మిల్లర్, డసెన్ విజయానందం
న్యూఢిల్లీ: టి20ల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు.
200కుపైగా పరుగులు చేశాక భారత్ ఓడటం ఇదే తొలిసారి కాగా...దక్షిణాఫ్రికా టి20ల్లో ఇదే అత్యధిక ఛేదన. రెండో టి20 ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్‌రమ్ ఈ మ్యాచ్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు.
ఇషాన్ కిషన్ అర్ధ శతకం
భారత్ తొలి 5 ఓవర్లలో 36/0 స్కోరే చేసింది. ఈ సాదాసీదా స్కోరు తర్వాతి 5 ఓవర్లలో పూర్తిగా మారింది. ఓపెనర్లు కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (15 బంతుల్లో 23, 3 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పారు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో గైక్వాడ్ సిక్స్, కిషన్ 2 ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 50 దాటింది. పార్నెల్ ఓవర్లోనూ భారీ సిక్సర్ బాదిన రుతురాజ్ మరో షాట్‌కు యత్నించి బవుమా చేతికి చిక్కాడు.
తర్వాత శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులోకి రాగా... 8, 9, 10వ ఓవర్లలో ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు దంచేయడంతో జట్టు స్కోరు 100 దాటింది. అయ్యర్ బ్యాట్ ఝళిపిస్తున్న దశలో కేశవ్ వేసిన 11వ ఓవర్లో సఫారీ వికెట్ కీపర్ డికాక్ సులువైన స్టంపింగ్‌ను మిస్ చేశాడు. సిక్సర్‌తో కిషన్ (37 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని తర్వాతి బంతిని గాల్లోకి లేపగా అది మిడ్‌వికెట్‌లో ముగ్గురు ఫీల్డర్ల మధ్యలో నేలపాలైంది.
ధాటిగా ఆడిన పంత్, పాండ్యా
ఇషాన్, అయ్యర్ 6.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కేశవ్ మహరాజ్ వేసిన 13వ ఓవర్లో కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా 2 సిక్సర్లు, 2 బౌండరీలతో 20 పరుగులు పిండాడు. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి రివ్యూతో బయటపడ్డాడు. కానీ ఆఖరి బంతికి మళ్లీ షాట్ ఆడి లాంగాన్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కాసేపటికే శ్రేయస్ జోరుకు ప్రిటోరియస్ బ్రేకులేశాడు. అయితే ఆఖరి 4 ఓవర్లలో కెప్టెన్ పంత్, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లకు ముచ్చెమటలు తప్పలేదు. 17వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో పంత్ 18 పరుగులు రాబట్టగా, 18వ ఓవర్లో హార్దిక్ 4, 6తో 13 పరుగులు వచ్చాయి. మళ్లీ పాండ్యా సిక్స్, ఫోర్‌తో 19 ఓవర్లోనే భారత్ 200 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో పంత్ అవుటవ్వగా, పాండ్యా సిక్సర్‌తో మరో 9 పరుగులు జతయ్యాయి.
మిల్లర్, డసెన్ మెరుపు ఫిఫ్టీలతో...
భారీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవుమా (10) వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో 3 సిక్సర్లతో చెలరేగిన ప్రిటోరియస్ (13 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్సర్లు)ను తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు.
కాసేపటికి ఓపెనర్ డికాక్ (22)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. కానీ తర్వాత వచ్చిన మిల్లర్, డసెన్ భారీ షాట్లతో కొండంత లక్ష్యాన్ని కరిగించడంతో ఆ ఉత్సాహం కాస్తా నీరుగారింది. మిల్లర్ 22 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
హర్షల్ వేసిన 17వ ఓవర్లో డసెన్ 6, 6, 4, 0, 6, 0తో 22 పరుగులు పిండేశాడు. దీంతో 37 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అతని ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. 36 బంతుల్లో 78 పరుగుల అసాధ్యమైన సమీకరణాన్ని ఇద్దరు మెరుపులతో మార్చేశారు.
వారి బ్యాటింగ్ వేగానికి భారత పేసర్లు అడ్డుకట్ట వేయలేకపోవడంతో 200 పైచిలుకు పరుగులు చేసినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. 29 పరుగుల వద్ద వాన్ డెర్ డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ వదిలేయడం కూడా దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఆ తర్వాత డసెన్ మరో 46 పరుగులు సాధించాడు.
దినేశ్ కార్తీక్ నాడు–నేడు
భారత్ తమ తొలి టి20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్ భారత్‌కు 160వది...నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్‌నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) కేశవ్ 76; రుతురాజ్ (సి) బవుమా (బి) పార్నెల్ 23; అయ్యర్ (బి) ప్రిటోరియస్ 36; పంత్ (సి) వాన్‌డెర్ డసెన్ (బి) నోర్జే 29; పాండ్యా నాటౌట్ 31; దినేశ్ కార్తీక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211.
వికెట్ల పతనం: 1–57, 2–137, 3–156, 4–202.
బౌలింగ్: కేశవ్ 3–0–43–1, రబడ 4–0–35–0, నోర్జే 4–0–36–1, పార్నెల్ 4–0–32–1, షమ్సీ 2–0–27–0, ప్రిటోరియస్ 3–0–35–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 22; బవుమా (సి) పంత్ (బి) భువనేశ్వర్ 10; ప్రిటోరియస్ (బి) హర్షల్ 29; వాన్‌డెర్ డసెన్ నాటౌట్ 75; మిల్లర్ నాటౌట్ 64; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–22, 2–61, 3–81.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–43–1, అవేశ్ 4–0–35–0, చహల్ 2.1–0–26–0, పాండ్యా 1–0–18–0, హర్షల్ 4–0–43–1; అక్షర్ 4–0–40–1.
That's that from the 1st T20I.
— BCCI (@BCCI) June 9, 2022
South Africa win by 7 wickets and go 1-0 up in the 5 match series.#TeamIndia will look to bounce back in the 2nd T20I.
Scorecard - https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/1raHnQf4rm
Comments
Please login to add a commentAdd a comment