌దాకా పాక్ బ్యాటింగ్‌లో వేగం పుంజుకుంది. ఇటు రిజ్వాన్, అటు నవాజ్ చెలరేగడంతో ఈ ఐదు ఓవర్లలో 10 పరుగులకు తక్కువ కాకుండా ఓవరాల్‌గా 59 పరుగులు రావడమే జట్టును గెలుపు మలుపు తిప్పింది. రిజ్వాన్ 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. ఇక ఆఖరి 30 బంతుల్లో 47 పరుగుల సమీకరణం పాక్‌కే అనుకూలంగా మారింది. అయితే వరుస ఓవర్లలో దంచేస్తున్న నవాజ్‌ను భువీ, పాతుకుపోయిన రిజ్వాన్‌ను హార్దిక్ అవుట్ చేయడంతో ఆశలు రేగాయి. బిష్ణోయ్ 18వ ఓవర్లో ఏకంగా 3 వైడ్లు వేసి 8 పరుగులిచ్చాడు. అయినప్పటికీ 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం టీమిండియా విజయంపై ఆశల్ని పెంచింది. కానీ అనుభవజ్ఞుడైన భువీ కూడా 2 వైడ్లు వేసి సిక్స్, 2 బౌండరీలు సమర్పించుకోవడంతో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్లో ఆసిఫ్ అలీ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎల్బీగా వెనుదిరిగినా ఇంకో బంతి మిగిలుండగానే పాక్ గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నవాజ్ (బి) షాదాబ్ 28; రోహిత్ (సి) ఖుష్దిల్ (బి) రవూఫ్ 28; కోహ్లి (రనౌట్) 60; సూర్యకుమార్ (సి) ఆసిఫ్ అలీ (బి) నవాజ్ 13; పంత్ (సి) ఆసిఫ్ అలీ (బి) షాదాబ్ 14; పాండ్యా (సి) నవాజ్ (బి) హస్నైన్ 0; దీపక్ హుడా (సి) నవాజ్ (బి) నసీమ్ షా 16; భువనేశ్వర్ (నాటౌట్) 0; బిష్ణోయ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–54, 2–62, 3–91, 4–126, 5–131, 6–168, 7–173. బౌలింగ్: నసీమ్ షా 4–0–45–1, హస్నైన్ 4–0–38–1, రవూఫ్ 4–0–38–1, నవాజ్ 4–0–25–1, షాదాబ్ 4–0–31–2. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 71; బాబర్ ఆజమ్ (సి) రోహిత్ (బి) బిష్ణోయ్ 14; ఫఖర్ (సి) కోహ్లి (బి) చహల్ 15; నవాజ్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 42; ఖుష్దిల్ (నాటౌట్) 14; ఆసిఫ్ అలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్‌దీప్ 16; ఇఫ్తికార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–22, 2–63, 3–136, 4–147, 5–180. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–40–1; అర్ష్‌దీప్ 3.5–0–27–1, రవి బిష్ణోయ్ 4–0–26–1, పాండ్యా 4–0–44–1, చహల్ 4–0–43–1. -
IND vs ENG 2nd ODI: ‘టాప్’లీ లేపేశాడు...
లండన్: లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చహల్ (4/47) తిప్పేయగా, బుమ్రా, పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.జడేజా (29), హార్దిక్ పాండ్యా (29) టాప్స్కోరర్లుగా నిలువగా, రీస్ టాప్లీ 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో రెండో వన్డే బరిలోకి దిగాడు. దీంతో శ్రేయస్‌ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఆఖరి వన్డే 17న మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆరంభానికి చహల్ తూట్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాయ్, బెయిర్‌స్టో జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి 4 ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 46/1. చహల్ (4/47) అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్‌కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్‌స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4) షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆదుకున్న అలీ, విల్లీ ఇంగ్లండ్ 102 స్కోరుకే ప్రధానమైన సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఊరించే బంతులు వేసిన హార్దిక్ పాండ్యా... లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో అలీతో జతకట్టిన డేవిడ్ విల్లే పరుగుల బాధ్యతను పంచుకున్నారు. ఒక పరుగు వద్ద విల్లీ ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. అయితే కట్టుదిట్టమైన భారత బౌలింగ్ వల్ల రన్‌రేట్ మందగించింది. ఇద్దరు ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200పైచిలుకు చేరాక అలీ, కాసేపటికి విల్లీ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో తగినన్ని పరుగులు రాలేదు. టాప్ లేపిన టాప్లీ ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9) టాప్లీ పేస్‌కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్ పంత్ (0)ను కార్స్ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్ పెట్టాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది! జట్టు స్కోరు 140 పరుగుల వద్ద జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 23; బెయిర్‌స్టో (బి) చహల్ 38; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 11; స్టోక్స్ (ఎల్బీ) (బి) చహల్ 21; బట్లర్ (బి) షమీ 4; లివింగ్‌స్టోన్ (సి) సబ్–శ్రేయస్ (బి) పాండ్యా 33; అలీ (సి) జడేజా (బి) చహల్ 47; విల్లీ (సి) సబ్–శ్రేయస్ (బి) బుమ్రా 41; ఓవర్టన్ నాటౌట్ 10; కార్స్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–41, 2–72, 3–82, 4–87, 5–102, 6–148, 7–210 బౌలింగ్: షమీ 10–0–48–1, బుమ్రా 10–1–49–2, హార్దిక్ 6–0–28–2, ప్రసిధ్ 8–0–53–1, చహల్ 10–0–47–4, జడేజా 5–0–17–0. -
IND Vs SA: క్లాసెన్ కొట్టేశాడు
కటక్: వరుసగా రెండోది పాయే! సిరీస్‌కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్‌ల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీ సవాల్‌కు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌కు తొలి టి20 మ్యాచ్‌ను సమర్పించుకున్న టీమిండియా... రెండో టి20లో సఫారీ బౌలింగ్ దెబ్బకు తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మిగతా వారిలో తొలుత ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. నోర్జే 2 వికెట్లు తీశాడు. తర్వాత దక్షిణాఫ్రికా ఆరంభంలో భువనేశ్వర్ (4–0–13–4) స్పెల్‌కు ఘోరంగా దెబ్బతిన్నా... తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులతో సులువుగానే గెలిచింది. సిరీస్‌లోని మూడో టి20 మ్యాచ్ రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. పేలవ ఆరంభంతో... రుతురాజ్ (1)ను తొలి ఓవర్లోనే రబడ అవుట్ చేయడంతో మొదలైన భారత్ కష్టాలు ఆఖరి దాకా సాగాయి. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తనశైలి మెరుపులతో అలరించాడు. కానీ ఇది కాసేపే! 28 పరుగుల వద్ద పార్నెల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన కిషన్ దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. మరుసటి ఓవర్లోనే నోర్జే బౌలింగ్‌లో డీప్‌స్క్వేర్ లెగ్‌లో డసెన్‌కు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు. తర్వాత చప్పగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ఓవర్లో 4, 6 కొట్టి ఊపు తెచ్చాడు. కానీ పదో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ రిషభ్ పంత్ (5)ను కేశవ్ మహరాజ్ బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయి 71 పరుగులే చేసింది. కాస్త గ్యాప్ తర్వాత 13వ ఓవర్లో పార్నెల్ వేసిన ఇన్‌స్వింగర్ హార్దిక్ పాండ్యా (9) లెగ్వికెట్ను పడగొట్టేసింది. ప్రధాన వికెట్లన్నీ పడిపోయిన ఈ దశలో మరింత బాధ్యతగా ఆడాల్సిన శ్రేయస్ అయ్యర్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల వికెట్ కీపర్ చేతుల్లోకి వెళుతున్న బంతిని టచ్ చేసి అవుటయ్యాడు. వంద పరుగుల్లోపే ఐదో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ ఆఖర్లో కొట్టిన షాట్లతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. రబడ, ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఆశలు రేపిన భువీ భారత్ చేసింది తక్కువే. సఫారీ ఛేదించాల్సిన లక్ష్యం సులువైందే! కానీ సీనియర్ సీమర్ భువనేశ్వర్ వైవిధ్యమైన బంతులతో తన ప్రతీ ఓవర్లో వికెట్ తీయడం భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. ఓపెనర్ హెండ్రిక్స్ (4), టాపార్డర్ బ్యాట్స్ర్లు ప్రిటోరియస్ (4), డసెన్ (1)లను భువీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 29 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ బవుమా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన క్లాసెన్ నాలుగో వికెట్‌కు 64 పరుగులు, తర్వాత మిల్లర్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లపై క్లాసెన్ చెలరేగిపోయాడు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో క్లాసెన్ రెండు ఫోర్లు, అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు... చహల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్స్‌లు బాదాడు. గెలుపు వాకిట క్లాసెన్, పార్నెల్ అవుటైనప్పటికీ డేవిడ్ మిల్లర్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) కేశవ్ (బి) రబడ 1; ఇషాన్ కిషన్ (సి) డసెన్ (బి) నోర్జే 34; శ్రేయస్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 40; పంత్ (సి) డసెన్ (బి) కేశవ్ 5; హార్దిక్ పాండ్యా (బి) పార్నెల్ 9; అక్షర్ (బి) నోర్జే 10; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 30; హర్షల్ పటేల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–3, 2–48, 3–68, 4–90, 5–98, 6–112. బౌలింగ్: రబడ 4–0–15–1, పార్నెల్ 4–0–23–1, నోర్జే 4–0–36–2, ప్రిటోరియస్ 4–0–40–1, షమ్సీ 2–0–21–0, కేశవ్ మహరాజ్ 2–0–12–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (బి) చహల్ 35; హెండ్రిక్స్ (బి) భువనేశ్వర్ 4; ప్రిటోరియస్ (సి) అవేశ్ (బి) భువనేశ్వర్ 4; డసెన్ (బి) భువనేశ్వర్ 1; క్లాసెన్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) హర్షల్ 81; మిల్లర్ (నాటౌట్) 20; పార్నెల్ (బి) భువనేశ్వర్ 1; రబడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–29, 4–93, 5–144, 6–147. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–13–4, అవేశ్ ఖాన్ 3–0–17–0, హార్దిక్ పాండ్యా 3–0–31–0, చహల్ 4–0–49–1, హర్షల్ 3–0–17–1, అక్షర్ 1–0–19–0, శ్రేయస్ 0.2–0–2–0. -
Ind Vs SA 1st T20: మిల్లర్, డసెన్ విధ్వంసం.. భారత్ ఓటమి
న్యూఢిల్లీ: టి20ల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు. 200కుపైగా పరుగులు చేశాక భారత్ ఓడటం ఇదే తొలిసారి కాగా...దక్షిణాఫ్రికా టి20ల్లో ఇదే అత్యధిక ఛేదన. రెండో టి20 ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ అర్ధ శతకం భారత్ తొలి 5 ఓవర్లలో 36/0 స్కోరే చేసింది. ఈ సాదాసీదా స్కోరు తర్వాతి 5 ఓవర్లలో పూర్తిగా మారింది. ఓపెనర్లు కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (15 బంతుల్లో 23, 3 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పారు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో గైక్వాడ్ సిక్స్, కిషన్ 2 ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 50 దాటింది. పార్నెల్ ఓవర్లోనూ భారీ సిక్సర్ బాదిన రుతురాజ్ మరో షాట్‌కు యత్నించి బవుమా చేతికి చిక్కాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులోకి రాగా... 8, 9, 10వ ఓవర్లలో ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు దంచేయడంతో జట్టు స్కోరు 100 దాటింది. అయ్యర్ బ్యాట్ ఝళిపిస్తున్న దశలో కేశవ్ వేసిన 11వ ఓవర్లో సఫారీ వికెట్ కీపర్ డికాక్ సులువైన స్టంపింగ్‌ను మిస్ చేశాడు. సిక్సర్‌తో కిషన్ (37 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని తర్వాతి బంతిని గాల్లోకి లేపగా అది మిడ్వికెట్లో ముగ్గురు ఫీల్డర్ల మధ్యలో నేలపాలైంది. ధాటిగా ఆడిన పంత్, పాండ్యా ఇషాన్, అయ్యర్ 6.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కేశవ్ మహరాజ్ వేసిన 13వ ఓవర్లో కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా 2 సిక్సర్లు, 2 బౌండరీలతో 20 పరుగులు పిండాడు. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి రివ్యూతో బయటపడ్డాడు. కానీ ఆఖరి బంతికి మళ్లీ షాట్ ఆడి లాంగాన్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే శ్రేయస్ జోరుకు ప్రిటోరియస్ బ్రేకులేశాడు. అయితే ఆఖరి 4 ఓవర్లలో కెప్టెన్ పంత్, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లకు ముచ్చెమటలు తప్పలేదు. 17వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో పంత్ 18 పరుగులు రాబట్టగా, 18వ ఓవర్లో హార్దిక్ 4, 6తో 13 పరుగులు వచ్చాయి. మళ్లీ పాండ్యా సిక్స్, ఫోర్‌తో 19 ఓవర్లోనే భారత్ 200 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో పంత్ అవుటవ్వగా, పాండ్యా సిక్సర్‌తో మరో 9 పరుగులు జతయ్యాయి. మిల్లర్, డసెన్ మెరుపు ఫిఫ్టీలతో... భారీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవుమా (10) వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో 3 సిక్సర్లతో చెలరేగిన ప్రిటోరియస్ (13 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్సర్లు)ను తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు. కాసేపటికి ఓపెనర్ డికాక్ (22)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. కానీ తర్వాత వచ్చిన మిల్లర్, డసెన్ భారీ షాట్లతో కొండంత లక్ష్యాన్ని కరిగించడంతో ఆ ఉత్సాహం కాస్తా నీరుగారింది. మిల్లర్ 22 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. హర్షల్ వేసిన 17వ ఓవర్లో డసెన్ 6, 6, 4, 0, 6, 0తో 22 పరుగులు పిండేశాడు. దీంతో 37 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అతని ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. 36 బంతుల్లో 78 పరుగుల అసాధ్యమైన సమీకరణాన్ని ఇద్దరు మెరుపులతో మార్చేశారు. వారి బ్యాటింగ్ వేగానికి భారత పేసర్లు అడ్డుకట్ట వేయలేకపోవడంతో 200 పైచిలుకు పరుగులు చేసినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. 29 పరుగుల వద్ద వాన్ డెర్ డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ వదిలేయడం కూడా దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఆ తర్వాత డసెన్ మరో 46 పరుగులు సాధించాడు. దినేశ్ కార్తీక్ నాడు–నేడు భారత్ తమ తొలి టి20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్ భారత్‌కు 160వది...నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్‌నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) కేశవ్ 76; రుతురాజ్ (సి) బవుమా (బి) పార్నెల్ 23; అయ్యర్ (బి) ప్రిటోరియస్ 36; పంత్ (సి) వాన్‌డెర్ డసెన్ (బి) నోర్జే 29; పాండ్యా నాటౌట్ 31; దినేశ్ కార్తీక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–57, 2–137, 3–156, 4–202. బౌలింగ్: కేశవ్ 3–0–43–1, రబడ 4–0–35–0, నోర్జే 4–0–36–1, పార్నెల్ 4–0–32–1, షమ్సీ 2–0–27–0, ప్రిటోరియస్ 3–0–35–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 22; బవుమా (సి) పంత్ (బి) భువనేశ్వర్ 10; ప్రిటోరియస్ (బి) హర్షల్ 29; వాన్‌డెర్ డసెన్ నాటౌట్ 75; మిల్లర్ నాటౌట్ 64; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–22, 2–61, 3–81. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–43–1, అవేశ్ 4–0–35–0, చహల్ 2.1–0–26–0, పాండ్యా 1–0–18–0, హర్షల్ 4–0–43–1; అక్షర్ 4–0–40–1. That's that from the 1st T20I. South Africa win by 7 wickets and go 1-0 up in the 5 match series.#TeamIndia will look to bounce back in the 2nd T20I. Scorecard - https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/1raHnQf4rm — BCCI (@BCCI) June 9, 2022 -
నిర్లక్ష్యం... ఓ పరాజయం
అహ్మదాబాద్ పిచ్‌పై టెస్టు విజయాలందుకున్న భారత్ పొట్టి ఫార్మాట్లో కూడా స్పిన్ ఉచ్చునే బిగిద్దామనుకుంది. ఏకంగా తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. జట్టు కూర్పుపై... ప్రత్యేకించి స్పిన్ బౌలింగ్‌పై కనబరిచిన శ్రద్ధ బ్యాటింగ్‌పై మరచినట్లుంది. అందుకే టీమిండియా టాపార్డర్ వికెట్లను నిర్లక్ష్యంగా పడేసుకొని భారీ మూల్యమే చెల్లించుకుంది. ఓటమితో టి20 సిరీస్‌ను మొదలుపెట్టింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శుభారంభం చేసింది. అహ్మదాబాద్: టెస్టుల్లో తమను ఓడించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు (డబ్ల్యూటీసీ) అర్హత సాధించిన భారత్‌కు టి20ల్లో ‘నంబర్‌వన్’ ఇంగ్లండ్ తడాఖా చూపింది. స్పిన్ పిచ్‌పై స్పిన్నర్లను చితగ్గొట్టి మరీ పొట్టి ఫార్మాట్లో ఇంగ్లండ్ గట్టి దెబ్బ తీసింది. శుక్రవారం తొలి టి20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించిన మోర్గాన్ బృందం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఇంగ్లండ్ పేసర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్చర్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో రాహుల్‌కు జతగా ధావన్ ఓపెనింగ్ చేశాడు. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది. చెత్త షాట్లతో బోల్తా టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ చెత్తషాట్లతో టాపార్డర్‌ను కోల్పోయింది. ఆర్చర్ వేసిన రెండో ఓవర్లోనే రాహుల్ (1) వికెట్లపై ఆడుకొని పెవిలియన్ చేరాడు. వచ్చీరాగానే స్పిన్నర్ రషీద్ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా వికెట్లను విడిచి మరీ షాట్‌కు ప్రయత్నించిన కెప్టెన్ కోహ్లి (0) మిడాఫ్‌లో జోర్డాన్ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే కానీ 2 వికెట్లను కోల్పోయింది. ఆర్చర్ నాలుగో ఓవర్లో రిషభ్ పంత్ 6, 4 బాదాడు. ఇక మెరుపులు మొదలయ్యాయనుకునే లోపే ధావన్ (4) రూపంలో మరో దెబ్బ! ఐదో ఓవర్లో ధావన్ హుక్ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. 20 పరుగులకే భారత్ టాప్–3 వికెట్లను కోల్పోయింది. దీంతో పంత్, శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పదో ఓవర్లో స్టోక్స్ యువ హిట్టర్ పంత్ వికెట్‌ను పడేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 48/4. ఈ దశలో అయ్యర్‌కు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. ఆదుకున్న అయ్యర్ ఆది నుంచి కష్టాల పాలైన భారత్ స్కోరు 50 చేరేందుకు 11 ఓవర్లు పట్టాయి. మందకొడిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 15వ ఓవర్ కాస్త ఊపిరి పోసింది. స్టోక్స్ వేసిన ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్, బౌండరీ బాదడంతో మొత్తం 12 పరుగులొచ్చాయి. ఆర్చర్ వేసిన తదుపరి ఓవర్లో అయ్యర్ రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధసెంచరీ సాధించిన అయ్యర్... జోర్డాన్ బౌలింగ్‌లో దూసుకొచ్చిన బౌన్సర్‌ను స్క్వేర్ వైపు కొట్టిన సిక్సర్ మెరుపునే తలపించింది. దీంతోనే జట్టు స్కోరు వందకు చేరింది. కానీ ఆ తర్వాత ఓవర్లోనే ఆర్చర్ బ్యాట్స్‌మెన్ జోరుకు, భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించాక వరుస బంతుల్లో పాండ్యా (19; 1 ఫోర్, 1 సిక్స్), శార్దుల్ (0)లను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన అయ్యర్ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. రఫ్పాడించిన రాయ్ ఫార్మాట్ మారింది. అయినా సరే స్పిన్‌తోనే చుట్టేద్దామనుకునే ఆతిథ్య ఎత్తుగడను ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, బట్లర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) తిప్పికొట్టారు. చహల్ తొలి ఓవర్లో రాయ్ 6, 4లతో 11 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బట్లర్ దాన్ని రిపీట్ చేశాడు. దీంతో మరో 13 పరుగులొచ్చాయి. పవర్ ప్లేలోనే ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. రాయ్ స్పిన్నర్లే లక్ష్యంగా చెలరేగాడు. అక్షర్ వేసినా... చహల్ తిప్పేసిన తను మాత్రంలో ఫోర్లు, సిక్సర్లతో దంచేశాడు. ఎట్టకేలకు బట్లర్‌ను చహల్ ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో బుమ్రా (59 వికెట్లు)ను దాటేసి చహల్ (60 వికెట్లు) టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బట్లర్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 72 పరుగులకే చేరింది. చకచకా బాదుతున్న రాయ్... సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు. తర్వాత మలాన్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 1సిక్స్), బెయిర్‌స్టో (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశారు. రాయ్, బట్లర్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) వుడ్ 4; రాహుల్ (బి) ఆర్చర్ 1; కోహ్లి (సి) జోర్డాన్ (బి) రషీద్ 0; పంత్ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 21; అయ్యర్ (సి) మలాన్ (బి) జోర్డాన్ 67; పాండ్యా (సి) జోర్డాన్ (బి) ఆర్చర్ 19; శార్దుల్ (సి) మలాన్ (బి) ఆర్చర్ 0; సుందర్ (నాటౌట్) 3; అక్షర్ పటేల్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–2, 2–3, 3–20, 4–48, 5–102, 6–102, 7–117. బౌలింగ్: రషీద్ 3–0–14–1; జోఫ్రా ఆర్చర్ 4–1–23–3; వుడ్ 4–0–20–1; జోర్డాన్ 4–0–27–1; స్టోక్స్ 3–0–25–1; సామ్ కరన్ 2–0–15–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (ఎల్బీ) (బి) సుందర్ 49; బట్లర్ (ఎల్బీ) (బి) చహల్ 28; మలాన్ (నాటౌట్) 24; బెయిర్‌స్టో (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 2 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–72, 2–89. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–24–0; భువనేశ్వర్ 2–0–15–0; చహల్ 4–0–44–1; శార్దుల్ ఠాకూర్ 2–0–16–0; హార్దిక్ పాండ్యా 2–0– 13–0; వాషింగ్టన్ సుందర్ 2.3–0–18–1. -
ఓటమి లాంఛనం ముగిసింది
అనూహ్యం, అద్భుతంలాంటివేమీ జరగలేదు. కొంత గౌరవప్రదమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి మనోళ్లు పోరాడగలరనుకున్న ఆశా నెరవేరలేదు. టెస్టు మ్యాచ్ తొలి రోజు బ్యాటింగ్‌లో భారత్ చూపించిన తడబాటు చివరకు పరాజయం వరకు కొనసాగింది. సోమవారం ఆటలో మిగిలిన 6 భారత వికెట్లు పడగొట్టేందుకు కివీస్‌కు 16 ఓవర్లు సరిపోయాయి. 47 పరుగులు మాత్రమే టీమిండియా జోడించగా... విజయానికి అవసరమైన 9 పరుగులను రెండో ఓవర్లో కివీస్ అందుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో వరుసగా ఏడు టెస్టుల్లో విజయాల తర్వాత కోహ్లి సేనకు ఇది తొలి పరాజయం కాగా... ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌లు ఓడిన అనంతరం సొంతగడ్డపై దక్కిన విజయంతో కివీస్‌కు ఊరట లభించింది. పైగా ఇది న్యూజిలాండ్‌కు 100వ టెస్టు విజయం కావడం ఆ జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. వెల్లింగ్టన్: టి20, వన్డే సిరీస్‌లు సమంగా ముగిసిన తర్వాత జరుగుతున్న టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బేసిన్ రిజర్వ్ మైదానంలో సోమవారం నాలుగో రోజు తొలి సెషన్లోనే ముగిసిన తొలి టెస్టులో కివీస్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 144/4తో ఆట ప్రారంభించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ 5 వికెట్లతో చెలరేగగా... ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 183 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించగా, కివీస్ ముందు 9 పరుగుల లక్ష్యం నిలిచింది. ఓపెనర్లు లాథమ్ (7 నాటౌట్), బ్లన్‌డెల్ (2 నాటౌట్) కలిసి 1.4 ఓవర్లలో ఈ స్కోరు సాధించి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 29 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. అందరూ అదే దారిలో... 39 పరుగులు వెనుకబడిన స్థితిలో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. మూడో ఓవర్లోనే రహానే (75 బంతుల్లో 29; 5 ఫోర్లు)ను కీపర్ క్యాచ్ ద్వారా బౌల్ట్ వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లోనే సౌతీ చక్కటి ఇన్‌స్వింగర్‌తో విహారి (15)ని బౌల్డ్ చేయడంతో ఇద్దరు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. మరోవైపు క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు రిషభ్ పంత్ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... అశ్విన్ (4) కూడా సౌతీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇషాంత్ (12)ను గ్రాండ్‌హోమ్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్ వేసిన సౌతీ... పంత్, బుమ్రా (0)ల వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్‌కు 10 బంతులు సరిపోయాయి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 165; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 348; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) బౌల్ట్ 14; మయాంక్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 58; పుజారా (బి) బౌల్ట్ 11; కోహ్లి (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 19; రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 29; విహారి (బి) సౌతీ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 25; అశ్విన్ (ఎల్బీ) (బి) సౌతీ 4; ఇషాంత్ (ఎల్బీ) (బి) గ్రాండ్‌హోమ్ 12; షమీ (నాటౌట్) 2; బుమ్రా (సి) (సబ్) మిషెల్ (బి) సౌతీ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (81 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–27; 2–78; 3–96; 4–113; 5–148; 6–148; 7–162; 8–189; 9–191; 10–191. బౌలింగ్: సౌతీ 21–6–61–5; బౌల్ట్ 22–8–39–4; గ్రాండ్‌హోమ్ 16–5–28–1; జేమీసన్ 19–7–45–0; ఎజాజ్ పటేల్ 3–0–18–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (నాటౌట్) 7; బ్లన్‌డెన్ (నాటౌట్) 2; మొత్తం (1.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 9. బౌలింగ్: ఇషాంత్ 1–0–8–0; బుమ్రా 0.4–0–1–0. -
ప్రియా సెంచరీ వృథా
బ్రిస్బేన్: తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 81 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. జార్జియా రెడ్మేన్ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, సిక్స్), ఎరిన్ అలెగ్జాండ్రా బర్న్స్ (59 బంతుల్లో 107; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. భారత ‘ఎ’ బౌలర్లలో దేవిక వైద్యకు రెండు వికెట్లు లభించాయి. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ 44.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పూనియా (127 బంతుల్లో 112; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 98 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే షెఫాలీ అవుటయ్యాక... ప్రియా సెంచరీ పూర్తి చేసుకోగా... మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. హేమలత, అరుంధతి రెడ్డి, అనూజా పాటిల్, తనూజ కన్వర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఫలితంగా భారత ‘ఎ’ మహిళలకు ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...
గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్ 1–2తో ఒమన్ చేతిలో ఓడింది. ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ రెండు గోల్స్ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున సారథి సునీల్ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్ చేశాడు. ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్ జారవిడిచాడు. సునీల్ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్ ఖాతా తెరవలేదు. అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా బ్రెండన్ ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్ భారత గోల్ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్ ఆటగాడు అహ్మద్ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ 82వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. -
ఆశలు సమాధి చేస్తూ...
కలలు కల్లలవడం అంటే ఇదేనేమో! ఆశలు అడియాసలు కావడమంటే ఇలాగేనేమో! దూసుకుపోతున్న రేసు గుర్రాన్ని దురదృష్టం వెంటాడితే ఈ తీరునే ఉంటుందేమో! అంచనాలను చేరుతున్నా... శిఖరం అంచుల్లోంచి జారిపడిపోయిన దృష్టాంతాలకు ఇదే నిదర్శనమేమో! తేలికైన ప్రత్యర్థిగా భావిస్తే అసలుకే మోసం తెచ్చింది. మనకు తిరుగులేదనుకుంటే తలొంచాల్సి వచ్చింది. స్వింగుతో కంగుతినిపించి స్పిన్‌తో చుక్కలు చూపింది. వెరసి... ప్రపంచ కప్ ఊహలను చెల్లాచెదురుచేస్తూ టీమిండియాకు న్యూజిలాండ్ అతిపెద్ద ఝలక్ ఇచ్చింది. ఇంతటి బాధాకర ఓటమిలోనూ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్‌లు) ఓదార్పునిచ్చింది. వెటరన్ ధోని పోరాటంతో పరువు దక్కింది. మనకు మిగిలిందిక... ప్రపంచ కప్‌ను పెద్దగా ఆసక్తి లేని సాధారణ ప్రేక్షకుడిగా వీక్షించడమే! మాంచెస్టర్: కోట్లాది అభిమానులను హతాశులను చేస్తూ... టీమిండియా ప్రపంచ కప్ పోరాటం సెమీఫైనల్‌తోనే ముగిసింది. లీగ్ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న కోహ్లి సేన ప్రస్థానానికి నాకౌట్లో న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్‌లో కివీస్ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. అంతకుముందు ప్రత్యర్థి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ (3/43)కు మూడు వికెట్లు దక్కాయి. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి బృందం 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. అద్భుత పోరాటం సాగించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. అతడికి అండగా నిలిచిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కుర్రాళ్లు రిషభ్ పంత్ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్ చేర్చి ఆదిలోనే కివీస్‌కు పట్టు చిక్కేలా చూసిన పేసర్ మ్యాట్ హెన్రీ (3/37)ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. బౌల్ట్ (2/42), సాన్‌ట్నర్ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తలపడుతుంది. రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హార్దిక్ అప్పుడే ఆశలు ఆవిరి... టోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (1), గత మ్యాచ్‌లో శతకం బాదిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (1)తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి (1)లను... ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో అలా ఔట్ చేసి భారత్‌ను తేరుకోలేనంత దెబ్బకొట్టింది కివీస్. దీంతో ఇటీవల ఎన్నడూ లేనివిధంగా భారత్ 5/3 గణాంకాలతో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పేసర్లను పంత్, దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6) కాసేపు కాచుకున్నారు. దూకుడైన పంత్ వికెట్ పారేసుకునే ప్రమాదం ఉండటంతో కార్తీక్ ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో బంతిని కొంత ఆలస్యంగా ఆడిన కార్తీక్... నీషమ్ అందుకున్న మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు. ధోని, జడేజా సరిగ్గా పవర్ ప్లే చివరి బంతికి కార్తీక్ పెవిలియన్ చేరగా స్కోరు 24/4. ఈ కప్‌లో అతి తక్కువ పవర్ ప్లే స్కోరు ఇదే కావడం గమనార్హం. హిట్టింగ్‌కు మారు పేరైన పంత్, పాండ్యా సహనం చూపుతూ ఐదో వికెట్‌కు 77 బంతుల్లో 47 పరుగులు జోడించి కాస్త ఒడ్డున పడేశారు. విజృంభించి బౌండరీలు కొట్టని స్థితిలో వీలు చూసుకుని సింగిల్స్ తీశారు. అయితే, స్పిన్నర్ సాన్‌ట్నర్‌పై భారీ షాట్లతో ప్రతాపం చూపబోయి ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా సమయోచితంగా ఆడుతూ ముందుకు నడిపించారు. కానీ, 11 బంతుల వ్యవధిలో వీరిద్దరితో పాటు భువనేశ్వర్ (0), చహల్ (5)లను పెవిలియన్ చేర్చిన కివీస్ మ్యాచ్‌ను వశం చేసుకుంది. టాపార్డర్ 1..1..1.. బ్యాటింగ్‌లో టాపార్డర్ భారత్‌కు పెట్టని బలం. దీనికితగ్గట్లే టోర్నీలో రోహిత్ (648), రాహుల్ (361), కోహ్లి (443) పరుగులు చేశారు. కానీ, సెమీస్‌లో ఈ ముగ్గురూ కలిపి చేసింది మూడే పరుగులు. వారు సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ పరుగులే కీలకంగా మారి! మంగళవారం నాటి స్కోరు 46.1 ఓవర్లలో 211/5 నుంచి బుధవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మిగతా 23 బంతుల్లో 28 పరుగులు జోడించి 239/8 వద్ద ఇన్నింగ్స్ ముగించింది. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, సిక్స్)ను బుమ్రా వేసిన 48వ ఓవర్ చివరి బంతికి చురుకైన త్రో ద్వారా రనౌట్ చేసిన జడేజా; ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (10)ను చక్కటి క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి హెన్రీ (1) సైతం వెనుదిరిగాడు. బౌల్ట్ (3), సాన్‌ట్నర్ (9) చివరి ఓవర్ ఎదుర్కొని ఏడు పరుగులు జత చేశారు. ఈ మొత్తం 28 పరుగుల్లో కొన్నింటిని నిరోధించగలిగినా... మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో? స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్ (సి) రవీంద్ర జడేజా (బి) చహల్ 67; రాస్ టేలర్ (రనౌట్) 74; నీషమ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 12; గ్రాండ్‌హోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16; లాథమ్ (సి) రవీంద్ర జడేజా (బి) భువనేశ్వర్ 10; సాన్‌ట్నర్ (నాటౌట్) 9; హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 1; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50ఓవర్లలో 8 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200, 6–225, 7–225, 8–232. బౌలింగ్: భువనేశ్వర్ 10–1–43–3; బుమ్రా 10–1–39–1; హార్దిక్ పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్ 10–0–63–1. భారత్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 1; రిషభ్ పంత్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) సాన్‌ట్నర్ 32; దినేశ్ కార్తీక్ (సి) నీషమ్ (బి) హెన్రీ 6; హార్దిక్ పాండ్యా (సి) విలియమ్సన్ (బి) సాన్‌ట్నర్ 32; ధోని (రనౌట్) 50; రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77; భువనేశ్వర్ (బి) ఫెర్గూసన్ 0; చహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 221 వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–24, 5–71, 6–92, 7–208, 8–216, 9–217, 10–221. బౌలింగ్: బౌల్ట్ 10–2–42–2, హెన్రీ 10–1–37–3, ఫెర్గూసన్ 10–0–43–1, గ్రాండ్‌హోమ్ 2–0– 13–0, నీషమ్ 7.3–0–49–1, సాన్‌ట్నర్ 10–2–34–2. సాహో జడేజా... భళా ధోని 30.3 ఓవర్లకు స్కోరు 92/6. సాధించాల్సిన రన్‌రేట్ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు. టర్నింగ్ పాయింట్ : ధోని రనౌట్ హెన్రీ, ఫెర్గూసన్ ఓవర్లలో ఫోర్లు కొట్టిన జడ్డూ... సాన్‌ట్నర్ స్పిన్ వలయాన్ని ఛేదిస్తూ లాంగాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌లతో ప్రతాపం చూపాడు. 39 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అప్పటికి ధోని ఇంకా 28 పరుగుల వద్దే ఉండటం గమనార్హం. బౌలర్ ఎవరైనా లెక్క చేయనంతటి జోష్‌లో అతడు ఫెర్గూసన్ ఓవర్లో సిక్స్, బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ దంచాడు. జడేజా–ధోని 97 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఇందులో జడేజావే 69 పరుగులు ఉండటం విశేషం. ఇదే క్రమంలో జట్టు స్కోరును 200 సైతం దాటించారు. గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్‌లో పొంచి ఉన్న విలియమ్సన్ ఒడిసి పట్టాడు. కొంత క్లిష్టమే అయినా అవకాశాలు ఉన్న ఈ పరిస్థితిలో ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతినే బ్యాక్వర్డ్ పాయింట్లోకి సిక్స్‌కు పంపి ధోని ఆశలు రేపాడు. మరుసటి బంతికి పరుగులు తీయని మహి... మూడో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో స్క్వేర్ లెగ్ నుంచి గప్టిల్ విసిరిన డైరెక్ట్ రాకెట్ త్రోకు రనౌటయ్యాడు. ఈ ఓవర్ చివరి బంతికి భువీ బౌల్డ్ అవడంతో ఏ మూలనో ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. వరుణుడా...? దెబ్బకొట్టావ్! ‘న్యూజిలాండ్‌తో కలిసి వరుణుడు సెమీఫైనల్లో టీమిండియాను ఓడించాడు’... ఫలితాన్ని విశ్లేషిస్తే ఇది సరైనదేమోననే అనిపిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా మంగళవారం మ్యాచ్ పూర్తిగా సాగి ఉంటే కివీస్ విధించే 230 లేదా 240 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించేలా కనిపించిన భారత్‌కు... వాన కారణంగా వాయిదా పడటం ప్రతికూలమైంది. బుధవారం చల్లటి వాతావరణంలో ప్రత్యర్థి పేసర్లు చెలరేగిపోయారు. బౌల్ట్ వంటి ఎడమ చేతివాటం పేసర్‌కు బంతి స్వింగ్ అయ్యే వీలుచిక్కడం; హెన్రీ కచ్చితమైన డెలివరీలకు రోహిత్, రాహుల్ తడబడటం దెబ్బకొట్టింది. ఈ జట్టు చేతిలో ఓడటమేంటబ్బా? కివీస్‌పై కచ్చితంగా గెలుస్తామనే అంచనాల మధ్య భారత్ ఓటమి అభిమానులను తీవ్రంగా బాధించేదే. కప్‌లో రెండు జట్లు భిన్న నేపథ్యాల నుంచి సెమీస్ చేరడమే దీనికి కారణం. ఇంగ్లండ్‌పై ఓటమి తప్ప అప్రతిహత విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు సిద్ధమవగా; న్యూజిలాండ్ లీగ్ చివర్లో తేలిపోయింది. అంతా కోహ్లి సేనకు ఇంగ్లండ్ ఎదురవుతుందని అనుకుంటే కివీస్ అనూహ్యంగా తారసపడి అంతే ఆశ్చర్యకరమైన షాకిచ్చింది. విలియమ్సన్, టేలర్ తప్ప ఎవరూ ఫామ్‌లో లేని ఆ జట్టుపై ‘ఎలాగైనా మనమే గెలుస్తాం’ అని ఊహల్లో ఉన్న భారత వీరాభిమానులను ఈ పరాజయం కొన్ని రోజులు వెంటాడటం ఖాయం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రీ (3/37) కూర్పు ఒప్పు... తప్పు మంగళవారం సెమీస్‌కు మైదానంలో దిగిన భారత తుది జట్టులో పేసర్ షమీ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన అతడిని శ్రీలంకతో మ్యాచ్‌కు పక్కన పెట్టడమే అనూహ్యం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆడించకపోవడం ఏం వ్యూహమో అర్థం కాలేదు. అటువైపు కివీస్ స్పిన్నర్ సాన్ట్నర్నే నమ్ముకుని, ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లను తీసుకుంది. భారత్ మాత్రం కుల్దీప్ బదులు చహల్‌ను తుది పదకొండులో చేర్చింది. అతడు విఫలమవ్వగా సహచర స్పిన్నర్ జడేజా చకచకా బంతులేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తుంటే చహల్ పరుగులిస్తూ పోయాడు. పాత కాలపు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఆలోచనకు భారత్ స్వస్తి పలికి మూడో పేసర్‌గా షమీని ఆడిస్తే కివీస్‌కు పుంజుకొనే అవకాశమే రాకపోయేది. కివీస్ అప్పుడు... ఇప్పుడు... వరుణుడి చలవతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది న్యూజిలాండ్. సహ ఆతిథ్యమిచ్చిన 2015 కప్‌లోనూ ఆ జట్టు వర్షం ప్రభావిత మ్యాచ్ ద్వారానే తుది సమరానికి అర్హత పొందింది. నాడు మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా డివిలియర్స్ (45 బంతుల్లో 65 నాటౌట్) భీకర హిట్టింగ్తో 43 ఓవర్లలో 281/5తో భారీ స్కోరు దిశగా వెళ్తుండగా వర్షం అడ్డుకుంది. తర్వాత లక్ష్యాన్ని 43 ఓవర్లలో 299 పరుగులుగా నిర్దేశించారు. గ్రాంట్ ఇలియట్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో మరో బంతి మాత్రమే ఉండగా కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది. రిటైర్మెంట్పై ధోని నాకేమీ చెప్పలేదు టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్‌తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్పై మాకేమీ చెప్పలేదు. – భారత కెప్టెన్ కోహ్లి నేడు రెండో సెమీఫైనల్ ఇంగ్లండ్ X ఆస్ట్రేలియా వేదిక : బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ –1లో ప్రత్యక్షప్రసారం -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఒక్క గెలుపు లేకుండానే...
క్రాల్‌జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్‌లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి. ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి.